Advertisement

Advertisement


Home > Politics - Analysis

నితీశ్ పోక.. మోడీకి ప్రమాద ఘంటిక!

నితీశ్ పోక.. మోడీకి ప్రమాద ఘంటిక!

మామూలుగా అయితే.. ఒక రాష్ట్రంలో పొత్తుల్లో ఉన్న అధికార వైభవాన్ని కోల్పోయినంత మాత్రాన భారతీయజనతా పార్టీకి వచ్చే నష్టం ఇసుమంతైనా లేదు. వారికి కేంద్రంలో అధికారంలో ఉండడం మాత్రమే కావాలి. అందుకనే కేంద్రంలో తమ బలానికి గాటు పడుతుందంటే విలవిల్లాడే కమలనాయకులు.. రాష్ట్రాలో పార్టీ బలపడక్కర్లేదని, పొత్తుల బలం ఉన్నా చాలునని భావిస్తుంటారు. ఆ కోణంలో చూసినప్పుడు బీహార్ పరిణామాలు బిజెపిలో వేడి పుట్టించకపోవచ్చు గానీ.. ఈ పరిణామాల్లో వారికి ఒక కొత్త ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం పేరు నితీశ్ కుమార్!

నితీశ్ కుమార్ ఒకప్పట్లో బిజెపితో అనుబంధం కొనసాగించి, ఆ తర్వాత మోడీతో విభేదించి బిజెపికి దూరం జరిగి లాలూప్రసాద్ యాదవ్ తో బంధం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పొత్తు బంధాలు కడతేరిపోయాక మళ్లీ బిజెపి పంచన చేరారు. గత ఎన్నికల సమయానికి బిజెపితో పొత్తుల్లోనే పోటీచేశారు. ఫలితాలు వెల్లడయ్యేసరికి బిజెపికి వచ్చిన సీట్లకంటె నితీశ్ కు చాలా తక్కువ సీట్లు దక్కాయి. అయినా సరే.. కమలదళం చాలా ఉదారంగా.. ఆయననే ముఖ్యమంత్రిని చేయడానికిన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ బంధం కూడా చెడింది.. నితీశ్ మాత్రం తిరిగి లాలూ కుటుంబం చేయి అందుకుని, కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి ఏర్పాటైన కూటమి నేతగా మళ్లీ సీఎం కాబోతున్నారు. 

నితీశ్ ఇన్ని దఫాలుగా కూటములను మారుస్తుండడంపై చాలా ట్రోల్స్, మీమ్స్ వస్తుండొచ్చు గాక.. దేశ ప్రజలు, బిజెపి వాదులు ఆయనను గేలిచేస్తుండవచ్చు గాక.. కానీ బీహార్ ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారా? అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. నిజాయితీగా పరిపాలన సాగిస్తున్న నేతగా నితీశ్ కు చాలా మంచి పేరు ఉంది. ఆయన తన పరిపాలన సుస్థిరంగా ఉండడం కోసం ఎలాంటి దారులు తొక్కినా ప్రజలు ఆయనను సమర్థించే పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తు!

ఎన్డీయే కూటమినుంచి నితీశ్ బయటకు వచ్చిన తరువాత.. ఆయన కేంద్రంలో మోడీ ప్రాబల్యానికి కూడా చెక్ పెడతారనే అంచనాలు మరో ఎత్తు. ఎందుకంటే.. నిజాయితీ, సమర్థ నాయకత్వం విషయంలో నితీశ్ కు చాలా మంచి పేరు ఉంది. వచ్చే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయానికి మోడీ చేతికి మూడోసారి అధికారం దక్కకుండా చేయడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇక నితీశ్ కూడా కీలకం అయ్యే అవకాశం ఉంది. 

గతంలోనే.. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరుకు, నితీశ్ పేరు పోటీగా వచ్చింది. ఇప్పుడు విపక్ష కూటమి తరఫున నితీశ్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే.. ఆ కూటమి బలం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మోడీ హవాకు ఈ దేశంలో ఎప్పటికీ తిరుగులేదని బిజెపి ఎంతగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. వాస్తవంలో అంత సీన్ లేదు.

దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేరు. తెలంగాణను పక్కన పెడితే ఇతర చోట్ల.. అధికారం అనే సోదిలోకి కూడా ఆ పార్టీ వచ్చే అవకాశం లేదు. తతిమ్మా భారత దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఆ విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తే మాత్రం.. అది మోడీకి ప్రమాద సంకేతం అవుతుంది. అలా ఒక్కతాటిమీదకి రావడానికి నితీశ్ వంటి క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎంతో ఉపయోగపడగలరనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మోడీ దళం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో.. నితీశ్ ను దెబ్బతీయడానికి ఎలాంటి మార్గాలను అనుసరిస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?