ఏళ్లుగా నంది అవార్డులు పెండింగ్ లో పడ్డాయి. గత ప్రభుత్వం ఈ అవార్డులపై హామీ అయితే ఇచ్చింది కానీ పునరుద్ధరించలేదు. ఎట్టకేలకు ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్పష్ట ప్రకటన చేశారు. అయితే నంది అవార్డుల పేరు మార్చారు. గద్దర్ అవార్డుల పేరిట పురస్కారాలిస్తామని తెలిపారు.
“చాలామంది సినీ ప్రముఖులు ఈమధ్య నన్ను కలిశారు. ఆపేసిన నంది అవార్డుల్ని పునరుద్ధరిస్తే బాగుంటుందని కోరారు. వాళ్లకు నేను మాటిచ్చాను. నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందాం. నా మాటనే జీవో, ఇదే శాసనం.”
గద్దర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఈ మేరకు అవార్డులపై ప్రకటన చేశారు. ప్రతి ఏటా గద్దరన్న జయంతి రోజున ఈ అవార్డుల వేడుక నిర్వహిస్తామని కూడా తెలిపారు.
గద్దర్ జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై జయంతి వేడుకలతో పాటు గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కూడా జరగనుంది.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పాటైన తర్వాత నంది అవార్డుల్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అలా దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అవార్డులపై ఏపీ సర్కార్ ఇప్పటికే ప్రకటన చేయగా, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అవార్డులపై విస్పష్ట ప్రకటన చేశారు.