హెడ్డింగ్ చూసి ఇదేదో మతాల మధ్యన టాపిక్ అనుకోకండి. శ్రీకృష్ణుడు, ఏసు క్రీస్తు- ఇద్దరూ మహానుభావులే.
గీత ద్వారా ఒకరు- బైబిల్ తో మరొకరు మానవాళికి వేరు వేరు స్థానాల్లో, కాలాల్లో సన్మార్గాలు చూపిన వారే. వారి భక్తులుగా ప్రజలు వారి సూక్తులను కొన్ని పాటిస్తారు. కొందరి డీ.ఎన్.ఎ లో వారి బోధలు తమకు తెలియకుండానే నిక్షిప్తమైపోవడం వల్ల తదనుగుణమైన జీవితాన్ని జీవిస్తారు.
తన ముత్తాతల ముందు తరం హిందువులే అయినా, వై.ఎస్.జగన్ మాత్రం జన్మతః క్రైస్తవుడు. తనలో భగవద్గీత మరియు బైబిల్ సూక్తులకి సంబంధించిన డీ.ఎన్.ఏ లు రెండూ ఉండడానికి ఆస్కారముంది.
ముందుగా క్రీస్తు బోధలని అనుసరిస్తూ ఆయన ఎంతవరకూ క్రైస్తవుడుగా ఉంటున్నాడో చూద్దాం.
క్రీస్తు శిలువమోసినట్టు చిరునవ్వుతో శిక్షలు అనుభవించగలడు.
క్రీస్తు కుష్టువ్యాధిగ్రస్తులను ప్రేమగా అక్కున చేర్చుకున్నట్టు జగన్ కూడా చేర్చుకోగలడు (దీని తాలూకు ఫోటోలు కూడా ఉన్నాయి).
క్రీస్తు పద్ధతిలో జగన్ అన్నార్తులకి, ఆపదలో ఉన్నవారికి సేవచేయడమే ధ్యేయంగా బ్రతకగలడు.
పేదల, వ్యాధిగ్రస్తుల, పీడితుల బాధని తన బాధగా భావించి వారి కోసం కరుణ కురిపించగలడు.
ఇవన్నీ సరే…మరి క్రీస్తు బోధించిన క్షమాగుణం తనలో ఉందా?
తన 40 ఏళ్ల వయసులో జగన్ 16 నెలలు జైల్లో గడపడం సరే. దానికి ప్రతీకారంగా చంద్రబాబుని ఏ 16 రోజులో జైలు పాలు చేస్తే సరిపోతుంది కదా! 74 ఏళ్ల వృద్ధుడికి ఆ శిక్ష 16 నెలలతో సమానమనే అనుకోవచ్చు కదా!
ఇదే విషయం ఒక సీనియర్ విలేకరి వద్ద ప్రస్తావిస్తే, “జగన్ చిరునవ్వు చూసి మీరు క్షమించే క్రీస్తు అనుకుంటున్నారు. కాదు. వంద తిట్లు తిట్టాడని ఏకంగా శిశుపాలుడి తలే లేపేసిన శ్రీకృష్ణుడు టైపు. తాను 16 నెలలున్నాడు కనుక చంద్రబాబుకి కనీసం 32 నెలలు జైలు జీవితం రుచి చూపించాలనుకుంటాడు తప్ప క్షమించి ముందు వదిలేసే రకం కాదు” అని చెప్పాడు.
అది ఆ విలేకరి వ్యక్తిగత అభిప్రయమే. కానీ నిజమెంతుందో మున్ముందు తెలుస్తుంది.
యూదులు క్రీస్తుని శిలువేసి హింసిస్తున్నప్పుడు కూడా తన తండ్రి అయిన యోహావాని “వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియడంలేదు. వీరిని క్షమించు” అని ఏసుక్రీస్తు వాళ్ల మీద కూడా కరుణ కురిపించాడు తప్ప ప్రతికారప్రతిజ్ఞ చేయలేదు, ఆ పాపులను శిక్షంచమని దైవాన్ని వేడుకోలేదు.
జగన్ మాత్రం ఈ విషయంలో క్రీస్తుని అనుసరించడంలేదనేది చూస్తుంటే అర్ధమౌతోంది.
అయితే ఎవర్ని అనుసరిస్తున్నట్టు? పైన ప్రస్తావించిన సీనియర్ విలేకరి చెప్పినట్టు మహాభారతంలో శ్రీకృష్ణుడినే అనుసరిస్తున్నాడు.
శిష్ట రక్షణ చేసిన మహనీయుడు క్రీస్తు. అయితే శిష్టరక్షణతో పాటు అధర్మంపై యుద్ధం చేయించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.
దుర్యోధనుడు తనని ఏ ఆయుధం చంపని విధంగా తన శరీర వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేసుకున్నా కూడా, వీక్ పాయింట్ ని గుర్తించి అక్కడ దెబ్బ పడేలా చేసి పడగొట్టినవాడు శ్రీకృష్ణుడు.
అలాగే చంద్రబాబు తన దుర్బేధ్యమైన వ్యవస్థలో ఒకానొక లీగల్ పాయింటుని గుర్తించి, అక్కడ దెబ్బకొట్టి లోపలేయించిన వాడు వై.ఎస్. జగన్.
ద్రోణాచార్యుడు రాజగురువైనప్పటికీ అధర్మం వైపు నిలబడినందుకు అతని తలని తీయించేసాడు శ్రీకృష్ణుడు.
అలాగే రాజగురువు రామోజీరావుని కూడా “అంతా జగన్మాయ” అనిపించి ఆయన తల తీయించినంత అవమానానికి గురి చేసాడు వై.ఎస్. జగన్.
కర్ణుడి రథం భూమిలో ఇరుక్కున్నప్పుడు బాణం వేయడం యుద్ధధర్మానికి విరుద్ధమైనా ఆ పని చేయడం ఎంత ధర్మమో చెప్పి చేయించేసినవాడు శ్రీకృష్ణుడు.
ఈ ఫార్ములాని బహుశా లోకేష్ మీద లీగల్ బాణం సంధించే విషయంలో ఫాలో కావొచ్చు వై.ఎస్.జగన్.
అధర్మంగా అనిపించే ఈ ధర్మయుద్ధమంతా శ్రీకృష్ణుడు పాయింటాఫ్ వ్యూవ్ లో కచ్చితంగా పాండవుల ప్రతీకారాన్ని తీర్చడమే.
ఇక ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ వగైరాలు జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటున్న ప్రతీకారమని తెదేపా వాళ్లు అంటున్నా, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూవ్ లో దానిని వైకాపా వాళ్లు ధృవీకరించడంలేదు కానీ అది ప్రతీకారమే అని జగమెరిగిన సత్యం.
ప్రతీకారమే అనుకున్నా కూడా పోయిందేముంది!? తెదేపా సానుభూతిపరులకై తప్ప తక్కిన ఎవరికీ కంప్లైంట్ లేదు.
సినిమాల్లో చూసే శ్రీకృష్ణుడుకి ఇక్కడ మీడియాలో చూసే జగన్ మోహన్ రెడ్డికి ఒక కామన్ పాయింటుంది- “చిరునవ్వు!”. ఆ నవ్వు ఆయన పక్షం వారికి ప్రసన్నంగా కనిపిస్తే, తెదేపా వర్గానికి వెక్కిరింపులా అనిపిస్తుంది. కౌరవులకి కూడా కృష్ణుడి నవ్వు అలాగే మండి ఉండవచ్చు. అది వేరే విషయం.
– భమిడిపాటి సోమేశ్వరరావు