తిరుపతిని కూడా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించారు. సోమవారం ముగింపు సదస్సులో భూమన ప్రసంగిస్తూ సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశామన్నారు.
ముఖ్యంగా తిరుపతిని కూడా తిరుమల మాదిరిగా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. హిందూ మత విశ్వాసాలను నమ్మి ఆ ధర్మం ప్రకారం జీవనం సాగించాలనుకునే ఇతర మతస్తులకు తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇతర మతస్తులు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారాలనుకుంటే తిరుమలలో మత మార్పిడి చేయిస్తామని, అలాగే వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
మతాంతీకరణలను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడంతో పాటు బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో నూతన ఆలయాలు నిర్మిస్తామని భూమన తెలిపారు. అలాగే తిరుమలలో ఉన్న 108 తీర్థాలను సందర్శించేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని కరుణాకరరెడ్డి తెలిపారు.
ఇదిలా వుండగా తిరుపతిని తిరుమల తరహాలో గొప్పగా నిర్మిస్తామన్న భూమన వ్యాఖ్యలపై చర్చకు తెరలేచింది. దీనిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఢిల్లీ స్థాయిలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి కీలక చర్చలు జరిపినట్టు సమాచారం.