అటు పవన్ ఇటు చంద్రబాబు!

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రా వైపు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలీలో సిద్ధం పేరుతో భారీ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాంధ్రా సెంటిమెంట్…

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రా వైపు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలీలో సిద్ధం పేరుతో భారీ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాంధ్రా సెంటిమెంట్ తో మరోసారి వైసీపీదే విజయం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

దానికి సిద్ధం సభకు వచ్చిన జనాలే సాక్ష్యమని చెబుతున్నారు. వైసీపీ ఉత్తరాంధ్రా మీద దృష్టి పెడుతూంటే విపక్షాలు కూడా అదే ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెడుతున్నాయి. టీడీపీ జనసేన కూడా ఉత్తరాంధ్రా నుంచే తమ రాజకీయం అంటున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నాలుగవ తేదీన అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ సభతో ఆయన ఏపీ మొత్తం విరామం లేకుండా తిరగడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

పవన్ వస్తున్న అదే నాలుగవ తేదీన మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విశాఖ వస్తున్నారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులలో రా కదలిరా సభను నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి మాడుగుల పక్కపక్క నియోజకవర్గాలే.

పైగా చంద్రబాబు పవన్ ఇద్దరూ మిత్రులే. ఇలా ఈ రెండు పార్టీలు ఒకేసారి దాదాపు ఒకే చోట నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం అంటే ఉత్తరాంధ్రా సెంటిమెంట్ ని విపక్ష కూటమి కూడా పండించి ఆ లబ్ది పొందాలని చూస్తోంది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాలలో ప్రజానీకం ఇచ్చే తీర్పుతోనే ఏపీ రాజకీయం మొత్తం ఆధారపడి ఉంది అంటున్నారు. దాంతోనే అధికార విపక్ష పార్టీల నేతలు ఈ వైపుగా వస్తున్నారు. ఈ సభల ద్వారా చంద్రబాబు పవన్ తాము సిద్ధమే అని చెప్పడమే కాకుండా వైసీపీకి ధీటుగా తామూ ఉన్నామని చెప్పాలని చూస్తున్నారు. 

సిద్ధం సభ అయితే అనూహ్యమైన తీరులో విజయవంతం అయింది. పవన్ చంద్రబాబుల సభలను కూడా ఇపుడు పోల్చి చూస్తారు  అలాగే జగన్ తో విపక్ష నేతల ప్రసంగాలను బేరీజు వేస్తారు. అపుడే ఉత్తరాంధ్రా రాజకీయ తులాభారం ఎటు వైపు అన్నది తేలుతుంద‌ని అంటున్నారు.