తెలంగాణ, ఏపీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా రెండూ తెలుగు రాష్ట్రాలే. ఏపీ ప్రజలు తెలంగాణలో గణనీయంగా ఉన్నారు. ఏపీలోనూ తెలంగాణ వారు కొందరున్నారు. రాజకీయ కారణాలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా ప్రజలంతా ఒక్కటే కదా. రాజకీయ నాయకులు కూడా గతం మర్చిపోయారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో పరిపాలన విధానాలపై, సీఎంల తీరుపై చర్చ జరుగుతూనే ఉంది.
ప్రజలు, పోటీషియన్స్ రెండు రాష్ట్రాలను గమనిస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. సరే.. ఏపీలో ఐదేళ్లు జగన్ పరిపాలన, తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా జరిగాయనే చర్చ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు తెలంగాణలోని అపోజిషన్ పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబును అస్త్రంగా వాడుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రయోగిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఒత్తిడి పెంచుతున్నాయి. టెన్షన్ పుట్టిస్తున్నాయి.
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏపీ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి ఇమ్మీడియట్ గా వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల అమౌంట్ పెంచేశాడు. మెగా డీఎస్సీ ప్రకటించేశాడు. ఇంకా కొన్ని హామీల అమలును ప్రకటించేశాడు. దీన్ని తెలంగాణ అపోజిషన్ పార్టీలు అస్త్రంగా వాడుకుంటూ రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాయి. చంద్రబాబును చూసి నేర్చుకో అని సలహా ఇస్తున్నాయి. బీజేపీ యేలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకు పడుతున్నారు.
ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఏపీలోనే వెంటనే హామీలు అమలు చేస్తుంటే, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా గమ్మున ఎందుకు ఉన్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ పక్క రాష్ట్రం సీఎం సంగతి మనకెందుకని అన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశాడని, దాన్ని సెట్ చేస్తున్నామని చెప్పాడు. రేవంత్ రెడ్డి కనుక హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తామని హరీష్ రావు హెచ్చరిస్తున్నాడు. మొత్తం మీద ఏపీలో బాబు చేస్తున్న పనులవల్ల రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది.