
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను విచారణ సంస్థలు ఎలా ప్రశ్నిస్తాయి? అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల విషయంలో ప్రశ్నిస్తున్నారు పలువురు మేథావులు! వీరిలో చాలా మంది మాజీ బ్యూరోక్రాట్లున్నారు. చంద్రబాబు అరెస్టుపై వీరు ఇలా స్పందిస్తున్నారు.
మరి మంత్రివర్గ నిర్ణయాలను విచారణ సంస్థలు ప్రశ్నించడం అంత తప్పు అయితే, మంత్రివర్గ నిర్ణయాలపై విచారణ చేపడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప , మంత్రులపై, ముఖ్యమంత్రులపై కాదని రామప్పంతుల్లలా వీరు మాట్లాడటం బాగానే ఉంది! మరి ఈ మేథావులు ఇప్పుడే ఎందుకు ఇలా స్పందిస్తున్నారు.. సరిగ్గా ఇలాంటి ఎపిసోడ్ పుష్కర కాలం కిందట కూడా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా అనే అంశం గుర్తుకు వస్తుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పరిచాకా జగన్ మోహన్ రెడ్డిపై క్విడ్ ప్రో కో కేసులు నమోదయ్యాయి. అది కూడా జగన్ పార్టీ పెట్టిన రెండు మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై ఆ కేసులన్నీ నమోదయ్యాయి. అదేమంటే.. వైఎస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కొందరికి లబ్ధి కలిగిందని, వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, ఇదంతా క్విడ్ ప్రో కో అని అప్పుడు సీబీఐ వాదించింది. ఆ కేసుల్లో జగన్ అరెస్టు కూడా ఆగమేఘాల మీద జరిగింది. జగన్ కు తేలికగా బెయిల్ రాలేదు. ఏకంగా 16 నెలల పాటు జగన్ జైల్లో గడపాల్సి వచ్చింది.
అక్కడకూ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తమ వివరాలన్నీ ఇచ్చాయి. జగన్ కంపెనీల్లో తాము పెట్టిన పెట్టుబడులు ఎంత, కేబినెట్ నిర్ణయాల వల్ల తమకు కలిగిన లబ్ధి ఎంత.. అనే అంశంపై నెత్తినోరు మొత్తుకున్నాయి. కేబినెట్ నిర్ణయం వల్ల తమకు కలిగిన లబ్ధి కోటి అనుకుంటే.. జగన్ కంపెనీల్లో తాము పెట్టిన పెట్టుబడి పదుల కోట్లని అవి వివరించాయి. చట్టబద్ధంగా పెట్టిన పెట్టుబడులు అని వాపోయాయి.
లంచాలను ఎవరైనా పెట్టుబడులుగా ఇస్తారా? పది రూపాయల లాభానికి వంద రూపాయల లంచం ఇస్తామా? అంటూ కూడా అడిగాయి! అలాగే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు లాభనష్టాల్లో జగన్ తో పంచుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించాయి! మరి అన్ని చెప్పినా.. జగన్ ను ఇప్పటికీ ఆర్థిక నేరగాడు అంటూ తెలుగుదేశం పార్టీతో సహా పచ్చవర్గాలన్నీ అంటాయి!
మరి అప్పుడు ఈ మేథావులు స్పందించలేదు! అసలు కేబినెట్ నిర్ణయాలకు జగన్ ఎలా బాధ్యుడు అవుతాడు? అంటూ వారు ప్రశ్నించలేదు! కేబినెట్ నిర్ణయాల్లో తప్పులు ఉంటే.. ముఖ్యమంత్రికే సంబంధం లేదు, కేబినెట్ లోని మంత్రులకూ సంబంధం లేదు అని ఇప్పుడు చెబుతున్న వారు, అప్పుడు ముఖ్యమంత్రి తనయుడు అని చెప్పి జగన్ ఎలా బాధ్యుడిని చేశారని ఒక్కడంటే ఒక్కడు ప్రశ్నించారా లేదు!
కేబినెట్ నిర్ణయాలను విచారణ సంస్థలు ప్రశ్నించజాలవని చెబుతున్న మేథావులు అప్పుడు మౌనంగా చూశారే! వైఎస్ కేబినెట్ లో జగన్ మంత్రి కాదు, అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు! అయినప్పటికీ కేబినెట్ నిర్ణయాలనే పరిగణనలోకి తీసుకుని జగన్ ను అరెస్టు చేశారు. జగన్ ఏ రోజైనా సెక్రటేరియట్ కు వచ్చినట్టుగా కానీ, ఎవరికైనా కాల్ చేసి ప్రభావితం చేసినట్టుగా కానీ ఆధారాలను చూపకుండానే పదహారు నెలల పాటు సీబీఐ జైల్లో పెట్టింది. ఇప్పటికీ ఆ కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది!
మరి నాటి కేబినెట్ నిర్ణయాల్లో జగన్ పాత్రకు అసలు సంబంధమే లేదు, చంద్రబాబు నాయుడు డైరెక్టుగా నిర్ణయాన్ని తీసుకుని డబ్బులు విడుదల గురించి కూడా ఒత్తిడి తీసుకు వచ్చారని స్పష్టం అవుతోంది. అయినా చంద్రబాబు నాయుడు చాలా మంచోరట! సాంకేతికంగా ఆయనపై కేసులే పెట్టకూడదట! జగన్ విషయంలో మాత్రం ఇలా కాదట! ఏమిరా మీ న్యాయం!
హిమ
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా