బాబు మీద మోజు, భాజపాను వదలాలంటే భయం!

జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా చిత్రమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అని ఆయన తేల్చి చెప్పేశారు. పొత్తుల గురించిన మొట్టమొదటి అధికారిక ప్రకటన రాజమండ్రి…

జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా చిత్రమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అని ఆయన తేల్చి చెప్పేశారు. పొత్తుల గురించిన మొట్టమొదటి అధికారిక ప్రకటన రాజమండ్రి జైలు ప్రాంగణం బయట వెలువడింది. అదే సమయంలో.. ఐదేళ్లుగా భారతీయ జనతా పార్టీతో కొనసాగిస్తున్న భాగస్వామి బంధాన్ని తెంచుకుంటున్నట్టా? ఉంచుకుంటున్నట్టా? అనే సందేహాలు పలువురికి కలిగాయి.  

ఇదే సందేహం పవన్ కళ్యాణ్ కు కూడా ఏర్పడినట్లు ఉంది. అందుకే తాము ఇప్పటికీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామని, ఆ కూటమిలోంచి బయటకు రాలేదని ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఒకరు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే మనకు ముఖ్యం.. అని పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు బహుశా బిజెపి తెలుగుదేశం రెండు పార్టీలు కూడా తమకు సమానమే అనే సంకేతం ఇస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. తమాషా ఏమిటంటే..  భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు కూడా తానే సర్వాధికారిని అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండడం.

ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు అనే విషయంలో భారతీయ జనతా పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. తొలినుంచి ఆ పార్టీ నాయకులు, పొత్తు అనేది అధిష్టానం పరిధిలో ఉన్న నిర్ణయం అని మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఎపిసోడ్ లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందరు స్పందించినా సరే.. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసిన తీరు సరిగా లేదని తప్పుపడుతున్నారే తప్ప.. ఆయన అవినీతికి పాల్పడలేదని,  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో అక్రమాలు జరగలేదని సర్టిఫై చేయడం లేదు. అలాగే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే విషయంలో తమ క్రెడిబిలిటీ నాశనమైపోకుండా చూసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తపన పడుతోంది.

అలాంటివి తాను చంద్రబాబు నాయుడు పల్లకి మోయదలుచుకున్నాడు కనుక, బిజెపి కూడా బోయీగా సిద్ధపడినట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. త్వరలో తెలుగుదేశం జనసేన భాజపా ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ మూడు పార్టీలు జట్టు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ తనంత తానుగా ప్రకటిస్తున్నారు.. పొత్తు నిర్ణయం అనేది బిజెపి వారి ఇష్టానికి వదిలిపెట్టే ఆలోచన పవన్ కళ్యాణ్ కు ఉన్నట్టు లేదు.  

తమ పార్టీ పేరు వాడుకుంటూ, చంద్రబాబుతో తాము కూడా పొత్తులు కుదుర్చుకున్నామని అర్థం వచ్చేలా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆడుతున్న మైండ్ గేమ్ పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ లో చంద్రబాబు పట్ల మోజు ఉన్నదని, అదే సమయంలో భారతీయ జనతా పార్టీని వదిలి రావాలంటే భయంగా ఉన్నదని అందుకే ఇలాంటి మైండ్ గేమ్ డ్రామాలు ఆడుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.