మీడియా దాచేసిన వాస్తవం

మీడియా కొన్ని విషయాలు భలే ఉద్దేశపూర్వకంగా దాచేస్తుంటుంది. ఏమన్నా అంటే అది వారి వ్యక్తిగతం మనకెందుకు అంటారు. కానీ శ్రీశ్రీ ఏమన్నాడు. ప్రైవేటు బతుకులు వారి స్వంతం.. పబ్లిక్ లో వుంటే ఏమన్నా అంటాం…

మీడియా కొన్ని విషయాలు భలే ఉద్దేశపూర్వకంగా దాచేస్తుంటుంది. ఏమన్నా అంటే అది వారి వ్యక్తిగతం మనకెందుకు అంటారు. కానీ శ్రీశ్రీ ఏమన్నాడు. ప్రైవేటు బతుకులు వారి స్వంతం.. పబ్లిక్ లో వుంటే ఏమన్నా అంటాం అన్నాడు. ఏమన్నా అనకపోయినా కాస్త దృష్టి సారించాల్సి వుంది కదా.

చాలా కాలం క్రితం ఓ వార్త చూసాం. హెరిటేజ్‌లో తనకు వున్న షేర్స్ అన్నీ బాలకృష్ణ తన పెద్ద మనవడు అంటే లోకేష్ కొడుక్కి రాసేసారు అని. సాధారణంగా చిన్న అనుమానం వస్తుంది. ఇద్దరు కూతుళ్లు వున్నపుడు ఇద్దరికీ ఇవ్వాలి కదా అని. అటు మోహన్ బాబు లేరు. ఇటు బాలయ్య షేర్ లు లేవు. హెరిటేజ్ సోలో ఓనర్ గా బాబుగారి ఫ్యామిలీ నే. సరే.. ఆయన షేర్లు ఆయన పంపకం ఆయన ఇష్టం అని అనుకుందాం.

ఎన్టీఆర్‌కు లొకేష్ కు సరిపడలేదు అని వార్తలు వున్నాయి మొదటి నుంచీ. దీనిని ధృవీకరించే ఉదంతాలు అనేకం వున్నాయి. ఒకప్పుడు ఎవరినీ బొట్టు పెట్టి పిలవం మహానాడుకు అని లోకేష్ అన్న వైనం వుండనే వుంది. దాని వెనుక ఎన్టీఆర్ ను పిలిచారా అన్న ప్రశ్న వుంది.

విశాఖ ఎంపీ టికెట్ ను 2019లో లోకేష్ తోడల్లుడు భరత్ కు ఇవ్వడం అంత సులువుగా సాధ్యం కాలేదన్న వార్తలు వున్నాయి. భరత్ మొత్తం మీద లోకల్ పార్టీ జనాలను తనవైపు తిప్పుకుని టికెట్ బలవంతంగా తెచ్చుకున్నారని అప్పట్లో బలంగా వినిపించింది. ఎందుకంటే తండ్రి బాబుగారి మాదిరిగానే లోకేష్ కు కూడా తనకు పోటీగా పార్టీలో ఎవరూ ఎదగడం ఇష్టం వుండకపోచచ్చు.

వర్తమానానికి వస్తే, చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత ఆయనతో ములాఖత్ కావడానికి వెళ్లింది ఎవరు. బాబు గారి భార్య, కొడుకు, కోడలు, ఇంకా బాలయ్య రెండో అల్లుడు, రెండో కూతురు. కానీ ముగ్గురికే అనుమతి కనుక లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి మాత్రం వెళ్లారు. బాలయ్య రెండో అల్లుడు, కూతురు కు నో చాన్స్.

సరే, ఆ తరువాత ములాఖత్ అయినా వారికి ఇచ్చారా.. లేదు.. బాలయ్య, పవన్.. మళ్లీ మరోసారి లోకేష్.

పోనీ ఆ తరువాత ములాఖత్ కు అయినా వారికి అవకాశం ఇచ్చారా..లేదు. మళ్లీ భువనేశ్వరినే ములాఖత్ కోరారు.

ఇదిలా వుంటే, తొలిరోజు తరువాత బాలయ్య రెండో కుమార్తె, అల్లుడు భరత్ ఫొటొలు ఎక్కడయినా కనిపించాయా? చంద్రబాబుకు నేరుగా కోడలు కాకపోవచ్చు. కానీ భువనేశ్వరికి మేనగోడలే కదా బాలయ్య రెండో కుమార్తె. లోకేష్ కు తోడల్లుడే కదా భరత్. మరి ఎందుకు వారు దూరంగా వుండిపోయినట్లు?

ఈ నేపథ్యంలో ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీకి భరత్ కు అవకాశం వుంటుందా? ఎమ్మెల్యేగా ఎలాగూ ఇవ్వరు. ఎందుకంటే లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నపుడు, భరత్ కు కూడా అలా అవకాశం ఇస్తారని అనుకోవడం రాజకీయ అవివేకం అవుతుంది.

కొద్ది కాలం వెయిట్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది.