చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లేది లేదు?

తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చారు తెలుగుదేశం అధిపతి చంద్రబాబు నాయుడు. ఆరోగ్య కారణాలు బలంగా వుండడంతో ఈ తాత్కాలిక బెయిల్ లభించింది. గడువు తీరిపోయిన తరువాత మళ్లీ జైలుకే అంటారు వైకాపా నేతలు.…

తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చారు తెలుగుదేశం అధిపతి చంద్రబాబు నాయుడు. ఆరోగ్య కారణాలు బలంగా వుండడంతో ఈ తాత్కాలిక బెయిల్ లభించింది. గడువు తీరిపోయిన తరువాత మళ్లీ జైలుకే అంటారు వైకాపా నేతలు. కానీ తేదేపా నేతలు ఏం మాట్లాడడం లేదు కానీ. సైలంట్ గా మళ్లీ వెళ్లకుండా వుండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, అవి తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. 

చంద్రబాబును లీగల్ గా కొట్టడం అంత సులువు కాదు. కాస్త ఏమర పాటుగా లేదా అతి ధీమాగా వున్నారు కనుక జగన్ చటుక్కున ఎత్తు వేసి లోపల వేయగలిగారు. ఇక మళ్లీ మరోసారి అంటే అసాధ్యమే దాదాపు.

కోర్టుకు చంద్రబాబు ఆరోగ్యం మీద వైద్యుల అందించిన రిపోర్టు సమర్పించారు. బెయిల్ కోరినట్లే చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు, మెడికల్ టెస్ట్ లు చేయించుకున్నారు. ఎక్కడా బెయిల్ షరతులు మీరకుండా ఇంటికే పరిమితం అయ్యారు. సరే ఇంతకీ మెడికల్ రిపోర్టుల ప్రకారం అంతా ఓకె నా? మళ్లీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలకు పంపవచ్చా? అన్న అనుమానాలు వుండనే వున్నాయి.

కోర్టు నిర్ణయం ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేరు కానీ మెడికల్ రిపోర్టులో అంశాలు చూస్తుంటే మాత్రం ఈ తాత్కాలిక బెయిల్ ను మరి కొంత కాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ జరిగింది. తరచు కంటి ప్రెజర్ చెక్ చేయాల్సి వుంది. అది కూడా అయిదు వారాల పాటు పద్దతిగా అన్నీ చెక్ చేయాల్సి వుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యల రీత్యా, టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వుంది.

బహుశా ఈ కారణాలు అన్నీ బెయిల్ పొడిగించేందుకు సరిపోతాయనే అనుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య రీత్యా ఇచ్చిన తాత్కాలిక బెయిల్. అది పొడిగించమనే సహజంగానే చంద్రబాబు కోరతారు. దానికి తగిన బలమైన పాయింట్లు ఇప్పుడు కోర్టుకు సబ్ మిట్ చేసిన రిపోర్టులో వున్నాయి.

అందువల్ల ఇప్పట్లో చంద్రబాబు జైలు సమస్య వుండదు. కానీ ఒకటి మళ్లీ అవే కండిషన్లు వుంటాయి. అందువల్ల ఎవరినీ కలవడం అన్నది, రాజకీయ కార్యకలాపాలు అన్నవి కష్టం కావచ్చు. ఆయన ప్రత్యర్ధులకు కూడా కావాల్సింది అదేనేమో?