టాలీవుడ్ గిల్డ్ కు సంబంధించి నిన్నటికి నిన్న మరో వార్త గుప్పు మంది. ఓ గిల్డ్ సభ్యురాలు మరో గిల్డ్ సభ్యుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారన్నది ఈ వార్త.
విషయం ఏమిటంటే హీరో విశ్వక్ సేన్ తన హోమ్ బ్యానర్ మీద ఓ సినిమా చేస్తున్నారు. దాని కోసం ఓ ఫైట్ చిత్రీకరణ వుంది. దానికోసం ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఎక్కడెక్కడి నుంచో ఫైటర్లను తీసుకువచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రావు రమేష్ ఊటికి వెళ్లిపోవాల్సి వుండడం, బల్గేరియా నుంచి ఫైటర్లు రావడం, 70 లక్షల సెట్ వేసి వుండడంతో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ గిల్డ్ బంద్ అడ్డం పడింది.
అయితే చిన్న సినిమాల షూటింగ్ లు చేసుకోవచ్చు అనే సడలింపు వుంది. ఆ నిబంధన ప్రకారం దాదాపు 16 సినిమాల షూాటింగ్ లు జరుగుతున్నాయి కూడా. అదే విధంగా విశ్వక్ సేన్ తన సినిమా షూటింగ్ నిన్న స్టార్ట్ చేసారు. దాంతో ఓ గిల్డ్ సభ్యురాలు, గిల్డ్ కీలక సభ్యుడు ఒకరు ఫోన్ చేసి కాస్త పరుషంగా మాట్లాడినట్లు నిర్మాతల సర్కిళ్లలో వినిపిస్తోంది.
అవుట్ డోర్ యూనిట్ వారిని హెచ్చరించి పని నిలుపు చేయించినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ అన్నది నిర్మాత క్షేమం చూడాలి కానీ ఇలా చేయడం ఏమిటి అని యూనిట్ వెళ్లి కౌన్సిల్ నేత సి కళ్యాణ్ కు మొరపెట్టుకోగా, ఆయన సంప్రదింపులు చేసి ఆగస్టు 18 నుంచి షూట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
విశ్వక్ సేన్ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా, సినిమా ఎలా పూర్తి చేసి, విడుదల చేస్తారో చూద్దాం అనే రేంజ్ వరకు ఈ హెచ్చరిక వెళ్లిందని ఓ గిల్డ్ సభ్యడు తెలిపారు. డజనున్నర వరకు సినిమాల షూట్ జరుగుతుంటే ఒక్క విశ్వక్ సినిమా విషయంలో ఇలా మాట్లాడడం ఏమిటని ఆ నిర్మాత ప్రశ్నించారు. వివరణ కోసం విశ్వక్ సేన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ నాట్ రీచ్ బుల్ అని వచ్చింది.