టీడీపీ సీనియర్ నాయకుడు, తిరుపతి పార్లమెంట్ కమిటీ పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు చెక్ పెట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తిరుపతిలో టీడీపీని బలి పెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారని అధిష్టానం సీరియస్‌గా ఉంది.
టీడీపీ హయాంలో నరసింహ యాదవ్ తుడా చైర్మన్‌గా పని చేశారు. అప్పట్లో సొంత పార్టీ నాయకుడు మస్తాన్‌నాయుడు తన వద్ద నరసింహయాదవ్ భారీ మొత్తంలో డబ్బు గుంజారంటూ బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
అలాగే టౌన్ బ్యాంక్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి చేతులెత్తేయడంలో నరసింహయాదవ్ పాత్ర కూడా ఉందని టీడీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే తిరుపతిలో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయన్ను తప్పులను పార్టీ చూసీచూడనట్టు వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇక ఉపేక్షిస్తే… పార్టీని పూర్తిగా ముంచుతారనే భయాందోళనలో నాయకులు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్షింతల కృష్ణా యాదవ్‌ను తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమిస్తూ అచ్చెన్నాయుడు ఉత్తర్వులిచ్చారు. కృష్ణా యాదవ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ వాసి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి కీలక పదవులు ఇవ్వడం కుదరదని, కావున నరసింహయాదవ్‌ను తప్పించేందుకే టీడీపీ పెద్దలు పథక రచన చేశారని సమాచారం.
నేడోరేపో నరసింహయాదవ్‌ను తప్పించి, మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని నియమించే అవకాశం ఉంది. తిరుపతి టీడీపీలో సంస్కరణలు చేపట్టిందనేందుకు ఇదే నిదర్శనం. రానున్న రోజుల్లో కీలక పోస్టుల్లో ఉన్న వాళ్లను తప్పించే ఆలోచనలో పార్టీ ఉందని సమాచారం.