రాజకీయ నాయకులు ప్రజాసేవ ఎంతవరకు చేస్తారో మనకు తెలియదు. ప్రజాసేవ ముసుగులో సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. ఆస్తులు పెంచుకుంటారు. వారి వారసులను ప్రజల మీద రుద్దుతారు.
రాజకీయ నాయకులకు సంబంధించి ఇదో కోణం. మరోటి… పార్టీల అధినేతలకు నిరంతరం భజన చేయడం. వీళ్ళు అన్నం, నీళ్లు లేకపోయినా ఉంటారేమోగానీ భజన చేయకుండా ఉండలేరు. భజన చేయకపోతే వీరికి బతుకు ఉండదు. అంటే రాజకీయ జీవితం ఉండదు. కాబట్టి భజన చేయాల్సిందే. ఈ భజన చేసే క్రమంలో ఒక్కోసారి వీరికి బుర్ర సరిగా పనిచేయదు. జ్ఞానం నశిస్తుంది. చారిత్రిక వాస్తవాలు గుర్తుకు రావు.
కన్యాశుల్కంలో గురజాడ అన్నట్లుగా మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్ టైపులో మిగిలిపోతారు. ఇలా మిగిలిపోయిన అనేకమంది నాయకుల్లో తెలంగాణలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఒకడు. ఈయన చాలా సీనియర్ పొలిటీషియన్. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉండి సొంత ప్రయోజనాల కోసం గులాబీ పార్టీలోకి వచ్చాడు. ఈయన కుమారుడి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
సరే …ఎమ్మెల్యే అతి భజన విషయానికొద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుతో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఫ్రీడమ్ ర్యాలీలు తీస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 75 అడుగుల జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుర్ర తక్కువ (ఎమ్మెల్యేని ఇలా అనకూడదేమో. కానీ ఆయన చేసిన పనికి ఇలా అనడమే సరైంది) వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 75 సంవత్సరాల క్రితం భారత దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. ఇలా అన్న తరువాత ఈ పొరపాటుకు ఎమ్మెల్యే వనమా నాలిక కరుచుకున్నాడో లేదో తెలియదు. ఆయన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లోనూ కేసీఆర్ భజన చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 లో. కేసీఆర్ పుట్టింది 1954 లో. ఆయన్ని పొగుడుతున్న ఎమ్మెల్యేకు ఈ సంగతి తెలియదా?