నీవు నేర్పిన విద్యయే.. !

ఇదే థంబ్ నెయిల్‌ పెట్టి దిలీప్ కళ్యాణ సుంకర ఓ వీడియో చేస్తే, తెలుగుదేశం జనాలకు కోపం వచ్చింది. మా బాబోరిని చూసే జగన్ నేర్చుకున్నాడని అంటారా అంటూ కాస్త సుతి మెత్తగా మెత్తారు.…

ఇదే థంబ్ నెయిల్‌ పెట్టి దిలీప్ కళ్యాణ సుంకర ఓ వీడియో చేస్తే, తెలుగుదేశం జనాలకు కోపం వచ్చింది. మా బాబోరిని చూసే జగన్ నేర్చుకున్నాడని అంటారా అంటూ కాస్త సుతి మెత్తగా మెత్తారు. దాంతో దిలీప్ కళ్యాణ్ సుంకర అస్త్ర సన్యాసం చేసారు. కాపు యువతలో దిలీప్ కళ్యాణ్ సుంకర వీడియోలు వైరల్ అవుతాయి. అవి యాంటీ జగన్ మూవ్ మెంట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పని చేస్తాయి. తెలుగుదేశం వల్ల దిలీప్ కళ్యాణ్ సుంకర అస్త్ర సన్యాసం చేసారు అన్న టాక్ కాపు యువతల్లోకి వెళ్తే అదో డ్యామేజ్ మళ్లీ. అందుకే అర్జంట్ గా డ్యామేజ్ కంట్రోల్ కు దిగి, మహాసేన రాజేష్ చేత సారీ చెప్పించేసారు. సరే.. ఆ అంకం అలా ముగిసింది.

కానీ వాస్తవం మాట్లాడుకోవాలంటే సీన్ రిపీట్ అన్నట్లే వుంది ఆంధ్రలో వ్యవహారం.

జస్ట్ ఓ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా కోర్టులో జగన్ మీద కేసులు నడవడం.. వాటిలో తెదేపా నాయకులు పార్ట్ కావడం, సిబిఐ కేసు మొదలుకావడం చకచకా జరిగి పోయాయి. ఇక అక్కడ నుంచి నిత్యం కేసుల విచారణ వార్తలే. ఇలా అన్నారు.. అలా అన్నారు. జగన్ ను నిల్చో పెట్టారు, కూర్చో పెట్టారు, కుర్చీ తన్నారు, అరిచారు. ఇలా లీకులే.. లీకులు. పదహారు నెలలు జైలులో వున్నాడు జగన్. ఆ తరువాత అధికారంలోకి వచ్చినా, నిత్యం పత్రికల్లో ఒకటే తరహా హెడ్డింగ్ లు. కోర్టు మొట్టికాయ, కోర్టు షాక్, కోర్ట్ ఝలక్ ఇలాంటి పదాలతో నాలుగేళ్లు హెడ్డింగ్ లే హెడ్డింగ్ లు.

అదిగో జగన్ జైలుకు వెళ్తాడు. భారతికి ట్రైనింగ్‌ ఇచ్చేస్తున్నాడు. ఇదిగో పార్టీ చీలిపోతుంది ఇంక అంటూ రాసుకువచ్చారు.

కట్ చేస్తే ఇప్పుడేం అంటున్నారు. కోర్టుల్లో న్యాయం జరగడం లేదు అంటున్నారు. చంద్రబాబు విషయంలో కోర్టులు వివక్షతో వ్యవహరిస్తున్నాయి అనే అర్థం వచ్చేలా వార్తలు వండి వారుస్తున్నారు. కేసు వివరాలను పట్టుకుని నిత్యం పత్రికల్లో వీళ్లే కోర్టు పంచాయతీ నడిపేసి, ఈ కేసులో చంద్రబాబు నిర్దోషి అని తీర్పు ఇచ్చేస్తున్నారు.

దీనికి రివర్స్ సీన్ వైకాపా అనుకూల పత్రికలో కనిపిస్తోంది.

అంటే నాలుగేళ్ల క్రితం వీళ్లు ఏం చేసారో, ఇప్పుడు వాళ్లు అదే చేస్తున్నారు. కోర్టుల్లో న్యాయం జరగడం లేదన్నదే తెలుగుదేశం అనుకూల మీడియాలో కావచ్చు, అనుకూల వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ట్విట్టర్ హ్యాండిళ్లలో కావచ్చు. ఇదే తరహా పోస్టులు.

ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే కూడా అదే విధంగా వాపోతున్నారు. చంద్రబాబుకే సత్వర న్యాయం జరగకపోతే ఇంకెవరికి జరుగుతుంది అంటున్నారు. జగన్ కు 16 నెలలు పట్టింది బయటకు రావడానికి అన్నది మరిచిపోతున్నారు. అలా అంటే, జగన్ కరుడుకట్టిన నేరస్థుడు, చంద్రబాబు సచ్ఛీలుడు అంటారు. మరి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఎన్ని నెలలుగా జైలులో వున్నారో గుర్తు తెచ్చుకోవచ్చు కదా.

చంద్రబాబుకే జరగకపోతే సామాన్యుడికి ఇంకేం జరుగుతుంది అనే వారికి కోర్టు పద్దతులు తెలుసా? ఇదే విధంగా ఓ సామాన్యుడిని అరెస్ట్ చేస్తే, సెలవులు, ఇతరత్రా ప్రోటోకాల్స్ లేకుండా కోర్టులు ఇంత స్పీడ్ గా వ్యవహరించడం సాధ్యమా? సామాన్యుడు అయితే ముందుగా కింద కోర్టుకి వెళ్లడం, కోర్టు సెలవులు, కనీసం ఇన్ని రోజులు గ్యాప్ వుండాలి ఇలా సవాలక్ష వ్యవహారాలు వున్నాయి. చంద్రబాబు కనుక ఇలా చకచకా కేసు నడుస్తోంది.

అసలు కోర్టు తీర్పులను ప్రభావితం చేసే పని ఏదీ చేయకూడదు అంటారు కదా.. మరి కోర్టు తీర్పులను ఇట ఇలాంటి రాతలు, గంట మోగించడాలు, డప్పులు కొట్టడాలు ప్రభావితం చేయవా? వివిధ నాయకుల ప్రకటనలు, నిరసనలు ప్రభావితం చేయవా? ఎలాగైనా చంద్రబాబు నిర్దోషి, మహా మంచివాడు అని కోర్టు చెప్పకముందే, అదే కోర్టు చేత చెప్పించాలనే ఈ ప్రయత్నాలన్నింటికి ఏమంటారు?

ఇదంతా చూస్తుంటే…’నీవు నేర్పిన విద్యయే ‘ అటు వైకాపా వర్గాలు, ఇటు తేదేపా వర్గాలు ఎవరికి వారు అనుకోవడంలో తప్పే వుండదు.