ఎఫ్3 ప్రచారానికి పూర్తిగా దూరమైంది తమన్న. దర్శకుడు అనీల్ రావిపూడితో గొడవ జరగడం వల్లనే ఆమె ప్రమోషన్ కు దూరమైందనే వాదన ఉంది. దీన్ని అనీల్ రావిపూడి ఖండించలేదు. సెట్స్ లో తనకు, తమన్నకు మధ్య గొడవ జరిగిందనే విషయాన్ని తాజాగా అంగీకరించాడు. ఆ వేడి 2 రోజుల పాటు నడిచిందని కూడా తెలిపాడు. అయితే ఆ తర్వాత అంతా సర్దుకుందని, ఆమె వేరే సినిమా షూట్ లో బిజీగా ఉండడం వల్ల ఎఫ్3 ప్రచారానికి రాలేకపోయిందని వివరణ ఇచ్చాడు రావిపూడి.
ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ తర్వాత అనీల్ రావిపూడి ఇచ్చిన ప్రకటనే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రావిపూడి-తమన్న మధ్య అభిప్రాయబేధాలన్నీ సమసిపోయాయంట. రేపోమాపో ఆమె ప్రచారానికి కూడా వస్తుందట. ఇప్పుడు ఎఫ్3 ప్రచారానికి తమన్న రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది హాట్ టాపిక్.
ఎఫ్3కి ఆక్యుపెన్సీ సగానికి సగం పడిపోయింది. ఎప్పుడైతే మేజర్ సినిమా హిట్టయిందో ఎఫ్3కి ఫుట్ ఫాల్ తగ్గింది. దెబ్బ మీద దెబ్బలా మేజర్ తో పాటు విక్రమ్ సినిమా కూడా హిట్టయింది. మరో 3 రోజుల్లో నాని నటించిన అంటే సుందరానికి సినిమా కూడా వచ్చేస్తోంది.
ఇలాంటి టైమ్ లో తమన్న రంగంలోకి దిగడం వల్ల ప్రయోజం ఉంటుందని ఎవ్వరూ భావించడం లేదు. ఆమె మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఆక్యుపెన్సీ పెరుగుతుందని భావిస్తే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఎందుకంటే, హీరోలు వెంకీ, వరుణ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్లతో ఎన్ని రకాల ప్రచారాలు చేయించాలో అన్నీ చేయించారు. చివరికి స్టేజ్ పై స్టెప్పులు కూడా వేయించారు.
ఇలా ఎఫ్3 ప్రచారం దాదాపు పరిసమాప్తమైన వేళ, మిల్కీబ్యూటీ రంగంలోకి దిగుతుందని చెబుతున్నాడు అనీల్ రావిపూడి. ఆమె రాకతో ఈ సినిమాకు ఎంత లబ్ది చేకూరుతుందో ఆ యూనిట్ కే తెలియాలి.