ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లాలో రెండు గ్రూపులు ఉంటాయి! సాధారణంగా ఆ పార్టీల వీరభక్తులు దీన్ని కూడా ఒప్పుకోరు. తమ పార్టీలో అందరి నేతలనూ వారు సమంగా అభిమానిస్తారు. తమ పార్టీ అయితే చాలన్నట్టుగా ఉంటుంది వారి వ్యవహారం. అయితే నేతల లెక్కలు ఇలాంటి సామాన్య కార్యకర్తల, పార్టీ సానుభూతి పరుల అభిప్రాయాలకూ, ఆశలకు భిన్నంగా ఉంటాయి.
పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు పార్టీ గెలవాలి అనుకుంటే.. నేతలు మాత్రం పార్టీ ఓడినా ఫర్వాలేదు తాము మాత్రం గెలిస్తే చాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. పార్టీ అధికారంలో ఉంటేనే తాము గెలిచిన ఒక అర్థం ఉంటుంది. అయినప్పటికీ.. పార్టీ కన్నా నేతలకు తమ పరపతే కీలకం!
ఇది రాజకీయాల్లో దశాబ్దాల నాటి నీతే. తమ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరి ఓటమికీ ఒకవైపు కృషి చేస్తూ, తను మాత్రం గెలవాలన్నట్టుగా వ్యవహరించిన నేతలకు కొదవలేదు తెలుగు నాట రాజకీయంలో. అనంతపురం జిల్లాలో 2009 ఎన్నికల ముఖచిత్రంలో ముఖ్య పాత్ర అయిన జేసీ దివాకర్ రెడ్డి.. జిల్లాలోని 13 మంది ఎమ్మెల్యేల ఓటమికీ వ్యూహాలను అమలు చేసిన చరిత్ర ఉంది!
ఆ ఎన్నికల్లో ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని, కల్యాణ దుర్గం నుంచి రఘువీరా రెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డిని, పుట్టపర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని.. ఇలా ఒక్కోరిని ఓడించడానికి ఒక్కో రకమైన వ్యూహాలను జేసీ దివాకర్ రెడ్డి అమలు పెట్ట ప్రయత్నం చేశారు. అయితే జేసీ వ్యూహాలేవీ అప్పట్లో పని చేయలేదు అది వేరే కథ. అయితే ఇలా స్వపార్టీలోని నేతలనే ఓడించేందుకు కృషి చేసే నేతల జాబితాలో దివాకర్ రెడ్డికి దక్కినంత స్థానం మరెవరికీ దక్కకపోవచ్చు!
ఆయన సంగతి అలాంటిదైతే.. నెల్లూరు జిల్లా రాజకీయం మాత్రం మరో ఎత్తు! నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రెడ్లే రాజకీయ నేతలుగా ఉన్నారు దశాబ్దాలుగా. పార్టీ ఏదైనా నెల్లూరు రాజకీయంలో రెడ్లు అంతా తామై నడిపిస్తున్న వాతావరణం ఉండే జిల్లా అది. ఇదే సమయంలో వారంతా ఒకే సామాజికవర్గం వారే అయినా.. పరస్పరం ఐక్యత లేని రాజకీయం నడిచే జిల్లా కూడా ఇదే!
సొంత పార్టీలోని రెడ్డి నేత అంటే మరో రెడ్డికి అస్సలు పడదు. పైకి నవ్వుతూ పోజులు ఇచ్చినా, అంతా ఒక్కటే అని చెప్పుకున్నా.. స్వపార్టీలో కన్నా ప్రత్యర్థి పార్టీలో వీరికి మిత్రులెక్కువ! ఈ నేతలు పార్టీలు మారితే.. పాత మిత్రులు కొత్త శత్రువులవుతారు, కొత్త శత్రువులు మిత్రులవుతారు! ఇలానే ఉంటుంది వ్యవహారం అంతా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో పరస్పరం పడని నేతల జాబితా పెద్దదే! ఆ రెడ్డి అంటే ఈ రెడ్డికి పడదు, ఈ రెడ్డి అంటే ఆ రెడ్డికి పడదు! బంధుత్వాలుంటాయి, స్నేహితులమంటారు. అంతిమంగా ఇగో ప్రాబ్లమ్స్ వల్ల వీరి మధ్య దూరాలెక్కువ.
ఇప్పుడు టీడీపీలో ఉన్న రెడ్డి నేతలు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నేతలకు చెప్పుకోలేనంత ఆప్తులు! మేకపాటి ఫ్యామిలీకీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలుంటాయనే ఆశ్చర్యం కలుగుతుంది. సొంత పార్టీలోని రెడ్లతో సోమిరెడ్డికి కొంత పొసగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్లకూ ఇలాంటి బంధాలకు కొదవలేదు.
సొంత పార్టీలోని వారి కన్నా ప్రత్యర్థి పార్టీలోని వారితోనే బంధమెక్కువ! అంతే కాదు.. ఏదైనా ఒక పార్టీలో పొందికగా ఉండటం కూడా నెల్లూరు రెడ్లకు అంత తేలిక కాదు. ఏ మేకపాటి ఫ్యామిలీ లా డీసెంట్ రాజకీయం చేసే వాళ్లను పక్కన పెడితే, మిగతా వారి వ్యవహారం మాత్రం కుతకుతలాడుతూ ఉంటుందెప్పుడూ!