తెలుగుదేశం కార్యకర్తలు అయిదేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డారు. నిజమే కావచ్చు. అందువల్ల ఇప్పుడు ఏ ఆఫీసుకు అయినా, ఎమ్మార్వో అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా సరే, పసుపు రంగు బిళ్ల పట్టుకుని వెళ్లండి.. కూర్చో పెట్టి, టీ ఇచ్చి, చెప్పిన పని చేయకపోతే, ఆ తరువాత సంగతి తాను చూసుకుంటా అనేసారు మంత్రి అచ్చెన్న నాయుడు. ఇవి చాలా కాలం పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఆ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా క్రియాశీలక సభ్యుల కోసం ఓ డైరీ ముద్రించారు. పచ్చటి పసుపు రంగులో వుండేది ఆ డైరీ. తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వ ఆఫీసుకు వెళ్తే ముందుగా ఆ డైరీ ని అధికారి టేబుల్ మీద ఫట్ మని పడేసేవారు. ఆ తరువాత కుర్చీ లాక్కుని కూర్చునేవారు.
ఇలాంటిది ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో జరిగేది. ఆ తరువాత తరువాత ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు కానీ ఆ డైరీ చేత్తో పట్టుకుని తిరగడం ఆగిపోయింది. బహుశా కార్యకర్తలు, నాయకులు అందరికీ పరిచయం అయిపోయారనే భావనతో ఆపేసి వుంటారు. అధికారులు మాత్రం ఆ డైరీ పట్టుకుని వచ్చిన వారితో మంచిగా. మాట్లాడి, ఏదో ఒకటి చేసి పంపేవారు.
ఇప్పుడు అచ్చెన్న మాటలు ఆ నాటి రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఇంతకీ బిళ్ల అంటే చొక్కాకు పెట్టుకునే బ్యాడ్జ్ అనుకోవాలా? ఏమో?