తాను ఎవరిని నిలిపినా గెలిచిపోతారనే భ్రమ నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయట పడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఘోర పరాజయం తర్వాతైనా జగన్ వాస్తవాల్ని గ్రహించాలని వారు అంటున్నారు. అంతా తన పేరుపైనే గెలుస్తారనే అహంభావంతోనే గత ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థుల్ని చాలా చోట్ల నిలబెట్టారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
కేవలం లెక్కలేనితనంతోనే బలమైన అభ్యర్థుల్ని జగన్ పోగొట్టుకున్నారని చెబుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు తదితర నాయకులంతా టీడీపీలోకి పోవడం వల్ల వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వేమిరెడ్డి, మాగుంట ఎఫెక్ట్ బాగా పడిందని వైసీపీ నాయకులు వివరిస్తున్నారు.
జగన్ వ్యవహార శైలితోనే వేమిరెడ్డి, మాగుంట, లావు తదితర నాయకులు టీడీపీలోకి వెళ్లారు. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన వారిలో నలుగురు ఎంపీలుగా తిరిగి ఎన్నిక కావడాన్ని వారు ఉదహరిస్తున్నారు. వేమిరెడ్డి, మాగుంట, లావు, బాలశౌరి కూటమి నుంచి ఎంపీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
బలమైన నాయకుల్ని నిలబెట్టుకోవడంలో జగన్ విఫలం కావడం , దాన్ని అనుకూలంగా మలుచుకున్న టీడీపీ, జనసేన మంచి ఫలితాలు పొందాయి. అలాగే రఘురామకృష్ణంరాజును అధికారం వచ్చిన మొదట్లోనే వైసీపీ పోగొట్టుకుంది. ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో దిట్ట అయిన రఘురామకృష్ణంరాజును జగన్‌కు దూరం చేయడంలో ఆయన చుట్టూ ఉన్న ఎంపీలే కుట్ర పన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అధికారాన్ని ఎవరైనా వదులుకుని ప్రతిపక్ష పార్టీలకు చేరువ అవుతారా? దీన్నిబట్టి లోపం ఎక్కడుందో జగన్ తెలుసుకోవాలి.
తనకొక్కడికే పేరు, పలుకుబడి వున్నాయనే భ్రమ నుంచి జగన్ బయటపడితేనే భవిష్యత్. ఇతరులకు కూడా తనంత కాకపోయినా, కొద్దోగొప్పో పలుకుబడి ఉంటుందని గ్రహించాలి. అందరూ కలిస్తేనే, ప్రజాదరణ పొందగలమని గుర్తించాలి. ఆ నాయకుడు పోతే, ఈ నాయకుడు పోతే ఏమీ కాదని… అనుకోవడం వల్లే వైసీపీకి ఘోర పరాయం ఎదురైందని గుర్తించాలి. అందర్నీ కలుపుకుని పోయే స్వభావాన్ని జగన్ అలవరుచుకోవాలి. తానెవరినీ లెక్క చేయనంటే, అటు వైపు వారు కూడా అదే రీతిలో స్పందిస్తారు. నువ్వు లెక్క చేయకపోతే, మేమెందుకు ఖాతరు చేస్తామని అనకపోయినా, ఎన్నికల్లో వ్యతిరేకంగా కసితో పని చేస్తారు. ఇదే ఈ దఫా ఎన్నికల్లో జరిగింది.
సింగిల్‌గా సింహం .. లాంటి అహంకార మాటలే వైసీపీ కొంప ముంచాయి. చివరికి సొంత పార్టీ కేడర్‌ను కూడా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కావున ప్రతి ఒక్కర్నీ గౌరవించాలి. ప్రతి నాయకుడికీ ఎంతోకొంత ప్రజాబలం వుంటుందని భావించాలి. అందరూ కలిస్తేనే బలం. మనిషిని కాదు, జంతువుల్ని నిలబెట్టినా ఓట్లు వేస్తారనే ఆలోచన నుంచి జగన్ బయటపడి, తన వైఖరిని పూర్తి మార్చుకుని, అందరితో మమేకం అయితేనే రాజకీయ భవిష్యత్ వుంటుందనే అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. తన లోటుపాట్లను సవరించుకుని, సరికొత్త రాజకీయ అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను జగన్ గుర్తించాలి.