తెలంగాణ మంత్రి హరీష్ రావు గారికి ఇప్పుడు ఒకటే ధ్యాస. పక్క రాష్ట్రం మీద ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదు. కానీ పాపం, మీడియాలో తమ రాష్ట్రం గురించి ఏం వార్తలు వస్తున్నాయి అన్నది చూడడం లేదు. అలా చూస్తే ముందు వాటి గురించి తన వివరణ ఇచ్చుకుంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చేది.
ఆంధ్ర పేరు ఎత్తకుండా పొరుగు రాష్ట్రం ఇలా, ఆ రాష్ట్రం నాయకులు ఇలా అంటూ ఇప్పటికీ అదే సెంటిమెంట్ రాజేద్దామనో, చిన్న గీత దగ్గర పెద్ద గీత కింద తెలంగాణను చూపించాలనో తాపత్రయపడుతున్నారు తప్ప మరో ఆలోచన కనిపించడం లేదు. కానీ ఇదే సమయంలో తెలంగాణ పరిస్థితులను మీడియా కళ్ల ముందుకు తెస్తోంది.
నెలాఖరు వరకూ జీతాలు, పింఛన్ల చెల్లింపు
సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులిచ్చేది ఎప్పుడో!?
సర్కారు సంక్షేమ పథకాలకు రెండేళ్ల బకాయిలు
భూముల అమ్మకాల్లేకపోతే గడవడమే కష్టం
పదేళ్లలో మిగులు నుంచి అప్పుల కుప్పగా తెలంగాణ
తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.75,572 కోట్ల అప్పు ఉంది. ఎనిమిదేళ్లలో కేసీఆర్ సర్కారు మరో 3.5 లక్షల కోట్ల అప్పు.. చేసింది. అంటే, ఏటా సగటున రూ.44 వేల కోట్ల అప్పు చేస్తే తప్ప గడవని పరిస్థితి.
ఇదీ మీడియా చెబుతున్నది.
రాష్ట్రం వచ్చినప్పుడు రూ.5 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.14 లక్షల కోట్లకు పెరిగింది. దీనిని చూపించే తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నారు కానీ ఇలా పెరిగిన మేరకు ఏ ఒక్క రంగానికి కేటాయింపులు ఆ మేరకు లేవు అన్నది అంకెలు చెబుతున్న వాస్తవం. మరి ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వుండగా, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తుంటే, మరి సరైన ఆదాయం లేకుండా విభజన శాపానికి గురైన ఆంధ్ర ను ఆడిపోసుకోవడం అంటే ఏమనుకోవాలి? అంతే కాదు, ఇప్పటికే తెలంగాణలో చేసిన భూముల అమ్మకం విలువ మరో ముఫై శాతం అప్పు అంటోంది మీడియా.
తెలంగాణకు, ఆంధ్రకు ఒకటే తేడా. అక్కడ ముప్పావు శాతం మీడియా ప్రభుత్వంపై డేగ కన్నేసి వుంటుంది. నిత్యం ప్రభుత్వాన్ని తూర్పారపట్టడానికే పని చేస్తుంది. ఇందులో కొంత నిజం, కొత్త అసత్యం వుంటాయి. అయినా కొంతయినా ప్రభుత్వ తప్పిదాలు బయటకు వస్తాయి. కానీ తెలంగాణలో అలా కాదు. తొంభై శాతం మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా వుంటుంది. ఒక్క తప్పు కూడా బయటకు రాదు. ఎన్నికలు వస్తున్నాయి కనుక, ఇప్పుడిప్పుడే లెక్కలు బయటకు వస్తున్నాయి మెలమెల్లగా.
రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించి దాదాపు 10 వేలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) పార్ట్ ఫైనల్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (టీఎ్‌సజీఎల్‌ఐ) బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లు, వాహన అడ్వాన్సుల బిల్లులు, రిటైర్మెంట్ సెటిల్‌మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్‌లో పడి వున్నాయట. కాంట్రాక్టర్ల వర్క్స్ బిల్లుల కింద దాదాపు రూ.15 వేల కోట్లు చెల్లించాల్సి ఉందట.
మరి ఈ ప్రగతిని హరీష్ రావు ఏ విధంగా చూడమంటారు?
సరే డబ్బు లెక్కలు పక్కన పెడితే, అవినీతి సంగతి వేరే. అది ప్రతిపక్షాలు నిత్యం ఘోషిస్తున్న సంగతులే. తెలంగాణ ప్రభుత్వం తమ ఐకానిక్ ప్రగతిగా చెప్పుకునే వందల కోట్ల, వేల కోట్ల ప్రాజెక్టులు అన్నింటి వెనుక ఏముంది అన్నది ప్రతిపక్షాలు చెబుతూనే వున్నాయి. ఇప్పుడు ప్లానింగ్ లో వున్న ట్విన్ టవర్స్ వెనుక కూడా ఇదే అవినీతి దాగి వుందని, అంతే కాదు, ట్విన్ టవర్స్ అంటూ, ఇప్పుడు వున్న ఆఫీసులు అన్నీ తరలించి, నగరం నడిబొడ్డులో వున్న ఆ భూములు అన్నీ అమ్మడమే అసలు లక్ష్యమని అంటున్నారు.
సరే..ఈ సంగతులు అన్నీ అలా వుంచి, హరీష్ రావు గారు మిస్ అవుతున్న లాజిక్ చూద్దాం.
తెల్లవారి లేచింది మొదలు..మీ ఆంధ్ర ఇలా..మీ ఆంధ్ర నాయకులు అలా అంటూ దెప్పుతూ వుంటే, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్ర జనాలు తమను, తమ రాష్ట్రాన్ని, తమ నాయకులను కించపరుస్తున్న పార్టీకి ఓటు ఎలా వేస్తారు?