Advertisement

Advertisement


Home > Politics - Analysis

మునుగోడు ఉప ఎన్నికలో అన్న పాత్ర ఉండదా?

మునుగోడు ఉప ఎన్నికలో అన్న పాత్ర ఉండదా?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఈ అన్నదమ్ముల పాత్ర చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు హాట్ టాపిక్ గా మారింది. మునుగోడుతో మీడియా హోరెత్తిపోతోంది. గతంలో హుజూరాబాద్ ఎంతటి చర్చనీయాంశమైందో ఇప్పుడు మునుగోడు అంతటి చర్చనీయాంశమైంది. కాకపొతే అప్పట్లో టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ బయటకు గెంటితే ఆయన బీజేపీలో చేరి పోటీచేసి గెలిచాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎవరూ గెంటకుండానే ఆయనే తన సొంత నిర్ణయంతో బీజేపీలో చేరబోతున్నాడు.

ఆయన ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద తన అక్కసునంతా వెళ్లగక్కాడు. తాను బీజేపీలోకి పోవడానికి ఆయనే కారణమని చెప్పాడు. కాంగ్రెస్ లో ఇంతమంది సీనియర్లు ఉండగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా చేయడమేమిటని మండిపడ్డాడు. అన్న వెంకటరెడ్డిని పార్టీ చీఫ్ గా చేసిఉంటే రాజగోపాల్ రెడ్డి బయటకు పోకపోయేవాడని కొందరు చెబుతున్నారు. 

సరే ... రాజకీయ నాయకులు ఒక పార్టీలో చేరడానికి అంటే ఫిరాయించడానికి సవాలక్ష కారణాలు చెబుతారు. పైకి చెప్పే కారణాలు ఒకలా ఉంటాయి. లోపల కారణాలు మరోలా ఉంటాయి. బీజేపీకి రాజగోపాల్ రెడ్డి అవసరముంది. ఆయనకు బీజేపీ అవసరముంది. బీజేపీకి -రాజగోపాల్ రెడ్డికి  మధ్య ఉన్నది ఆర్ధిక బంధమని అంటున్నారు. ఆయన దాన్ని కొట్టిపారేశాడనుకోండి ...అదే వేరే విషయం. 

ఛత్తీస్ ఘడ్ లో బొగ్గుగనుల కాంట్రాక్టు రాజగోపాల్ కు దక్కటం వెనుక బీజేపీతో గతంలో జరిగిన ఒప్పందమే కారణమని సమాచారం. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారమే రాజగోపాల్ కు బొగ్గు గనులు దక్కటం, అందుకు ప్రతిఫలంగా ఆయన బీజేపీలో చేరడమని సమాచారం. ఒకసారి గనులు దక్కించుకున్న తర్వాత ఇపుడు బీజేపీలో చేరనని చెప్పలేడుగా. 

రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెప్పించి, అందులో గెలిచి కేసీఆర్ ను దెబ్బ తీయాలని బీజేపీ ప్లాన్. అది నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టు ఉండడంతో ఆయన రాజీనామా కాంగ్రెస్ పార్టీకి  ఇబ్బంది కలిగించింది. ఆయన్ని ఆపడానికి అధిష్టానం చేయని ప్రయత్నం లేదు.

ఒక ఎమ్మెల్యే కోసం ఇంతలా ప్రయత్నాలు చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఎట్టకేలకు మునుగోడు పంచాయతీకి తెర పడడంతో కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై దృష్టి సారించింది. ఉప ఎన్నిక ఖాయం కావడంతో మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని టిఆర్ఎస్ పార్టీ, కాషాయ జెండా ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయినా పార్టీని కాపాడుకోవాలని, మళ్లీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగింది కాంగ్రెస్ అధినాయకత్వం.  రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే మునుగోడులో ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ కమిటీని ప్రకటించింది. నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తున్న సమయంలోనే ఆ పార్టీ ఉప ఎన్నికల కమిటీని ప్రకటించడం గమనార్హం. స్ట్రాటజీ - ప్రచార కమిటీకి  మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను కన్వీనర్ గా నియమించింది. కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అనిల్ కుమార్ లను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కానీ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే .... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో మునుగోడు నియోజకవర్గం కూడా ఉంది.

అయినప్పటికీ  ఆయనకు స్థానం కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిక్కం ఠాకూర్ ఈ జాబితాను ప్రకటించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీలో ద్వితీయ శ్రేణిలో ఉన్న బలమైన నాయకులను పార్టీ నుండి బయటకు వెళ్లకుండా మంతనాలు జరుపుతోంది. 

ఇక తాజాగా కమిటీని ప్రకటించి మునుగోడు పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సోదరుడి రాజీనామా నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పరపతి తగ్గిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా వెంకటరెడ్డికి ఉప ఎన్నికకు సంబంధించి మరో విధమైన బాధ్యతలు అప్పగిస్తారా? అధిష్టానం వ్యూహం అర్ధం కాకుండా ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?