ఒకప్పుడు అంటే దశాబ్దాల క్రితం ఒక్కో ఎంపీ రెండు నుంచి నాలుగు దఫాలు పదవిలో వుండేవారు. ఆ పదవి ఎవరికీ అంతగా పట్టేది కాదు. చాలా మంది నిశానీలు సైతం ఇరవై ఏళ్ల పాటు ఎంపీలుగా వున్న సందర్భాలు వున్నాయి. ఎంపీల తెలియని తనం ఎలా వుండేది అంటే వాళ్లకు వున్న గ్యాస్ కనెక్షన్, ఫోన్ కనెక్షన్ మంజూరు సౌకర్యాల విలువ తెలియక చాలా మంది ఢిల్లీలో బ్రోకర్లకు ఇచ్చేసేవారు. తరువాత వాటి విలువ తెలిసి అమ్మే వ్యవహారాలు కూడా జరిగి వార్తలకు ఎక్కాయి. అది వేరే సంగతి.
80 వ దశకం వచ్చేసరికి పరిస్థితి మారింది. ఎంపీ పదవి విలువ వేరే విధంగా తెలియడం మొదలైంది. జాతీయ స్థాయిలో పలుకుబడి సంపాదించాలన్నా, కాంట్రాక్టులు, కంపెనీ వ్యవహారాలు చక్కదిద్దాలన్నా, ఆదాయపన్ను సమస్యలు, బ్యాంకు రుణాల వ్యవహారాలు పరిష్కరించుకోవాలన్నా ఎంపీగా వుంటే ఈజీ అనే భావన మొదలైంది. దాంతో చాలా మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఎంపీ సీటు వైపు చూడడం ప్రారంభించారు.
ఆ రోజుల్లో రెండు మూడు కోట్లు ఖర్చు చేస్తే గెలిచే అవకాశం వుండేది. సరైన ఓ 50 కోట్ల ప్రాజెక్టు సంపాదిస్తే అయిదు కోట్లు వస్తాయనే ధీమా వుండేది. అలా అలా ఎంపీ టికెట్ల కోసం మరీ డిమాండ్ కాదు కానీ అభ్యర్ధులు దొరకడం సులువు అయింది. పైగా సరైన సౌండ్ పార్టీ ఎంపీ టికెట్ మీదు పోటీ చేస్తే, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు కాస్త నిధుల సర్దుబాటు కూడా వుండేది.
కానీ మోడీ వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. బ్యాంక్ రుణాల మాఫీ అంత సులువు కాలేదు. కాంట్రాక్టులు రావడం అంత వీజీ కాలేదు. ఎగ్గొట్టడం అంతకన్నా సులువు కాలేదు. రాను రాను ఎంపీ అన్నది అలంకారప్రాయమైన పదివిగా మారిపోయింది. ఎంపీ లాడ్స్ అనే నిధులు కూడా లేవు. వుండి వుంటే కాస్త గిల్లుకునే అవకాశం వుండేది. దాంతో పారిశ్రామిక వేత్తలు ఇక అటు దృష్టి పెట్టి ఖర్చు చేయడం అనవసరం అనే భావనకు గురి కావడం మొదలైంది. ఈ దఫా అంటే 2019-2024 మధ్య ఈ క్లారిటీ ఇంకా బాగా వచ్చేసింది. మరోసారి మోడీ ప్రభుత్వమే వస్తుందనే నమ్మకమూ ఫిక్స్ అయింది.
ఇక ఇలాంటపుడు ఎంపీగా గెలిచి సాధించేది ఏముంది? పైగా ఎంపీగా పోటీ చేస్తే కనీసం 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేయాలి? ఇది ఎలా రాబట్టాలి? అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు ఎంపీ పోస్ట్ కు అభ్యర్ధులు దొరకడం లేదు. ఎంపీ టికెట్ అంటేనే జనం పారిపోతున్నారు. వైకాపా నుంచి గెలిచిన ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్ ఈ సారి పోటీ చేయడం లేదు. ఎంవివి ఈసారి ఎమ్మెల్యేకు పోటీ చేస్తా అంటున్నారు. నిన్నటికి నిన్న ఎంపీ టికెట్ ఇస్తే వద్దు అని చెప్పి తేదేపాలోకి వెళ్లిపోయారు మరో అభ్యర్ధి.
ఎంపీల మాట స్థానికంగా చెల్లుబాటు కాదు. ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు అవుతుంది. ఇటు మాట చెల్లుబాటు కాక, అటు ఎంపీ నిధులు లేక ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ఎంపీ గా పోటీ అంటే అన్నీ పార్టీ పెట్టుకుంటే ఎవరైనా కాస్త ముందుకు వస్తారేమో కానీ, డబ్బులు పెట్టుకుని పోటీ అంటే మాత్రం సమస్యే లేదు. రారు కాక రారు.