అన్న‌తో పాటు సీనియ‌ర్ నేత‌కు ఆమె చెక్‌!

అన్న‌తో పాటు సీనియ‌ర్ నేతకు టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చెక్ పెట్ట‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. Advertisement నంద్యాల రాజ‌కీయాల్లో ఆమె ఎంట‌ర్ అవుతున్న నేప‌థ్యంలో ఈ…

అన్న‌తో పాటు సీనియ‌ర్ నేతకు టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చెక్ పెట్ట‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది.

నంద్యాల రాజ‌కీయాల్లో ఆమె ఎంట‌ర్ అవుతున్న నేప‌థ్యంలో ఈ ర‌క‌మైన ప్ర‌చారానికి తెర‌లేచింది. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్‌గా భూమా అఖిల‌ప్రియ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కార‌ణం తెలియ‌దు కానీ, ఆమెకు నంద్యాల‌పై క‌న్ను ప‌డింది. ఇటీవ‌ల కాలంలో ఆళ్ల‌గ‌డ్డ కంటే నంద్యాల స‌మ‌స్య‌ల‌పైనే ఆమె దృష్టి సారించారు.

గ‌తంలో నంద్యాల నుంచి అఖిల‌ప్రియ తండ్రి దివంగ‌త భూమా నాగిరెడ్డి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానందరెడ్డి బ‌రిలో నిలిచి గెలిచారు.

2019 ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మానంద‌రెడ్డి వైసీపీ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డి యాక్టీవ్‌గా క‌నిపిస్తున్న దాఖ‌లాలు లేవు. అయితే చెల్లి అఖిల‌ప్రియ‌లా ఆయ‌న ఎన్న‌డూ వివాదాల జోలికి వెళ్ల‌లేదు.

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫ‌రూక్ నంద్యాలలో బ‌ల‌మైన మైనార్టీ నాయ‌కుడు. నంద్యాల‌లో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువే. అయితే ఫ‌రూక్ త‌న‌యుడు , టీడీపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్ఎండీ ఫిరోజ్ నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఫిరోజ్ మ‌ధ్య ఆధిపత్య పోరు న‌డుస్తోంది.

ఇది చాల‌ద‌న్న‌ట్టు తాజాగా అఖిల‌ప్రియ అక్క‌డ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు. నంద్యాల‌లో పార్టీ కార్యాల‌యం ప్రారంభానికి నెల‌కు రూ.55 వేలు పెట్టి ఓ భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్న‌ట్టు స‌మాచారం. రూ.2 ల‌క్ష‌ల అడ్వాన్స్ కూడా చెల్లించిన‌ట్టు తెలిసింది. రానున్న రెండుమూడు రోజుల్లో అక్క‌డ కార్యాల‌యాన్ని ప్రారంభించేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే బ్ర‌హ్మానంద‌రెడ్డితో తీవ్ర‌మైన విభేదాలున్నాయి. క‌నీసం ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు కూడా లేవని స‌మాచారం. నంద్యాల‌లో పార్టీ కార్యాల‌యం ప్రారంభ ఏర్పాట్ల‌పై భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, సీనియ‌ర్ నేత ఎన్ఎండీ ఫ‌రూక్ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం.

ఆళ్ల‌గ‌డ్డ‌లో పార్టీని బ‌లోపేతం చేసుకోకుండా ఇక్క‌డికి ఎందుకొస్తున్నార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే నంద్యాల బాధ్య‌త‌ల్ని కూడా చూసుకోవాల‌ని అధిష్టానం చెప్పింద‌ని అఖిల‌ప్రియ స‌న్నిహితుల వ‌ద్ద అంటున్నారు. ఏది ఏమైనా నంద్యాల టీడీపీలో మూడు ముక్క‌లాట‌కు తెర‌లేవ‌నుంది.