జనసైనికులు ఆశగా వున్నారు. ఆంధ్రలో మూడో వంతు సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని, తమలో చాలా మందికి అవకాశాలు వస్తాయని. మూడో వంతు అంటే కనీసం 50 స్ధానాలకు పైనే.
కానీ పవన్ అడగడమే 32 స్ధానాలు అడిగారని తెల్లవారుతూనే వార్తలు వచ్చాయి. ఇది నిజంగా షాక్ నే. కనీసం గౌరవప్రదంగా 40 చోట్ల అయినా పోటీ చేస్తుంది అనుకుంటే 32 అడగడం ఏమిటి?
అయినా ఎవరైనా 30-35-40 ఇలా అడుగుతారు తప్ప, ఈ ముఫై రెండు లెక్క ఏమిటి?
ఇదే షాక్ అంటే. ఇరవై సీట్లు మాత్రమే ఇస్తామని చంద్రబాబు అన్నారన్న వార్త మరీ షాక్.
ఆఖరికి 27 ఇవ్వచ్చు అనే బుజ్జగింపు కొసరు వార్త అదనం.
అర్ధ భాగం కాదు కనీసం అయిదు ఊళ్లు అయినా ఇవ్వండి అని దేబిరించినట్లు వుంది ఈ వ్యవహారం. పోనీ ఆ సీట్లు అయినా జనసేన అడిగిన చోట్ల ఇస్తారా? ఇవ్వరట. తెలుగుదేశం సర్వేలో జనసేన గెలవదు అని వచ్చింది.. అందువల్ల అక్కడ ఇవ్వలేము, మరో చోట ఇస్తాము అంటున్నారట.
అంటే వాళ్లకు బలం లేనివి లేదా వాళ్లకు బలమైన నాయకులు లేనివి, లేదా అవి వదిలేసినా ఫరవాలేదు అనుకునేవి జనసేనకు ఇస్తారన్న మాట. నెల్లిమర్ల అడిగితే తమకు బలమైన నాయకుడు వున్నారు, అందువల్ల గజపతినగరం తీసుకోండి అన్నారట. మరి జనసేనకు బలమైన నాయకుడు వున్న స్ధానాల సంగతేమిటి? అలాంటివి లెక్క వేస్తే తెలుగుదేశం లెక్కల్లో ఓ పాతిక వచ్చి వుండొచ్చు. అందుకే ఈ ప్రతిపాదన అన్నమాట.
జనసేన గెలుస్తుందో లేదో జనసేన సర్వే చెప్పదా? లేదా ఆ సర్వే ప్రాతిపదిక కాదా? జనసేన తరపున నిడదవోలులో ఓ అభ్యర్ధి రెడీగా ఫ్లెక్సీలు ఊరంతా కట్టేసుకుని వున్నారు. ఇప్పుడు అది ఇవ్వడం లేదు అని తెలుస్తోంది. మరిక ఆయన అక్కడే వుండి పార్టీ కోసం పని చేస్తారా? ఇంట్లో కూర్చుంటారా?
ఈ వార్తల్లో మరో చిత్రం ఏమిటంటే, జనసేనకు ఇచ్చే స్ధానాల్లో తెలుగుదేశం నాయకులను పిలిచి, బుజ్జిగించి, నచ్చచెప్పిన తరువాతనే బయటకు అనౌన్స్ చేస్తారట. అంటే కనీసం మరో రెండు వారాలు పట్టవచ్చు. స్పష్టమైన క్లారిటీ రావడానికి. అంత వరకు జనసేన పల్లకీ మోస్తున్న వారంతా అయోమయంలో వుండాల్సిందే.
బయటకు వచ్చిన వార్తల్లో అద్భుతమైన సంగతి మరోటి వుంది. అసలు పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అనే పాయింట్ లేకపోవడం. ఆ పాయింట్ పట్టుకుని వెనక్కు వెళ్తే, అసలు విషయం అర్ధం అవుతుంది. నాదెండ్ల, లోకేష్ మీటింగ్ లో లేకపోవడం కూడా అలా వెనక్కు వెళ్తే వచ్చే క్లారిటీకి బలం ఇస్తుంది.
అదేంటీ అంటే ఇదంతా ఓ పెద్ద కంటి తుడుపు వ్యవహారం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకాంత చర్చలు, బేరాలు. ఎక్కువ.. తక్కువ ఇవన్నీ కేవలం కేడర్ ను సంతృప్తి పరచడం కొసం. తమ కోసం తమ నాయకుడు గట్టిగా పోరాడుతున్నాడు అనే కలర్ ఇవ్వడం కోసం. రేపు 32 కాదు 35 ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 32 అడిగితే 35 ఇచ్చారు అనే పాయింట్ తో జనసైనికులు సంతృప్తి చెందాల్సి వుంటుంది. నిజానికి అందరూ కలిసి లోపాయికారీగా ఎప్పుడో ఏ ప్లేస్ లు ఇవ్వాలి అన్నది డిసైడ్ అయిపోయి వుంటుంది. ఈ క్లారిటీ మేరకు ఆయా ప్లేస్ ల్లో నాయకులను సన్నద్దం చేస్తూనే వుండి వుండొచ్చు.
ఇప్పుడే అంతా చెప్పేస్తే ఇక వైకాపాలో అసంతృప్తి అనే వార్తలకు బదులు జనసేనలో ముసలం, తేదేపాలో కుంపటి అలాంటి వార్తలు రాసుకోవాల్సి వుంటుంది. అందుకే ఈ హంగామా అంతా నడపడం.
ఇంకో ముచ్చట ఏమంటే అదేదో. పరమ టాప్ సీక్రెట్ అన్నట్లు పవన్ ఒక్కరే విజయవాడ ట్రాఫిక్ లో డ్రైవ్ చేసుకుంటు వెళ్లడం. డ్రైవర్ వస్తే ఏమవుతుంది.. లోపలకు ఏమీ రాడుగా.. బయటే వుంటారుగా. పైగా కారు వెనుక ఎస్కార్ట్ మాత్రం వేరే రావడం.
దీన్నే డైవర్షన్ టెక్నిక్ అంటారు. అసలు విషయం మీద కన్నా కొసరు విషయం మీద పిచ్చిగా అభిమానించే వాళ్లు డిస్కస్ చేసుకునే పాయింట్ గా మార్చడం. ఈ భ్రమలు అన్నీ తొలిగిపోయిన తరువాత చూడాలి జనసేన వ్యవహారాలు.