జనసేనాని పవన్‌కల్యాణ్ మాటలకు, ఆచరణకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఏది చెబుతారో, దానికి పూర్తి వ్యతిరేకంగా నడుచుకోవడం ఆయన ప్రత్యేకత. ఆయన షూటింగ్లకే పరిమితమై వుంటే అజ్ఞానం లోకానికి తెలిసేది కాదు. రాజకీయ పార్టీ అధినేత కావడంతో అప్పుడప్పుడు జనంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు మాటలు మాట్లాడాల్సి వస్తోంది.
తన కుల పిచ్చిని బహిరంగంగా బయటపెట్టుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలివైన నాయకుడెవరూ సమయం, సందర్భం లేకుండా కుల ప్రస్తావన తీసుకురారు. అదేంటో గానీ, పవన్ ప్రసంగమంతా కులం కేంద్రంగా నడుస్తోంది. ఈ ధోరణి చివరికి సొంత సామాజిక వర్గం కూడా ఛీ కొట్టేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాయలసీమ ప్రాంతానికి వెళ్లి అక్కడి సమస్యలపై ఊసెత్తకుండా, ఏ మాత్రం సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించారు. దీంతో రాయలసీమ సమాజ దృష్టిని ఆకర్షించలేకపోయారు. పైగా పదేపదే కులాల గురించి మాట్లాడి తనను తాను చులకన చేసుకున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. రాయలసీమలో కులపరమైన విద్వేషాలు ఎప్పుడూ లేవు. ఫ్యాక్షన్ గొడవలే తప్ప కుల ఘర్షణలు మచ్చుకైనా కనిపించవు. అలాంటి ప్రాంతానికి వెళ్లి కులాల గురించి పవన్ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.
వైఎస్ఆర్ జిల్లాలోని సిద్దవటంలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ కమ్మ, రెడ్డి కులాలతో పాటు మిగతా కులాలకూ సాధికారత రావాలన్నారు. ఇక్కడి నేతల్లో ఆధిపత్య ధోరణి బాగా పెరిగిందన్నారు. కులాన్ని అమ్ముకోడానికి తాను ఇక్కడికి రాలేదన్నారు. తన జీవితంలో కులాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు, రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన పెట్టామన్నారు. తాను ఎప్పుడూ ఒక కులానికి కొమ్ము కాయననన్నారు. జనసేన పార్టీ వైపు ఒక్కసారి చూడాలని కోరారు.
ఎంతసేపూ నేను, నా కులం, రాజకీయాల్లో మార్పు, కులానికి కొమ్ము కాయను లాంటి మాటలే తప్ప… పార్టీ పెట్టిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం పవన్‌కు ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి. 2014లో కులాన్ని అమ్ముకోడం కాకుండా, చేసిందేమిటి? ఇప్పుడు మళ్లీ పదేళ్లకు అదే పని చేయడానికి సిద్ధమైన మాట వాస్తవం కాదా? అనే ప్రశ్నలకు సమాధానం ఏంటి? అసలు రైతు భరోసా యాత్రలో కులాల గొడవ ఎందుకు? కులాన్ని అమ్ముకుంటున్నావని ఎవరన్నారు?
పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో ఏ రాజకీయ మార్పు తీసుకొచ్చారో చెబితే బాగుంటుంది! ఇంత కాలం చేయని పని, భవిష్యత్‌లో ఎలాంటి మార్పు తీసుకొస్తావనే ప్రశ్నకు పవన్ సమాధానం ఏంటి? జగన్ పేరు ప్రస్తావించడం కూడా ఇష్టం లేదని అంటున్నావంటే, వ్యక్తిగతంగా ఎంత విద్వేషాన్ని నింపుకున్నావో అర్థమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ఈ మాదిరి ఎప్పుడూ మాట్లాడలేదు. సోది కబుర్లు, స్వోత్కర్ష తప్ప పవన్ ప్రసంగంలో ఏముంది? పవన్ మాటలు వింటుందే ఆయనలో కులపిచ్చి బాగా పీక్కు చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే కులపరమైన ఆలోచనలు తీవ్రంగా వుంటే తప్ప, దాని మీదే రాజకీయాలు చేయాలని బుద్ధి ఉన్నోళ్లెవరూ అనుకోరు. ఆ పని పవన్ చేస్తున్నారు. చివరికి సొంత కులానికి కూడా నష్టం కలిగించేలా ఆయన నడత వుంటోంది.