పార్టీ పెట్టి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు పవన్ కల్యాణ్. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన జనసేన అధ్యక్షుడు, పొలిటికల్ గా ఫ్లాప్ అయ్యారనే విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా, పవన్ పొలిటికల్ కెరీర్ కోసం ఓ ఫ్లాప్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు.
పవన్ కెరీర్ లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. అందులో ఒకటి కెమెరామెన్ గంగతో రాంబాబు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలో కనిపించారు. ఇప్పుడీ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు.
సమాజ హితం కోసం అరాచకాల్ని ఎదుర్కొనే జర్నలిస్ట్ పాత్రలో పవన్ కల్యాణ్ ఈ సినిమాలో కనిపించారు. ఈ ఎన్నికల సీజన్ లో ఈ సినిమా పవన్ కల్యాణ్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని, అందుకే రీ-రిలీజ్ చేస్తున్నామని అన్నారు నిర్మాత నట్టికుమార్. ఈ సినిమాకు ఒరిజినల్ ప్రొడ్యూసర్ దానయ్య. రీ-రిలీజ్ మాత్రం ఆయన చేయట్లేదు.
తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు.