ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అవినీతిపరుడనే అపవాదు ఎక్కడా లేదు. ఎందుకంటే.. అధికారం లేకుండా ఆయన అవినీతికి పాల్పడే అవకాశం లేదు. కానీ అధికారం కోసం ఆయన తొక్కే అడ్డదారులే ఎవరికీ నచ్చడంలేదు. కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా.
వాస్తవానికి పవన్ కల్యాణ్ పై కాస్తో కూస్తో జనంలో సింపతీ ఉంది. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారని, బీజేపీ చేతిలో అనవసరంగా ఇరుక్కున్నారని, పొత్తుల పేరుతో చిత్తవుతున్నారనే సింపతీ ఆయనపై ఉంది. ప్యాకేజీ తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. పదే పదే బాబు, బీజేపీ చేతిలో పవన్ బఫూన్ గా మిగిలిపోవడం మాత్రం జనసైనికుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది.
ఇప్పటికైనా తన స్థాయి తెలుసుకుంటారా..?
3 ఆప్షన్లు అంటూ రెచ్చిపోయిన పవన్, స్వయంగా టీడీపీ నేతలతో గడ్డి పెట్టించుకున్నారు. ఇన్నాళ్లూ తమ వాడు అనుకున్న తెలుగుదేశం నేతలు, పవన్ పై విరుచుకుపడ్డారు. కొంతమందిని ఎగదోసి, మరికొంతమందిని వెనక్కి తగ్గమని చెప్పి చంద్రబాబు తనదైన మైండ్ గేమ్ ఆడారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇక బీజేపీ విషయానికొస్తే.. ఏకంగా జేపీ నడ్డా ఈ ఆప్షన్లను తిప్పికొట్టారు. పవన్ తో పొత్తులపై మాట్లాడొద్దని నాయకులకు అల్టిమేటం ఇచ్చారు. ఆప్షన్ల కంటే ముందు రోడ్ మ్యాప్ అన్నారు పవన్. రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ అన్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
అంతకంటే ముందు, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చను అన్నా కూడా ఎవరూ నమ్మలేదు. అటు బీజేపీ, ఇటు టీడీపీ రెండూ పవన్ ప్రతిపాదనను తిప్పికొట్టాయి. ఈ పరిణామాలతో ఇప్పటికైనా పవన్ తన స్థాయి ఏంటో తెలుసుకుంటారా..?
ముందు సీఎం భ్రమల నుంచి బయటపడాలి..
పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్లలో కూడా ఆయనే సీఎం. ఒకటి జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అంటే ఆయనే సీఎం కావడం. రెండోది బీజేపీతో కలసి పోటీ చేసి అధికారం చేజిక్కించుకోవడం. సీఎం అభ్యర్థిగా పవన్ ని ప్రకటించాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి.. ఇక్కడ కూడా తానే సీఎం కావాలనుకుంటున్నారు జనసేనాని.
ఇక మూడోది బీజేపీ-టీడీపీ-జనసేన కలిపి వైసీపీని ఓడించి అధికారంలోకి రావడం. ఇప్పటికే రెండు సార్లు తగ్గాను, మూడోసారి తగ్గే ప్రసక్తే లేదు అని ముందే హింటిచ్చారు కాబట్టి.. ఇక్కడ కూడా పవనే సీఎం అనుకోవాలి. అంటే.. ఎలాగైనా అధికారంలోకి రావాలి, తానే సీఎం కావాలి. ఇదీ పవన్ విధానం. అయితే ముందు ఆ సీఎం భ్రమల నుంచి పవన్ బయటపడాలి.
సీఎం, సీఎం అన్నంతకాలం ఎవరూ పట్టించుకోరు. అంత అత్యాశ ఉంది కాబట్టే.. ఇప్పుడు టీడీపీ, బీజేపీ కూడా పవన్ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బహిరంగంగానే ఆ ప్రపోజల్స్ ని ఎండగడుతున్నాయి. పవన్ ఉన్నా కూడా ముందు సింగిల్ గా ఏపీలో బలపడాలి అంటూ జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు ఆదేశమిచ్చారంటే.. రాజకీయాలు ఎలా చేయాలో పవన్ వారిని చూసైనా నేర్చుకోవాలి.
సో.. ఇకనైనా పవన్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటికీ సమయం మించిపోలేదు. రెండేళ్లలో పార్టీని బలపరచుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను సీఎం అభ్యర్థిగా ఎవరో ప్రకటిస్తారు అనుకోకుండా.. సొంతంగా బలపడేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జనసేనకైనా, జనసైనికులకైనా మంచిరోజులొస్తాయి. కనీసం అసెంబ్లీలో పవన్ కి ఎంట్రీ దొరుకుతుంది.