మనసులో అన్న చిరంజీవిపై అక్కసు, పైకి మాత్రం ప్రేమ ప్రదర్శన…జనసేనాని పవన్‌కల్యాణ్ రియల్ లైఫ్‌లోనూ తన అద్భుత నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అన్నను అవమానించింది తను, ఆ మచ్చను జగన్‌కు అంటించాలనే పవన్‌కల్యాణ్ ప్రయత్నం నాగరిక సమాజం అసహ్యించుకునేలా వుంది.
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో జనసేన నేత పవన్‌కల్యాణ్ పర్యటించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున 173 మందికి రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దవటంలో ఏర్పాటు చేసిన సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోయారు. తన అన్న చిరంజీవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానించారని పవన్‌కల్యాణ్ ఆవేదన చెందారే గానీ, నిజానికి ఆయన తిట్టింది మెగాస్టార్‌నే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
“ఇన్ని కోట్ల మందికి తెలిసిన హీరోని, నా కుటుంబంలోని వ్యక్తిని చేతులు ఇలా పట్టుకుని (దండం పెడుతూ) ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి అని…ఈ స్థాయికి ఈ వ్యక్తి (సీఎం) పట్టుకొచ్చాడంటే ఏమనుకోవాలి. ఎంత అహంకారం. నమస్కారం పెడితే ప్రతినమస్కారం కూడా పెట్టని వాడు. ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి (తిరుపతి) దగ్గరి నుంచి ఒకపెద్ద స్థాయికి వెళ్లిపోయి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని నా (సీఎం) దగ్గర చేతులు జోడించి ఇలా కూచుని వుండా ల్సిందే అన్న ఆధిపత్య ధోరణి ఏం సూచిస్తుంది? ఇలాంటి వ్యక్తులకే అలా ఉన్నప్పుడు సగటు మనిషి పరిస్థితి ఏంటి? అందరూ ఆలోచించాలి. రెండు షాపులున్న మురళి దగ్గరి నుంచి చిరంజీవి దాకా అందరూ చేతులు కట్టుకుని వుండాలని, మాకు ఎదురుతిరిగితే ఎంత పెద్ద మెగాస్టార్‌నైనా కింద కూచోపెడతాం అనే ఆలోచన ధోరణి” అని పవన్‌కల్యాణ్ మాట్లాడ్డం సర్వత్రా చర్చకు దారి తీసింది.
పవన్ ఆవేదన చెందినట్టు చిరంజీవిని సీఎం జగన్ ఎప్పుడూ అవమానించలేదు. అదే జరిగితే చిరంజీవి మళ్లీ జగన్ మొహం చూడడానికి ఆసక్తి చూపుతారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని సీఎం వద్దకు వెళ్లాల్సిన దుస్థితి చిరంజీవికి ఎందుకొస్తుంది? ఎంతో ముఖ్యమని భావిస్తే తప్ప జగన్ తన ఇంటికి ఎవర్నీ ఆహ్వానించరు. కానీ చిరంజీవి దంపతులను ఇంటికి ఆహ్వానించి జగన్ దంపతులు ఎంతో ఆదరణ చూపారు. ప్రేమతో వస్త్రాలు సమర్పించారు. ఆప్యాయతతో భోజనం పెట్టి పంపారు. ఆ తర్వాత కూడా చిరంజీవిని పలు సందర్భాల్లో జగన్ ఆహ్వానించి చిత్రపరిశ్రమలో ఆయన పరపతి పెంచారు.
చిత్రపరిశ్రమలో సమస్యలు తలెత్తినప్పుడు చిరంజీవి నాయకత్వంలో రాజమౌళి, మహేశ్‌బాబు, ప్రభాస్, నాగార్జున తదితర అగ్రహీరోలు వెళ్లి చర్చించారు. చిరంజీవిని తన పక్కనే కూచోపెట్టుకుని ప్రాధాన్యం కల్పించారు. కిందిస్థాయి నుంచి పైకి ఎదిగిన హీరోగా చిరంజీవి ప్రతి మనిషితోనూ ప్రేమగా, విధేయతగా ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెద్ద అయిన ముఖ్యమంత్రికి చిరంజీవి దండం పెట్టడం కూడా పవన్‌కు తప్పుగా కనిపించింది. చిరంజీవి, నాగార్జునలకు జగన్ ప్రాధాన్యం ఇవ్వడం మరో హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు రుచించలేదు. ఒక సందర్భంలో తన అసహనాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇవేవీ పవన్‌కల్యాణ్‌కు గుర్తున్నట్టు లేదు.
ఇదే పవన్‌కల్యాణ్ తన అన్నను అవమానించిన తీరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం పవన్‌కల్యాణ్ ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నారు. కానీ దొరకలేదు. మరి ప్రధాని మోదీని కలిసే అవకాశం వచ్చినా ఎందుకు వినియోగించుకోలేదనే ప్రశ్నకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అ్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ సభకు రావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనను కూడా ఆహ్వానించారని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. మరెందుకు ఆ సభకు వెళ్లలేదు అనే ప్రశ్నకు ఇప్పటి వరకూ జనసేన నుంచి సరైన సమాధానం లేదు. కానీ చిరంజీవి పక్కన కూచోవడం ఇష్టం లేకే పవన్‌కల్యాణ్ వెళ్లలేదని అంటే ఎవరైనా నమ్ముతారా? ఔను ఇదే పచ్చి నిజం. కేవలం తన అన్న పక్కన కూచోవడం ఇష్టం లేకే పవన్ ప్రధాని సభకు వెళ్లలేదనేది చేదు నిజం. ఇది పవన్ అంతరాత్మకు బాగా తెలుసు.
మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ భవిష్యత్ ఏంటి? చిరంజీవి వల్లే పవన్ హీరో అయ్యారు. ఆ ఇమేజ్‌తోనే రాజకీయాలంటూ నాటకాలాడుతున్నారనే విమర్శ ఉంది. జీవితాన్ని ఇచ్చిన అన్నపైనే పవన్‌కు కక్ష వుంటే, ఏ రకంగానూ సంబంధం లేని జగన్‌కు ప్రేమ వుండాలని పవన్ ఎలా కోరుకుంటున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. అయినప్పటికీ చిరంజీవి అంటే జగన్ ఇప్పటికీ, ఎప్పటికీ అభిమానిస్తారు. ఇది కూడా అన్న అంటే పవన్‌కు కోపం ఉండడానికి కారణమైంది.
జగన్‌తో చిరంజీవి భేటీ అయి ఎన్నాళ్లైంది? ఇప్పుడు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక పవన్ దురుద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? చిరంజీవిని జగన్ అవమానించారని చెప్పడం ద్వారా ఎవరి సానుభూతి పొందాలని అనుకుంటున్నారు? అన్నలో లేని అవమాన భావన… తమ్ముడిలో ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.