పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టి.. తెలుగుదేశంతో పొత్తుల ప్రస్తావన తీసుకు వచ్చారు. అయితే దీనిపై పవన్ కల్యాణ్ మాటలను భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చుతోంది. అసలు ఈ సమయంలో పొత్తుల గురించి మాట్లాడడమే భావ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాటలే ఇందుకు నిదర్శనం.
పవన్ కల్యాణ్ వైసీపీ ట్రాప్ లో పడ్డారని, గత ఎన్నికల సమయానికి చంద్రబాబునాయుడు వైసీపీ ట్రాప్ లో పడ్డారని, అదే తీరుగా ఇప్పుడు పవన్ కల్యాణ్ వైసీపీ ట్రాప్ లో పడ్డాడని సత్యకుమార్ అంటున్నారు. ఇంత ముందుగా పొత్తుల గురించి మాట్లాడడమే అందుకు నిదర్శనం అనేది ఆయన అభిప్రాయం. ఈ విషయం పక్కన పెడితే.. సత్యకుమార్ చెప్పిన మరో విషయాన్ని మాత్రం.. పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకోవాల్సిందే.
అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. బీజేపీ నాయకుడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం సాంప్రదాయం అని సత్యకుమార్ అంటున్నారు. తమ పార్టీ తరఫు వారే సీఎం కావడం సంప్రదాయమని సత్యకుమార్ తమ పార్టీ మేధావుల సభలో అన్నారు. ఇంతకూ సంప్రదాయం అంటే ఏమిటో సత్యకుమార్ కు తెలుసో లేదో? ఎందుకంటే.. గతంలో ఆచరిస్తూ వచ్చిన దానినే మనం సంప్రదాయం అంటూ ఉంటాం.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఏదో నాలుగు సీట్లు ఇతరుల సాయంతో గెలుచుకోవడం తప్ప.. బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ ఏనాడు ఉండినదని… ఆయన సాంప్రదాయం అనే మాట వాడుతున్నారో అర్థం కావడం లేదు. తెలుగురాష్ట్రాల్లో ఏనాడు అధికారం గురించి ఆశ పెట్టుకునేంత దిక్కులేని పార్టీ కూడా.. సీఎం సీటు తమకే అంటుండడం తమాషా. ఏపీ విషయానికి వస్తే.. నికరంగా ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేనీ బీజేపీ.. అన్ని పాములు లేచి ఆడుతున్నాయని.. వానపాము కూడా లేచి ఆడినట్లుగా ఉన్నదని పలువురు అంటున్నారు.
పాపం బీజేపీని నమ్ముకుని రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్.. వారి మీద ప్రేమ కురిపిస్తూ ముస్లిం ఓటు బ్యాంకును కూడా దూరం చేసుకుంటున్నాడు. అలాంటి నేతకు ఇప్పుడు కళ్లు తెరుచుకుంటుండవచ్చు. 2014లో చంద్రబాబు పల్లకీ మోశాడు. 2019లో ఎన్నికల్లో దిగి సర్వనాశనం అయ్యాడు. పరువు కూడా పోయింది.
ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తెస్తుండగా.. గెలిచినా సరే.. బీజేపీ పల్లకి మోయడం తప్ప పవన్ కు మరో గత్యంతరం లేదనే అర్థం వచ్చేలాగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాటలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.