ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు గవర్నర్ కోరారు. ఈమేరకు ఓ వినతి పత్రం అందించారు. బాగానే వుంది. నెల పొడవునా పని చేసిన తరువాత ఒకటవ తేదీన జీతం రాకపోతే ఎవరికైనా కష్టమే. ప్రభుత్వం బాధ్యత కూడా అది. దాన్ని నెరవేర్చాలి. అయితే ఇలా చట్టం చేయాలని కొరినపుడు మరి కొన్ని చట్టాలు కూడా చేస్తే బెటర్.
టీచర్లు బళ్లలో చదువు చెప్పడానికే పరిమితం కావాలి. ట్యూషన్లు చెప్పకూడదు. ప్రయివేటు సంస్థల్లో పార్ట్ టైమర్లుగా పని చేయకూడదు. డ్యూటీ వదిలేసి రాజకీయ నాయకుల వెంట తిరగకూడదు.
సాఫ్ట్ వేర్..సాఫ్ట్ వేర్ అంటారు. కానీ ప్రభుత్వ టీచర్ల జీతాలు తెలిస్తే చాలా మంది అవాక్కవుతారు. లక్షల్లో జీతం అందుకుంటున్నారు. కానీ సిన్సియర్ గా పాఠాలు చెబుతున్నవారి శాతం ఎంత మేరకు?
ఇద్దరే టీచర్లు వున్న చోట్ల, బై డీఫాల్ట్ సెలవు చీటీ అక్కడ వుంచి ఒక్కరే డ్యూటీ చేసే స్కూళ్లు ఎన్ని? చీటీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్న టీచర్లు ఎంత మంది?
ప్రభుత్వం టెక్నాలజీ వాడుతూ థంబ్ ఇంప్రెషన్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ వేస్తాం అంటే గొడవ చేస్తారెందుకు? మీరు రెగ్యులర్ గా టైమ్ కు వస్తుంటే భయమెందుకు. మీ పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, లేదా వేరే ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ థంబ్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ వేయించుకోవడం లేదా? అక్కడ కూడా వద్దని గొడవ చేయవచ్చు కదా? ఉద్యోగం పీకి ఇంటికి పంపుతారని భయం. ఇక్కడ ప్రభుత్వం ..పైగా యాంటీ ‘సామాజిక’ మీడియా దన్ను వుండనే వుంది.
ఇక రెవెన్యూ సంగతి చూద్దాం. పొలం పాస్ బుక్ కావాలి అంటే ఎంత ఇవ్వాలో అనుభవం అయిన వారు అందరికీ తెలుసు. ఎకరానికి లేదా బుక్ కు అయిదు నుంచి ఆరు వేలు సమర్పించుకోకుండా పని జరుగుతుందా? చెప్పగలరా ఎవరైనా? వీఆర్వో, ఆర్ఐ, డిటి, ఎమ్మార్వో లకు అందరికీ ఈ మామూళ్లు వెళ్తాయన్న సంగతి జగద్విదితం కదా?
అసలు పిహెచ్ సి వున్న చోటే నివాసం వుంటున్న నర్సులు, డాక్టర్లు, ఎఎన్ఎమ్ లు ఎంత మంది? ఒక్క డాక్టర్ ను పిహెచ్ సి వున్న చోట వున్నారు అని చూపించండి. మరి దీని మీద కూడా చట్టం చేయించవచ్చు కదా? అలా అని గవర్నర్ ను కోర వచ్చు కదా? నిజానికి ఇవన్నీ రూల్స్ వున్నవే. గట్టిగా అమలు చేస్తే, రేపటి నుంచి ‘సామాజిక’ మీడియా రెడీ అయిపోతుంది. వీరందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మార్చడానికి.
దేవాలయాల్లో దేవాదాయ శాఖ సిబ్బంది చేతివాటం సంగతి తెలిసిందే కదా. నిత్యం కథలు కథలుగా వినిపిస్తుంటాయి. ఇలా ప్రతి శాఖలో అవినీతి లేదా అలసత్వం తాండవిస్తూ వుంటుంది. ఇవన్నీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసినపుడు కాస్త ఆలస్యంగా జీతం వచ్చినా వదిలేయాలి అని అనడం లేదు.
తమ హక్కులు చట్టంగా మార్చమని అడిగినపుడు, బాధ్యతలు కూడా చట్టాలుగా మారాలి కదా? ఇవ్వాళ జగన్ వుండొచ్చు. రేపు బాబో, పవన్ నో రావచ్చు. అది వేరెే సంగతి. కానీ తప్పు చేసే వారిని వెనకేసుకు రావడం మాత్రం ‘సామాజిక’ బంధాల మీడియాకు మంచిది కాదు. ఇవ్వాళ బాబు వెనకేసుకువస్తారు. రేపు జగన్ వెనకేసుకువస్తాడు. అప్పుడు, ఎప్పుడు ఉద్యోగులు ఇలాగే హ్యాపీగా లక్షల్లో జీతాలు తీసుకుంటూ పని చేసీ చేయనట్లు చేసుకుంటూ పోతారు.