
రెండు రోజుల క్రితం భారతదేశ చిత్ర పరిశ్రమ గర్వించేలా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఇది తెలుగు పాట కావడం టాలీవుడ్‌తో పాటు తెలుగు వారిగా మనందరికీ ఆనందం కలిగించే అంశం. అలాగే యాక్టింగ్‌లో టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌కు ఆస్కార్ పురస్కారం దక్కకపోవడం ఏంటనే నిలదీతలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభా వేదికపై నుంచి పవన్ ప్రసంగం చూసిన తర్వాత నెటిజన్లు, పవన్ ప్రత్యర్థుల నుంచి ఇలాంటి ప్రశ్నలు వెల్లువెత్తడం విశేషం. పవన్ కనిపించగానే ‘సీఎం సీఎం’ అంటూ ఆయన అభిమానులు బిగ్గరగా అరిచారు. అలాగే పవన్ రావడానికి ముందు ఆ వేదికపై నుంచి ప్రసంగించిన జనసేన నాయకులంతా కాబోయే ముఖ్యమంత్రి పవన్‌కల్యాణే అని, ఎవరైనా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందే తప్ప, తాము ఎవరి పల్లకీలు మోయమని తెగేసి చెప్పారు. టీడీపీతో పొత్తు ప్రచారంపై జనసేన నాయకులు అభిప్రాయాల్ని ఆ విధంగా వెల్లడించారు.
పవన్ ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సహజంగానే రాజకీయ దాడి చేశారు. తనను నమ్మాలని, జనసేనను ఆదరించాలని పదేపదే విన్నవించారు. జనసేన ప్రభుత్వం వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గొప్పలు చెప్పారు. ఎంతో కాలం నుంచి తమ సామాజిక వర్గం నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నారని, మరి మీరంతా ఆదరిస్తే కదా కోరిక నెరవేరేదని చెప్పారు. అసలు కులమతాలకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం లక్ష్యమని జనసేన మ్యానిఫెస్టోలో ఉందని చెప్పిన పెద్ద మనిషి, ఇప్పుడు కూడా అదే మాట చెబుతూ, ఆచరణకు వచ్చే సరికి ....నేను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడినని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పనిలో పనిగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని తేల్చి చెప్పిన జగన్‌ను ఎలా ఆదరిస్తారని అక్కసు వెళ్లగక్కారు. కాపుల సంఖ్యా బలం ఎక్కువగా వుండడంతో జగన్ వారికి మాత్రమే భయపడతారని, కావున తన సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. సొంత సామాజిక వర్గం ఐక్యంగా వుంటే తప్ప తాను సీఎం కావడానికి అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. తన దగ్గర డబ్బు లేదని, కేవలం గుండె ధైర్యమే ఆస్తి అని పదేపదే ప్రకటించారు.
తీరా 175కు ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తావో చెప్పాలనే సీఎం జగన్ ప్రశ్నకు మాత్రం పవన్ వద్ద సమాధానం లేదు. అబ్బే... ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని మాత్రం ప్రకటించలేదు. పైగా ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాదని స్పష్టం చేశారు. ప్రయోగాలు చేయబోమని, అసెంబ్లీలో అడుగుపెట్టేందుకే తమ వ్యూహం ఉంటుందన్నారు. మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయాలని చెప్పారు. మీరేం కోరుకుంటున్నారో తనకు తెలుసని, అదే జరుగుతుందని, ఓటును వృథా కానివ్వనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల రాజకీయ ప్రస్థానం చేసిన నాయకుడు, చివరికి అసెంబ్లీలో అడుగు పెట్టడమే అతి పెద్ద టాస్క్‌గా మారడం పవన్‌కల్యాణ్ దయనీయ స్థితిని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓటు బ్యాంక్‌ను తన సామాజిక వర్గానిదే అయినప్పటికీ, వారు ఆదరించలేదనే ఆవేదనలో పవన్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. పవన్ విమర్శిస్తున్నట్టు... ఏపీలో కులపెత్తనమే వుంటే, తన సామాజిక వర్గమే కదా శాసించేది, మరి వారు తననెందుకు అక్కున చేర్చుకోలేదో పవన్ ఎప్పుడైనా ఆలోచించారా? పవన్ చెప్పేదొకటి, చేసేది మరొకటి. అందుకే పవన్‌కల్యాణ్ చివరికి తన సామాజిక వర్గం నుంచి కూడా విశ్వాసం పొందలేకపోయారు.
రాజకీయాల్లో నమ్మకం, విశ్వాసం ప్రధానమైనవని పవన్ ఇప్పటికే గ్రహిస్తే మంచిది. కేవలం చంద్రబాబు పల్లకీ మోయడానికే మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తున్నారని జనానికి బాగా తెలుసు. తన రాజకీయ పంథాపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్‌కు కూడా తెలుసు. అయితే జగన్‌పై విద్వేషాన్ని నింపుకున్న పవన్‌కల్యాణ్, ఆ వాస్తవాన్ని గ్రహించి తనదైన స్వతంత్ర రాజకీయ పంథాను కొనసాగించకపోవడమే ఆయనకు చేటు తెస్తోంది.
బాబు మోజులో పడి తనను తాను అర్పించుకుంటున్నారు. అయినప్పటికీ జనం ముందు ఆయన నటిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్టు రాజకీయ తెరపై పవన్ ఉత్తమ ప్రదర్శన చేస్తున్నారు. పవన్ నటనకు ఆస్కార్ పురస్కారం దక్కాల్సి వుంది. మరెందుకనో ఎవరూ గుర్తించడం లేదు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా