నందమూరి-నారా: ‘వెన్నుపోటు’ నిజంగానే ‘చారిత్రక అవసరం’

గత పాతిక-ముప్పై ఏళ్లుగా చంద్రబాబుని “వెన్నుపోటు” బ్రాండ్ అంబాసడర్ గా ఊదరగొట్టారు. కానీ అదొక చారిత్రక అవసరమంటూ చెప్పుకొచ్చేవారు చంద్రబాబుకి వెన్నంటి నిలిచిన పత్రికలవారు. ఆ అవసరం ఏవిటో మాత్రం క్లారిటీ ఇచ్చేవారు కాదు.…

గత పాతిక-ముప్పై ఏళ్లుగా చంద్రబాబుని “వెన్నుపోటు” బ్రాండ్ అంబాసడర్ గా ఊదరగొట్టారు. కానీ అదొక చారిత్రక అవసరమంటూ చెప్పుకొచ్చేవారు చంద్రబాబుకి వెన్నంటి నిలిచిన పత్రికలవారు. ఆ అవసరం ఏవిటో మాత్రం క్లారిటీ ఇచ్చేవారు కాదు. గట్టిగా అడిగితే లక్ష్మీపార్వతిని చూపించేవారు. అయితే అదంతా డైవెర్షన్ పాలిటిక్స్ అని, అసలు “చారిత్రక అవసరం” మరొకటని ఇప్పుడనిపిస్తోంది. 

నందమూరి వారసుల్ని పిచ్చివాళ్లని చేసి నారా బాబు పార్టీని లాగేసుకున్నాడని ఆయన్ని ఆడిపోసుంటారు కానీ నిజానికి ఆయన ఆ పని చెయ్యకపోయుంటే ఆంధ్ర ప్రజలు ఏమైపోయేవారో అని తలచుకుంటేనే భయమేస్తోంది. 

ఒక గొప్ప నాయకుడి కడుపున పుట్టిన వాళ్లల్లో ఒకరో ఇద్దరో నాయకత్వ లక్షణాలు లేక, ఆసక్తికరంగా మాట్లాడే కనీస ప్రతిభ లేక, మైండుకి నాలుకకి మధ్య కరెంటు సరిగా ప్రసరించక కాస్త తేడాగా ఉన్నారంటే పోనీలే అనుకోవచ్చు. 

కానీ అదేంటో సకుటుంబ సపరివార సమేతంగా అందరికందరే అన్నట్టుగా ఉంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. 

ఒక్క నందమూరి హరికృష్ణని, దగ్గుబాటి పురందేశ్వరినీ మినహాయిస్తే నారా భువనేశ్వరీదేవితో సహా అందరూ ఆణిముత్యాలే. 

అందుకేనేమో…తేడా లేని హరికృష్ణ, పురందేశ్వరిలు ఈ కుటుంబంతో పెద్దగా ఇమడలేకపోయారు. హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ కూడా ఇప్పటికీ దూరమే! 

అంటే కాస్త విషయమున్న వాళ్లు సహజంగానే వీళ్లకి దూరమవడమో, లేక విషయమున్న వాళ్లు కూడా ఈ బ్యాచుతో ఉంటే తేడాగా మారడమో..ఏదో జరుగుతోందిక్కడ! 

ఎన్.టి.ఆర్ తర్వాత ఆ స్థాయి ఇమేజున్న నందమూరి వారసుడు బాలకృష్ణ. అంతా దబిడిదిబిడే. తానేం మాట్లాడతాడో తనకే తెలీదు. అక్కడ కూడా బట్టీ కొట్టుకొచ్చిన నాలుగు శ్లోకాలో పద్యాలో వదలడం ఆయన రివాజు. ఆయన మాటల్లో మ్యాటరేంటో డీకోడ్ చెయ్యాలంటే సగటు మనిషికి సాధ్యం కాదు. మాటే కాదు ఈయన మైండులో కూడా ఇబ్బంది ఉందని ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్లు ఎప్పుడో గన్ షూటింగ్ సంఘటనలో భాగంగా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సుప్రసిద్ధ వైద్యులు దివంగత కాకర్ల సుబ్బారావు కూడా ఆ సమయంలో బాలకృష్ణ ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించిన వారిలో ఉన్నారు.

ఇక ఆయనగారి మిగిలిన అన్నదమ్ములంతా అదోరకమో, పూర్తి మౌనమో తప్ప నాయకత్వ లక్షణం ఒక్కళ్ళకి లేదు. 

పోనీ వాళ్ల సంతానంలో ఎవరున్నారా అని చూస్తే జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ…. ఎవరూ అడక్కపోయినా నందమూరి కుటుంబం తరపున ఏదైనా ఖండించాలనుకుంటే సొంత వీడియో ఒకటి వదులుతాడు. ఆ వీడియో ట్రోలింగ్ కి గురి కవడానికి తప్ప దేనికీ పనికిరాదు.

అలాగే పాపం సుహాసిని కూడా మొహమాటానికో, నిజంగా అనిపించో ఏదో ఒకటి మాట్లాడడానికి కెమెరా ముందుకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడల్లా “అయ్యో ఎందుకుమ్మా నీకీ మీడియా కష్టాలు” అనాలనిపిస్తుంది. 

మిగిలిన మనుషులు కనిపిస్తుంటారు కానీ వాళ్లు నోరు విప్పితే ఎలా ఉంటుందో తెలిసే మౌనం వహిస్తారేమో మరి తెలియదు! 

ఇక లోకేష్ విషయానికొస్తే ఎన్ని ట్రోలింగులున్నాయో లెక్కపెట్టడం కష్టం. ఇతనిలో చంద్రబాబు రక్తంతో పాటు అటు నందమూరి రక్తం కూడా ఉండడమే ఈ లోపానికి కారణంలా ఉంది.  అదేంటో కానీ ఇతను ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు ఈ తొట్రుపాటులు వినపడవు. అక్కడంతా బాగానే ఉంటుంది. కానీ “తెలుగు”దేశం పార్టీ నాయకుడయ్యుండి తెలుగులో మాట్లాడలేకపోవడం విడ్డూరం. తెలుగు మాట్లాడేటప్పుడు నాలుకే కాదు, బుర్ర కూడా పనిచెయ్యకపోవడం మరీ విడ్డూరం. 

ఇదిలా ఉంటే మొన్నటి వరకు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి రంగంలోకి దిగితే సీన్ వేరేగా ఉంటుంది అని కొందరు తెదేపా అభిమానులు చెప్తుంటే విన్నాను. గతంలో ఆమె హెరిటేజ్ మీటింగుల్లో ఇంగ్లీషులో ప్రసంగం చేస్తే కొంతవరకు ఆ అభిప్రాయం నిజమేనేమో అనిపించింది. కానీ తాజాగా ఆమె కూడా భయభ్రాంతులకి గురిచేసింది. 

మహిళా రిజర్వేషన్లో  తనకి మెరిట్ సీటు వచ్చిందని చెప్పింది. రిజర్వేషన్లో మెరిట్ సీటు రావడమేంటి? 

తన మామగారు ఐటీని ఇండియాకి తెచ్చారంది. అదేవిటి? 

డైరెక్టుగా ఆయన్ని అరెస్టు చెయ్యడాన్ని ఖండిస్తున్నాని చెప్పింది. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఇండైరెక్టుగా చెయ్యాలనా? 

ఇలా మెదడుకి, నాలుకకి పొంతన లేకుండా మాట్లాడి ఈమె కూడా బాలకృష్ణ కుమార్తె అనిపించుకుంది. 

ఇలా లోకేష్, బ్రాహ్మణి ఇద్దరూ దొందూ దొందే అనిపించారు. 

ఒక పచ్చ చానల్ ప్రకారం ఈ బ్రాహ్మణి మాటలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. రాబోయే రెండు మూడు తరాలకి సరిపడా నాయకత్వాన్ని తెదేపా చాటుకుందట. 

చంద్రబాబుని జైల్లో పెట్టి జగన్ మోహన్ రెడ్డి తెదేపాలో ఉన్న యువనాయకత్వ శక్తిని జనానికి పరిచయం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడట. 

నందమూరి కుటుంబాన్ని అభిమానించడంలో తప్పు లేదు కానీ, అదే పనిగా అభిమానిస్తే అభిమానులు కూడా వాళ్లలాగే తయారవుతారన్నది కనిపిస్తున్న సత్యం. కళ్లముందు ఖాళీ శీసా కనిపిస్తున్నా, దాని నిండా ఎంత గాలుందో చూడండి అని ప్రచారం చేసే వెర్రి అభిమానం పిచ్చితో సమానం. 

డొక్కశుద్ధి ఉన్నవాడు, మాటలతో ఎమోషన్ పండించగలిగేవాడు, బహుభాషా కోవిదుడు, జనాదరణ ఉన్న హీరో జూనియర్ ఎన్.టి.ఆర్ మాత్రం ఈ కుటుంబానికి దూరంగా ఉండడం తెదేపాకి పట్టిన పాపం. చంద్రబాబు హ్యాంగోవర్లో పడి ఉన్న ఒక్క దిక్కునీ లేకుండా చేసుకుంది ఈ కుటుంబం. 

అదలా ఉంచితే, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, పోసాని కానీ, ఇంకెవ్వరైనా కానీ.. తెదేపాని లాక్కుని తన సీటు కింద పెట్టుకున్న చంద్రబాబుని అధిక్షేపించాల్సిన పనిలేదు. ఈ నందమూరి బ్యాచుని చూస్తుంటే చంద్రబాబు చాలా బెటరనిపిస్తున్నాడు. 

ఎన్.టి.ఆర్ కి వెన్నులో పోటు తెప్పించినా, జనానికి గుండెపోటు తప్పించాడు. 

కుట్రో, కుయుక్తో, మీడియా మేనేజ్మెంటో, వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకోవడమో…ఇలా ఏదో ఒకటి చేసి తన బతుకు తాను బతికి నోట్లో నాలుక, బుర్రలో గుజ్జు లేని నందమూరి కుటుంబానికి బాసటగా నిలిచాడు. అంతే కాదు వాళ్ల ప్రతిభ ఇన్నేళ్లుగా బయటపడకుండా తొక్కిపెట్టగలిగాడు. 

పాపం ఆయన జైల్లో పడగానే ఈ కుటుంబం రోడ్డెక్కి తన ప్రతిభ చాటుకుంటోంది. 

ఇప్పటికైనా సరే..త్వరగా చంద్రబాబు బయటికి రావాలని తెలుగు ప్రజలని ఈ నందమూరి ప్రజ్ఞాప్రదర్శన నుంచి విముక్తుల్ని చెయ్యాలని కోరుకుందాం. 

కొసమెరుపేంటంటే, ఒక్క తెలుగు వాక్యం కూడా సరిగా పలకలేని ఈ బ్యాచంతా “తెలుగుదేశం”పార్టీ తరపున ఇంగ్లీషు మీడియం విద్యకి వ్యతిరేకంగా “తెలుగు భాషోద్యమం” చేస్తున్నారు. స్వర్గీయ ఎన్.టి.ఆర్ ఆత్మ శాంతించుగాక! 

హరగోపాల్ సూరపనేని