తమ ఎమ్మెల్యే పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ఆయనపై అయిష్టత చూపుతున్నారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమను వెనకేసుకురావడం లేదని అంటున్నారు. అయితే.. రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టు తగ్గలేదనేది మూడేళ్ల తర్వాత వినిపిస్తున్న మాట.
గత ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి పరిటాల కోటను కూలదోసి ఘన విజయాన్ని సాధించారు. వాస్తవానికి 2009లోనే ఇది జరగాల్సింది. అయితే నాటి కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు తోపుదుర్తి ఫ్యామిలీని దెబ్బతీశాయి. ఇక 2014లో అలాంటి అవకాశం దక్కకపోయినా, 2019లో మాత్రం భారీ మెజారిటీతో ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.
మరి పరిటాల కోటను ఒక్కసారి బద్ధలు కొడితేనే సరిపోదు. ఇలాంటి చోట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకోవడంలోనే మజా ఉంటుంది! వచ్చే ఎన్నికల్లో ఇలాంటి మజాకు లోటు ఉండదనే మాట వినిపిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి హవా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉంటుందనేది లోక్ టాక్.
పార్టీ క్యాడర్ లో ప్రకాష్ రెడ్డిపై అసంతృప్తి, అసహనాలు అయితే ఉన్నాయి. అయితే ఆ కోపతాపాలు త్వరగా చల్లారేవే అని స్పష్టం అవుతోంది. ఎన్నికలంటూ వస్తే.. ఈ క్యాడర్ ఏదీ తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశాలు కానీ, అటు వైపు చూసే ఛాన్సులు కానీ లేవని క్షేత్ర స్థాయి పరిశీలనతో స్పష్టం అవుతోంది.
ప్రకాష్ రెడ్డిపై ప్రధానంగా ఉన్న అసంతృప్తి క్యాడర్ లోనే. ఈ అసంతృప్తి స్థానిక ప్రజల్లో లేదు. ఎమ్మెల్యే పనితీరుపై వారి నుంచి సానుకూల స్పందనే ఉంది. హంద్రీనీవా నీటి విషయంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చొరవ గొప్పదే. ప్రత్యేకించి ఒకప్పుడు బాగా కరువు ప్రాంతం అయిన ఈ ఏరియాలో మూడేళ్లుగా నీటి కొరత ఊసే లేదు! చెరువులు నిండి మరవలు పోతున్నాయి.
నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వ్యవసాయాధార ప్రాంతంలో ప్రజలు వేరే వాటి చర్చకు కూడా పెద్దగా ఆసక్తితో ఉండరు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఒకప్పుడు కరువులు, ఫ్యాక్షన్ తగాదాలతో పేరున్న ప్రాంతం ఇప్పుడుపచ్చగా ఉంది. సామాన్యుల జోలికి ఎమ్మెల్యే రాడు. తమ వర్గం వారు వెళ్లినా వారిని సమర్థించడు. ఇది ప్రకాష్ రెడ్డి విషయంలో సానుకూల అంశంగా నిలుస్తోంది.
ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పని చేస్తుందని, రాప్తాడులో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు అంటే.. ప్రెస్ మీట్లు, జూమ్ మీట్లలో పాల్గొని స్టేట్ మెంట్ ఇవ్వడం తప్ప.. పరిటాల కుటుంబం ప్రజల మధ్యకు వచ్చింది లేదు ఇప్పటి వరకూ.
దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు అది దూరం అయ్యే సరికి వారు దిక్కుతోచని, ఇంకా వాస్తవంలోకి రానట్టుగా ఉన్నారు. వారు నిస్తేజంగా ఉండటం ప్రకాష్ రెడ్డి పని మరింత సులభం అయ్యేలా చేయవచ్చు!