చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకుడు. మరి ఈ సినిమాతో ఆచార్య దర్శకుడు కొరటాల శివకు సంబంధం ఉందా? ఇప్పటివరకు అలాంటి సమాచారం ఏదీ బయటకు రాలేదు. తొలిసారి దర్శకుడు బాబి, వాల్తేరు వీరయ్యకు కొరటాలకు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టాడు.
వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి మరో బలమైన పాత్ర కోసం లాక్ డౌన్ టైమ్ లో టీమ్ తో కలిసి ఆలోచిస్తున్న టైమ్ లో రవితేజ తన మైండ్ లోకి వచ్చాడని తెలిపాడు బాబి. అలా తన మైండ్ లో మొదలైన ఆలోచనను తొలిసారిగా కొరటాల శివతో పంచుకున్నానని, ఆయన ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ పాత్రను పూర్తిస్థాయిలో మలిచానని తెలిపాడు.
“ఏ సినిమా కథ రాయడం స్టార్ట్ చేసినా నాకు మైండ్ లోకి వచ్చే మొదటి హీరో రవితేజ. చిరంజీవి కోసం వాల్తేరు వీరయ్య కథ రాస్తున్నప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ గుర్తొచ్చారు. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కొడుకులుగా కాకుండా, సవతి తల్లి పిల్లలుగా ఇద్దరు హీరోల్ని స్క్రీన్ పై చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నేను చిరంజీవికి చెప్పలేదు. నా ఆలోచనను ముందుగా కొరటాల శివతో షేర్ చేసుకున్నాను. వాల్తేరు వీరయ్యలో రవితేజ లాంటి బలమైన పాత్ర ఒకటి క్రియేట్ అవుతుందని ముందుగా కొరటాల శివతో చెప్పాను. చాలా బాగుంటుంది, బలంగా నమ్మి రాయమన్నారు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతో క్యారెక్టర్ రాసి, ఆ తర్వాత చిరంజీవిని కలిశాను. మొదటి సిట్టింగ్ లోనే చిరంజీవి ఓకే చెప్పారు.”
ఇలా వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర నెరేషన్ వెనక కొరటాల ఇచ్చిన ప్రోత్సాహం ఉందని స్పష్టం చేశాడు బాబి. రవితేజ పాత్ర అంత బలంగా రావడానికి కొరటాల ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉందంటూ, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. నిన్నటితో వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.