తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించుకుని.. చాలా జోష్ మీద ఉన్నాం అనే బిల్డప్ ను ప్రజల ముందు పెట్టడానికి చాలా తపన పడుతోంది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తున్న సామాజిక న్యాయభేరి యాత్ర లో ఎదురవుతున్న ఒకే ఒక్క ప్రశ్నకు తెలుగుదేశం తల్లకిందులు అయిపోతోంది. సమాధానం చెప్పలేకపోతోంది.
తెలుగుదేశం మహానాడుకు జనం బాగానే వచ్చారు. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి గనుక ఈ మాత్రం బలప్రదర్శనకు పార్టీ నాయకులంతా ఆరాటపడడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. వైసీపీ సంధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రం నోటమాట రావడం లేదు.
సామాజిక న్యాయభేరిలో బస్సు యాత్ర సాగిస్తున్న మంత్రులు చంద్రబాబునాయుడుకు ఒకే ప్రశ్న వేస్తున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తు అవసరమూ లేకుండా.. ఒంటరిగానే పోటీచేస్తాం అని చెప్పగలరా?’ అనేదే ఆ ప్రశ్న. వైసీపీ మంత్రులు ఏ ఊర్లో సభ పెట్టినా.. తెలుగుదేశాన్ని ఉద్దేశించి అదొక్కటే ప్రశ్న అడుగుతున్నారు. తెలుగుదేశానికి నో ఆన్సర్!
తెలుగుదేశం బలం మహా పెరిగిపోయింది.. జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడొస్తాయా జగన్ ను ఇంటికి పంపిద్దామా అని ఎదురుచూస్తున్నారు.. ఈ తరహా కల్లబొల్లి మాటలు అనేకం తెలుగుదేశం శ్రేణులు ఎడాపెడా ప్రచారంలో పెడుతున్నారు. అదంతా నిజమా కాదా అనేది ఎన్నికలు మాత్రమే తేలుస్తాయి. కానీ ఈలోగా వైసీపీ అడిగే ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు.
పవన్ కల్యాణ్ తో పెట్టుకోబోయే పొత్తు మీద ఆశలతోనే తెలుగుదేశంలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. పవన్ భుజాల మీది ఎక్కి సవారీ చేస్తూ అధికారంలోకి వచ్చేయగలమని వారు ఉత్సాహపడుతున్నారు. పవన్ కూడా తెలుగుదేశం పల్లకీని మోయడానికి రెడీగానే ఉన్నాడు.
జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలం అనే నమ్మకం ఆ ఇద్దరికీ లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అంటున్నవాళ్లు.. తమ పాలనను ప్రజలు నమ్ముతారనే విశ్వాసంతో మాత్రం లేరు. ఆ వ్యతిరేకత తమను గెలిపిస్తుందని విడివిడిగా ఏ ఒక్కరికీ లేదు. అందుకే వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే పడికట్టు పదాలతో నంగి మాటలు మాట్లాడుతూ పొత్తుల బాటలో ఆరాటపడుతున్నారు.
తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ బలం చాలా పెరిగింది గనుక.. పవన్ తో పొత్తు లేకుండా పోటీచేయాలని తామొక్కరమే అధికారంలోకి రాగలమని.. అనేకమంది పార్టీ నాయకులు కోరుకుంటున్నట్లుగా ఒక సూడో అబద్ధపు ప్రచారం ప్రారంభించారు. అలాంటి ప్రచారం ద్వారా పవన్ డిమాండ్లకు బ్రేకు వేయవచ్చు అనేది వారి కోరిక.
ఇలాంటి చంద్రబాబు మార్కు వక్ర బుద్ధుల గురించి పవన్ కు బాగా అవగాహనే ఉంది. తనకు ఎటూ సొంతంగా ఒక్క సీటైనా గెలిచే దిక్కు లేదు గనుక.. కొన్ని సీట్లయినా దక్కాలంటే చంద్రబాబు మద్దతు కావాలనేది ఆయన కోరిక. అందుకు ఆయన ప్రజాహితం డ్రామాలు ఆడుతుంటారు.
అందుకే.. ఒంటరిగా పోటీకి రాగలారా అనే డిమాండ్ వైసీపీ నుంచి వినిపించిన ప్రతిసారీ తెలుగుదేశం వారు కంగారు పడుతున్నారు. ‘ఆ ఒక్కటీ అడక్కు ప్లీజ్’ అని మొక్కుకుంటున్నారు.