గత ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి ఆ తర్వాత నియోజకవర్గాలకు మొహం చాటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వచ్చి.. పార్టీ అధికారంలోకి వచ్చాకా మాత్రం ఎందుకో నియోజకవర్గానికి దూరదూరంగా ఉంటున్న నేతలు వారు. అలాని జనం మధ్య ఉండటానికి చిరాకు పడే టైపు కాదు. ఒక రేంజ్ లో అవినీతి చేస్తున్నారనడానికీ లేదు! ఎమ్మెల్యే అనగానే.. రాజధాని లో మాత్రమే ఉండాలనుకుంటారో ఏమో కానీ.. ఇలాంటి వారికి ఎవరికి రీజన్లు వారికి ఉన్నట్టున్నాయి.
ప్రకాశం జిల్లాలో ఇలానే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడ్రస్ మిస్సయ్యారనే మాట ఉంది. ఒక పొలిటికల్ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ జగన్ గత ఎన్నికల్లో ఈ కొత్త నేతకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అయితే గెలిచిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గంలో పత్తా లేరు. ఆయన తమ్ముడు యాక్టివ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం పాతదే. వచ్చే సారి ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పార్టీ కార్యకర్తలే సపోర్ట్ చేయారనే టాక్ ఉంది. మరి ఆ నియోజకవర్గం విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారనే పేరు వస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూల ప్రాంతం లాంటి పుట్టపర్తి ఏరియాలో గెలవడానికి శ్రీధర్ రెడ్డి గట్టిగానే కృషి చేశారు. 2014 ఎన్నికల్లో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. హిందూపురం నుంచి ఎంపీగా నెగ్గలేకపోయిన శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం మీదే దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
సీనియర్ అయిన పల్లె రఘునాథ రెడ్డి మీద శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయినా, 2015 నుంచినే శ్రీధర్ రెడ్డి పుట్టపర్తికి మకాం మార్చి.. పక్కా వ్యూహంతో వెళ్లారు. గెలవడం కష్టం అనే లెక్కలన్నింటినీ జయించి ఎమ్మెల్యేగా నెగ్గారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ రెడ్డి యమ యాక్టివ్ ఉండే వారు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. అందరినీ కలుపుకుపోయారు. అప్పట్లో నియోజకవర్గంలో 18 యేళ్ల యువకుడు కూడా వెళ్లి శ్రీధర్ రెడ్డితో ఫొటో దిగగలిగే వారు! ఒక్కడే వెళ్లినా.. ఎంతమందితో వెళ్లినా ఆయనతో కలవడం తేలిక! అయితే ఇప్పుడు మాత్రం దుర్లభం. శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఉండటం కన్నా కేరాఫ్ అమరావతి అనిపించుకుంటున్నారు. అది కూడా గత కొంతకాలంగా ఇది మరింత పెరిగిందనేది లోకల్ టాక్.
కార్యకర్తలతో దూరం పెరిగింది, నియోజకవర్గంలో తిరగడం తగ్గింది. ఇక్కడ ఏం జరిగినా ఫర్వాలేదు.. అమరావతిలో ఉంటే చాలన్నట్టుగా ఈయన వ్యవహారం సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే పల్లె రఘునాథరెడ్డి తన మంత్రాంగాన్ని అంతా ప్రయోగిస్తున్నారు. ఆయనకు టీడీపీ టికెట్ దక్కుతుందో లేదో కానీ.. రఘునాథ రెడ్డి మాత్రం గట్టిగానే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. మరి ఆయనను ఎదుర్కొనాలంటే శ్రీధర్ రెడ్డి ఇలా సాగితే చాలదనేది లోకల్ టాక్!