రాజకీయాల్లో కొన్ని పదాలు కొన్ని వ్యవహారాలకు పర్యాయపదాలుగా మారిపోతాయి. అలాంటివాటిలో ‘నాదెండ్ల’ అనే పదం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో.. ఆయన అటు అమెరికా వెళ్లగానే ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకున్న నాదెండ్ల భాస్కరరావు పుణ్యమాని.. నాదెండ్ల అనే పదం అంటేనే వెన్నుపోటు అనేంత అర్థం స్థిరపడింది.
ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు. నిజానికి నెంబర్ వన్ కు సమానంగా ఉన్నారు. అనేకానేక విషయాల్లో.. స్వయంగా పార్టీ అధ్యక్షుడే పూనుకుని చేస్తారు.. అని పార్టీ శ్రేణులు ఊహించే వ్యవహారాలను నాదెండ్ల మనోహర్ తాను స్వయంగా చక్కబెడతారు. అలాంటి నాదెండ్ల మనోహర్.. వెన్నుపోటుకు ప్రయత్నిస్తున్నట్టు గానీ.. అంతకుమించి.. పార్టీ డొల్లతనం బయటపడేలా మాట్లాడారని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు.
వైఎస్ జగన్.. తమ పార్టీ ప్లీనరీ సందర్భంగా.. తాను అధికారంలోకి వచ్చాక.. 95 శాతం మేనిఫెస్టో హామీలను నెరవేర్చినట్లుగా చెప్పారు. ఏదో యథాలాపంగా కాదు.. కేవలం ఆరు హామీలను మాత్రం నెరవేర్చలేకపోయాం అంటూ.. శషబిషలకు తావులేకుండా.. ఆ నెరవేర్చలేకపోయిన ఆరు హామీలు ఏమిటో కరపత్రాలుగా ముద్రించి మరీ.. సభికులకు పంచిపెట్టారు. ఆ రకంగా మేనిఫెస్టో లో 95 శాతం హామీలు నెరవేర్చాం అని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఆ పాయింట్ పై ఇప్పుడు నాదెండ్ల మనోహర్ విమర్శలు చేస్తున్నారు. 95 శాతం చేశారా? దమ్ముంటే ఎన్నికలు పెట్టండి అని ఆయన అంటున్నారు. చేయడానికి ఎన్నికలకు ఏంటి సంబంధం అని అడిగితే.. ఆయన ఏం సమాదానం చెప్తారో తెలీదు కానీ.. 95 శాతం అమలు చేయలేదని ఆయనకు అనిపిస్తే.. 2019 ఎన్నికల నాటి జగన్ మేనిఫెస్టో కాపీని దగ్గర పెట్టుకుని.. అందులో ఎన్ని అమలు కాలేదో ఆయనే సాధికారంగా మాట్లాడవచ్చు కదా అనేది ప్రజల సందేహం. అందుకు ఆయనకు ధైర్యం లేదు!
ఆ పనిచేయకపోగా.. 95 శాతం నెరవేర్చాం అనే ధైర్యం ఉంటే మార్చి లేదా ఏప్రిల్ లో మధ్యంతర ఎన్నికలు పెట్టాలని నాదెండ్ల డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ లోనే జనసేన డొల్లతనం బయటపడిపోతున్నది. సాధారణంగా ఈ తరహాలో ‘దమ్ముంటే రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు రండి’ అని అడిగేవాళ్లు ‘తక్షణం ఎన్నికలు పెట్టండి’ అని అంటూ ఉంటారు. ‘తక్షణం పెట్టండి’ అని అడగడానికి నాదెండ్లకు దమ్ములేదు.
ఎందుకంటే.. ఒకవేళ తక్షణం ఎన్నికలు పెడితే.. బరిలో దిగడానికి పార్టీకి అంత సీన్ లేదు. వాళ్లు ముందు బీజేపీతో కటీఫ్ చెప్పాలి. బాబుతో ప్రేమబంధం పెనవేసుకోవాలి. ఆ తర్వాత.. సీట్లకు బేరమాడి, సీట్లు పొందాలి.. అక్కడ మనుషుల్ని ఎంపిక చేసుకోవాలి.. ఇవన్నీ వాళ్లకు తలనొప్పులే. అందుకు దోవలేదు. మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు పెట్టమని నాదెండ్ల అడగడం అంటేనే.. జనసేన బలంలోని డొల్లతనాన్ని ఆయన స్వయంగా బయటపెట్టినట్టుగా ఉన్నదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.