ఢిల్లీ ఆట‌లో పావు ప‌వ‌న్‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక‌త ఏమంటే ఆయ‌న‌కి ఆట రాదు, నేర్చుకోడు. తాను చాంపియ‌న్ అనుకునే అమాయ‌క‌త్వం లేదా మూర్ఖ‌త్వం. ఫుట్‌బాల్ టోర్న‌మెంట్‌కి వెళుతూ, బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేసే ర‌కం. రెండూ బాల్‌తోనే క‌దా ఆడేది అనుకుంటాడు.…

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక‌త ఏమంటే ఆయ‌న‌కి ఆట రాదు, నేర్చుకోడు. తాను చాంపియ‌న్ అనుకునే అమాయ‌క‌త్వం లేదా మూర్ఖ‌త్వం. ఫుట్‌బాల్ టోర్న‌మెంట్‌కి వెళుతూ, బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేసే ర‌కం. రెండూ బాల్‌తోనే క‌దా ఆడేది అనుకుంటాడు. ఆయ‌న‌కి రాజ‌కీయాలంటే నిజంగా సీరియ‌స్‌నెస్ వుందా, లేకుంటే జ‌స్ట్ ఫ‌న్‌, పార్ట్ టైమా అనేది కూడా అనుమాన‌మే.

గ్రాఫ్ మొత్తం చూస్తే, జ‌న‌సేన పార్టీ పెట్టిన వాడు, దానికి పునాదులు వేసి చావోరేవో తేల్చుకోకుండా, చంద్ర‌బాబు ఏవో అద్భుతాలు చేస్తాడ‌ని మ‌ద్ద‌తు ఇచ్చాడు. బాబు గెలిచిన త‌ర్వాత ప‌వ‌న్ నిజంగా సీరియ‌స్ అయితే రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి త‌న పార్టీ కేడ‌ర్‌ని నామినేటెడ్ పోస్టుల్లో స్థిర‌ప‌రిచి, నాయ‌కుల్ని త‌యారు చేసుకోవ‌డం, లేదా టీడీపీ త‌ప్పు చేసిన ప్ర‌తిచోట జ‌న‌సేన నిల‌దీస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డం. ఈ రెండూ  చేయ‌కుండా, పార్టీ నిర్మాణాన్ని గాలికి వ‌దిలి, సినిమాలు చేసుకుంటూ ఎల‌క్ష‌న్ వ‌చ్చే స‌రికి టీడీపీతో విభేదించి పోటీ చేశాడు. జ‌గ‌న్ వేవ్ స్ప‌ష్టంగా ఉన్నా తెలుసుకోలేక త‌న‌తో పాటు అంద‌ర్నీ ఓడ‌గొట్టాడు (గెలిచిన ఒక‌టి కూడా ఆయ‌న అకౌంట్ కాదు).

ఓట‌మి త‌ప్పు కాదు. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోక‌పోవ‌డం త‌ప్పు. చిత్తుచిత్తుగా ఓడిపోయిన కార‌ణాలు తెలుసుకుని, ఆత్మ ప‌రిశీల‌న చేసుకోకుండా, అప్పుడ‌ప్పుడు స‌భ‌లు పెట్టి డైలాగ్‌లు వ‌దిలాడు. డైలాగ్‌ల‌తో ఓట్లు ప‌డ‌వు. సినిమా న‌టుడు కాబ‌ట్టి ఎలాగూ జ‌నం వ‌స్తారు. యూత్‌లో ఇంత ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడు ప‌వ‌న్ ఒక్క‌డే. జ‌గ‌న్‌కి ఒక‌ప్పుడు వుండేది. ఇప్పుడు వుందో లేదో అనుమాన‌మే.

మాట‌లు మాట్లాడి, వైసీపీ వాళ్ల‌ని బూతులు తిడితే యూత్ చ‌ప్ప‌ట్లు కొడ‌తారు. వాళ్లు జ‌న‌సేన కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ‌దామ‌నే అనుకుంటారు. అయితే నాయ‌కుడే క‌న‌ప‌డ‌డు. ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లో బిజీ. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబుల‌కి దిశానిర్దేశం చేసే శ‌క్తి లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లోనే నాయ‌కులు లేన‌ప్పుడు గ్రామాల్లో ఎక్క‌డి నుంచి వ‌స్తారు? తెలుగుదేశంతో పొత్తు వుంటుందో లేదో తెలియ‌దు. బీజేపీతో క‌లిసి వెళ్తారో లేదో తెలియ‌దు. రాష్ట్ర నాయ‌కుల‌తో స‌ఖ్య‌త లేదు, కానీ ఢిల్లీలో పెద్ద‌ల్ని క‌లుస్తుంటాడు.

ప‌వ‌న్ ప‌రిస్థితి ఏమంటే ఇటు చంద్ర‌బాబు ఆడుకుంటాడు. అటు మోదీ ఆడుకుంటాడు. ఢిల్లీ పెద్ద‌ల‌కి క‌ర్నాట‌క ఎన్నిక‌ల అవ‌స‌రం వుంది. అక్క‌డ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌డం లేదు. అందుకే ప‌వ‌ర్‌స్టార్ ప్ర‌చారం కావాలి.

బ‌ళ్లారి, రాయ‌చూర్‌, కోలార్ జిల్లాల్లో క‌నీసం 25 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ప‌వ‌న్ ప్ర‌చారం పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌చారానికి ప‌వ‌న్ ఒప్పుకుంటే బీజేపీతో క‌లిసి వుంటాడ‌ని అర్థం. ఒప్పుకోక‌పోతే బీజేపీతో తెగ‌దెంపుల‌నే అర్థం. నిజానికి బీజేపీ ప‌వ‌న్‌ని జూనియ‌ర్ ఆర్టిస్టులా వాడుకుంటూ వుంది. ఎందుకంటే ఆ పార్టీ ఎలాగూ ఆంధ్రాలో అధికారంలోకి రాదు. జ‌గ‌న్‌తో పేచీ లేదు. అర్జెంట్‌గా చంద్ర‌బాబుని సీఎం చేయాల్సిన అవ‌స‌రం వాళ్ల‌కి లేదు. ఎందుకంటే బాబు గోడ‌మీద పిల్లి అని మోదీ కంటే బాగా తెలిసిన వాళ్లు ఇంకొక‌రు లేరు.

మ‌రి ఈ మొత్తం గేమ్‌లో ప‌వ‌న్‌కి ఏంటి లాభం? మోదీ, షాల‌ని ప‌వ‌న్ ఎలాగూ ధిక్క‌రించ‌లేడు. ధిక్క‌రిస్తే అత‌ని ఇమేజ్ పెరుగుతుంది. కానీ ప‌వ‌న్ గురించి తెలిసిన వాళ్లు అత‌ను అంత సాహ‌సం చేస్తాడ‌ని అనుకోరు. సోనియాని ధిక్క‌రించ‌డం వ‌ల్లే జ‌గ‌న్ క‌ష్టాలు ప‌డ్డాడు, ముఖ్య‌మంత్రి అయ్యాడు. జ‌గ‌న్‌కి ఉన్నంత తెగువ ప‌వ‌న్‌కి ఉంద‌ని అనుకోలేం.

మోదీ మాట‌లు విని క‌ర్నాట‌క ప్ర‌చారానికి వెళితే, చేస్తున్న సినిమాల‌న్నీ ఆగిపోతాయి. అవ‌న్నీ ఒక కొలిక్కి రావాలంటే ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ కావ‌చ్చు. ఈలోగా ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. మేలో జ‌రిగితే గ‌ట్టిగా ఆరు నెల‌లు టైమ్‌. ఒక‌వేళ ముంద‌స్తు జ‌రిగితే పూర్తిగా ఇబ్బంది. ఎందుకంటే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్ని ప‌క్క‌న పెడితే, పొత్తుల్లో భాగంగా అడిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా అభ్య‌ర్థులెవ‌రో ప‌వ‌న్‌కి కూడా తెలియ‌ని స్థితి.

మొత్తం ఈ ఢిల్లీ గేమ్‌లో ప‌వ‌న్ ఒక పావు మాత్ర‌మే. బీజేపీతో క‌లిసి ప‌వ‌న్ పోటీ చేస్తే ఆయ‌న గ్యారెంటీగా గెలుస్తాడు. కానీ ప‌వ‌న్‌తో పాటు ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలియ‌దు. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, అస‌లే ఒక ఎమ్మెల్సీ గెలుపుతో ఊపులో ఉన్న టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియ‌దు. బాబు తెలివి ఏమంటే గ్యారెంటీగా ఓడిపోయే కొన్ని సీట్ల‌ని ప‌వ‌న్‌కి ఇస్తాడు. ఇది కాకుండా కోవ‌ర్టుల‌ను పంపి, రేపు జ‌న‌సేన‌ని ఫినిష్ చేసే గేమ్‌కి రూట్ ఏర్ప‌రుస్తాడు. పార్టీ పెట్టిన ప‌దేళ్ల త‌ర్వాత కూడా జ‌న‌సేన ప‌రిస్థితి ఇంత సంక్లిష్టంగా వుందంటే దీనికి ప‌వ‌నే కార‌ణం.

ప‌వ‌న్ వ‌ల్ల ఒక‌సారి జ‌గ‌న్‌కి న‌ష్టం జ‌రిగింది (2014). ఒక‌సారి లాభం జ‌రిగింది (2019). మ‌రి ఈ సారి లాభ‌మో, న‌ష్ట‌మో ప‌వ‌న్ రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త మీద ఆధార‌ప‌డి వుంటుంది. ఆ మెచ్యూరిటీ ఉందా, వ‌స్తుందా అనేది కాల‌మే నిర్ణ‌యించాలి.