కాంగ్రెస్ లో పూర్తి రాజకీయ జీవితం సాగించిన వారు బొబ్బిలి రాజులు. టీడీపీలో పూసపాటి రాజులు అధికార చక్రాలు తిప్పేవారు. కానీ ఇప్పుడు రెండు సంస్థానధీశులూ టీడీపీలోనే ఉంటున్నారు. 2019లో విజయనగరం బొబ్బిలి రాజులు కలసి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఓడారు కాబట్టి ఎవరి అస్తిత్వ పోరాటాలు వారు చేసుకుంటూ వచ్చారు.
తాజా ఎన్నికల్లో పూసపాటి రాజుల మూడవ తరం వారసురాలు అదితి గజపతిరాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు. బొబ్బిలిలో చూస్తే మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు తెర వెనక్కు జరగగా ఆయన తమ్ముడు బేబీ నాయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు.
దీంతో టీడీపీలో బొబ్బిలి రాజుల హవా మొదలైంది అని అంటున్నారు. మంత్రిగా బేబీ నాయన కనిపిస్తారు అనుకున్నా తొలి దఫాలో చాన్స్ తగలలేదు, పునర్ వ్యవస్థీకరణలో కచ్చితంగా ఆయనకు చాన్స్ వస్తుందని అనుచరులు నమ్ముతున్నారు.
నిజానికి మంత్రి పదవి ఇంటిదాకా వచ్చినట్లే వచ్చి తప్పిపోయింది అన్న ప్రచారమూ ఉంది. దానికి జిల్లా రాజకీయ సమీకరణలు కారణం అని అంటున్నారు. అయితే రానున్న రోజులలో మాత్రం బొబ్బిలి కోట నుంచే జిల్లా రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఒకనాడు విజయనగరం కోట టీడీపీ రాజకీయాలను శాసించిన సంగతి విధితమే. అశోక్ కుమార్తెకు అంత అనుభవం చాతుర్యం ఉంటే ఫరవాలేదు కానీ లేకపోతే మాత్రం మరో సంస్థానంగా ఉన్న బొబ్బిలి కోట నుంచి పసుపు రాజకీయం పసందుగా సాగుతుందని అంటున్నారు.
ఇక తూర్పు కాపుల నుంచి నాయకులు ఉన్నారు. వారు కూడా జిల్లా రాజకీయాల్లో చాన్స్ వస్తే చక్రం తిప్పాలని చూస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే ఆయన క్రియా శీల రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు విజయనగరం కోటకు అల్టర్నేషన్ గా టీడీపీలో కొత్త కేంద్రాలు పుట్టుకుని రావచ్చు అని అంటున్నారు.