కొన్ని రోజులుగా తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్‌రెడ్డి, వెంకటరెడ్డి చేస్తున్న రాజకీయ రచ్చ అంతాఇంతా కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పి, తనది ఉప ఎన్నిక దారి అని క్లారిటీ ఇచ్చారు. అయితే రాజగోపాల్‌రెడ్డి అన్న, ఎంపీ వెంకటరెడ్డి మాత్రమే ఏదీ తేల్చుకోలేకున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ, రేవంత్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారు.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిని చేయడం కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లోనే ఉంటున్న తమలాంటి వాళ్లకు కాకుండా, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించడం బాధ కలిగించొచ్చు. అయితే కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకుడిగా రేవంత్‌రెడ్డికి తెలంగాణలో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. దీన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుగా అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
కాంగ్రెస్‌లో ఉన్నసీనియర్ నేతలకు అంత సీన్ లేదనే నిర్ణయానికి అధిష్టానం రావడం వల్లే రేవంత్‌రెడ్డిని ఎంచుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాపారాల కోసం ఇటు కేసీఆర్, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో స్నేహం చేస్తున్న సంగతి వాస్తవమా? కాదా? ఇలాంటి వాళ్లు కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోగలరు? అనే ప్రశ్న సహజంగానే పౌర సమాజం నుంచి వస్తోంది.
తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా వెంకటరెడ్డి కూడా హూందాగా నడుచుకుని వుంటే బాగుండేది. అద్దంకి దయాకర్ మాటల్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డిని వెంకటరెడ్డి రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నాలను తెలంగాణ సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ ఒక్క విషయంలో రేవంత్ తెలివిగా వ్యవహరించారు. వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పి పెద్దరికాన్ని నిలుపుకున్నారు. అయినప్పటికీ అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టాలనే డిమాండ్‌ను వెంకటరెడ్డి తీసుకురావడం ద్వారా పలుచన అయ్యారు.
క్షమాపణ చెప్పినా ఒక దళిత నేతను క్షమించే పెద్ద మనసు వెంకటరెడ్డికి లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ రోజు వరకూ వెంకటరెడ్డి మౌనంగా ఉన్నారు. ఇంతటితో ఆయన పెద్దరికంగా వ్యవహరిస్తే గౌరవం దక్కుతుంది. లేదంటే అభాసుపాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తానెలా నడుచుకోవాలనేది ఆయన ఆలోచనలపై ఆధారపడి వుంటుంది.