రాజకీయాల కోసం వాడుకుని వదిలేయడంలో చంద్రబాబుకు ఘనమైన పేరే వుంది. అయితే ఇందులో ఆయన్ను తప్పు పట్టాల్సిన పనిలేదు. చంద్రబాబును నమ్మి వెళ్లడం తప్పు అవుతుందే తప్ప, ఆయన వాడుకోవడంలో ఎలాంటి నేరం లేదు. ఎందుకంటే, చంద్రబాబు తనకంటూ ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గంలో పయనిస్తూ సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అనిపించుకున్నారు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను కూడా ఆయన విడిచిపెట్టలేదు. మామకు వెన్నుపోటు పొడిచి, సీఎం సీటులో కూచున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. విమర్శల్ని పక్కన పెడితే తాను అనుకున్నట్టు సీఎం కాగలిగారు. ఒకసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఆ పదవిలో కూచున్న నాయకుడిగా రికార్డుకెక్కారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోవడంలో నాటి టీడీపీ నాయకురాలు జయప్రద అస్త్రాన్ని ప్రయోగించారనే ప్రచారం లేకపోలేదు. ఆ తర్వాత జయప్రదకు టీడీపీలో అవకాశం లేకపోయింది. దీంతో ఉత్తరప్రదేశ్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆమె లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా ఆమె సైకిల్ గుర్తుపైనే గెలుపొందడం విశేషం. సమాజ్‌వాదీ పార్టీది సైకిల్ గుర్తు కావడం గమనార్హం.
రాజకీయాల్లో వాడుకునే చంద్రబాబు లాంటోళ్లు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కరివేపాకులుంటారు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. ఎక్కడెక్కడ ఏఏ అవసరాలకు వాడుకోవాలో, అలాంటివి బాగా తెలుసుకుని అస్త్రాలు ప్రయోగించడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. తమ నాయకుడికి తెలిసినన్ని విద్యలు తమకు తెలియక అసూయపడుతుంటారని ప్రత్యర్థులపై చంద్రబాబు మనుషులు విమర్శిస్తుంటారు. తాజాగా చంద్రబాబును తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు కలుసుకున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో సస్పెన్షన్‌కు గురైన నలుగురిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నెల్లూరు రూరల్ సీటును చంద్రబాబు ఓకే చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కూడా సీటు ఇవ్వడం ఖాయం. అయితే నియోజకవర్గం ఏదని తేలాల్సి వుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విషయంలో టీడీపీ నేతలు తేల్చి చెప్పలేకపోతున్నారు.
టికెట్ విషయమై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లే టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినట్టు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అనుచరులు చెబుతున్నారు. చంద్రబాబును శ్రీదేవి కలవడంతో తాడికొండ టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారో అని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ భయపడుతున్నట్టు సమాచారం.
ఒకవేళ శ్రీదేవికి టికెట్ ఇవ్వకపోతే, ఆమె మరో జయప్రదలా మిగిలిపోతారనే విమర్శకు తెరలేచింది. దళిత ఎమ్మెల్యేని కరివేపాకులా వాడుకున్న నాయకుడిగా చంద్రబాబు తన పేరును సుస్థిరంగా చేసుకుంటారు. ప్రస్తుతం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని ఆమె అన్నారు.
చంద్రబాబు ఉన్నారనే ధైర్యం ఉందంటూనే, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీదేవి అనడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో తాడికొండ నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆమె సన్నద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమె భవిష్యత్ చంద్రబాబు చేతల్లో వుంది. ఆయన ముంచుతారా? తేల్చుతారా? అనే ప్రశ్నకు కాలం జవాబు చెప్పాల్సి వుంది.