ఢిల్లీలో పరువు తీసుకుంటున్న చినబాబు!

చిన్న బాబు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధిస్తున్నారు.  దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారాన్ని తీసుకువెళ్తా.. అని చేసి ఢిల్లీలో కూర్చున్న చినబాబు ఆ దిశగా సాధిస్తున్నది ఏమిటి?…

చిన్న బాబు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధిస్తున్నారు.  దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారాన్ని తీసుకువెళ్తా.. అని చేసి ఢిల్లీలో కూర్చున్న చినబాబు ఆ దిశగా సాధిస్తున్నది ఏమిటి? ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జాతీయ మీడియాను మానిప్యులేట్ చేయడం..  తమకు అనుకూలంగా జాతీయ మీడియాలో ఎంతో కొంత ప్రచారం వచ్చేలాగా పావులు కదపడం.. అనే చంద్రబాబు నాయుడు అలవాటును ఇప్పుడు నారా లోకేష్ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతోనే ఆయన అక్కడ పొద్దుపుచ్చుతున్నారు.

నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయి జైల్లో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేత అరెస్టు అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు శ్రేణుల్లో ఉత్సాహం నింపి వారిలో పోరాట స్ఫూర్తిని తీసుకువచ్చి.. నాయకుడికి అనుకూలంగా ఉద్యమాలు ఆందోళనలు చేయించే  సారథ్యం ఇలాంటి సమయంలో అవసరం. సరిగ్గా రాష్ట్రంలో ఉండి పార్టీనంతటిని ఏకతాటిపై నడిపించాల్సిన ఈ సందర్భంలో.. చినబాబు నారా లోకేష్ కాడి పక్కన పారేసి వెళ్లి హస్తినాపురంలో కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తున్న సంగతి.  ఢిల్లీ మీడియాలో తమ సొద చెప్పుకోవడం ద్వారా, ఏపీ ప్రజలలో ఏం సాధించగలమని ఆయన అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

పోనీ ఆ విషయంలో అయినా ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారా అంటే అది కూడా లేదు. అవినీతి నిరోధక కేసుల్లో అయినా సరే ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసేటప్పుడు 17 ఏ నిబంధన పాటించాలని,  చంద్రబాబు విషయంలో దానిని  పాటించలేదని నారా లోకేష్ ఒక పసలేని విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు.  స్కాం అనేది అసలు జరగనే లేదంటూ పాచిపోయిన సంగతులను ఢిల్లీలో వెల్లడిస్తున్నారు. ప్రేమ చంద్రారెడ్డి, అజేయ కళ్ళం మీద ఆరోపణలు మళ్లించడానికి పాట్లు పడుతున్నారు. న్యాయస్థానం ఎదుట నిలవలేని విషయాలను అక్కడ మీడియా ముందు చెప్పుకుంటున్నారు.

ఏపీలో రాజకీయ ప్రసంగాలలో తెలుగు మాట్లాడడంలోనే తడబడుతూ పప్పుగా గుర్తింపు తెచ్చుకునే నారా లోకేష్,  విదేశాలలో చదువుకున్నాడు గనుక ఇంగ్లీషు మాట్లాడటంలో అద్భుతాలు చేయగలరేమో అనే భ్రమలు కొంతమందికి ఉండేవి.  ఇంగ్లీష్ మాట్లాడిన సరే పప్పు పప్పే అని నారా లోకేష్ ఢిల్లీలో నిరూపిస్తున్నారు. సిఐడి కొన్ని సంవత్సరాల నుంచి ఈ కేసులో ఇన్వెస్టింగ్ చేస్తున్నదంటూ లోకేష్ కామెడీ పండిస్తున్నారు. ఇన్వెస్టిగేటింగ్ చేస్తున్నది- అనే పదం కూడా పలకలేని ఆయన అసమర్ధత ఢిల్లీ ఇంటర్వ్యూల సాక్షిగా బయటపడుతుంది.  

కీలకమైన సమయంలో రాష్ట్రంలో నిలబడి వ్యూహరచన చేయాల్సిన వ్యక్తి, రకరకాల సాకులు చెబుతూ ఢిల్లీ పారిపోయి, అక్కడ కూడా పార్టీ పరువు తీస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు.