క్రిమినల్ కోర్టుకు మారిన ‘ఏజెంట్’ పంచాయితీ

ఏజెంట్ సినిమా వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ కు చెందిన అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, గరికపాటి కిషోర్ పై వివిధ సెక్షన్లపై సిటీ సివిల్…

ఏజెంట్ సినిమా వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ కు చెందిన అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, గరికపాటి కిషోర్ పై వివిధ సెక్షన్లపై సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు సిటీ సివిల్ కోర్టు నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మారింది.

నిర్మాత అనీల్ సుంకర, తనను పట్టించుకోలేదని, తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని, దాంతో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్.. తను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని, ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన వెల్లడించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు.

ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు తనను మోసం చేశారని సతీష్ ఆరోపిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ను బ్యాంకు ద్వారా తాను చెల్లించానని, అయితే తనన కేవలం విశాఖపట్నం వరకే పరిమితం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

భోళాశంకర్ రిలీజ్ టైమ్ లోనే దీనికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కారు సతీష్. అయితే భోళాశంకర్ విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకున్నారు నిర్మాత అనీల్ సుంకర. ఆ సినిమా హిట్టయితే, సతీష్ కు సెటిల్ చేద్దామని భావించారు. ఈ మేరకు సతీష్ కు అండర్ స్టాండింగ్ లెటర్ కూడా ఇచ్చారు.

కానీ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో నిర్మాత మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. అంతలోనే డిస్ట్రిబ్యూటర్ సతీశ్, నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేశారు.