వార్నీ కులం గోలను తగలెయ్య!

మన దేశంలో ‘కులం’ అనేది చాలా చాలా పెద్ద అంశం. ఎందరు ఎన్ని నీతులు మాట్లాడినా కులం అనేది చాలా విషయాలను శాసిస్తుంటుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు కూడా కులం ప్రాతిపదికగా నడుస్తుంటాయి. కులం…

మన దేశంలో ‘కులం’ అనేది చాలా చాలా పెద్ద అంశం. ఎందరు ఎన్ని నీతులు మాట్లాడినా కులం అనేది చాలా విషయాలను శాసిస్తుంటుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు కూడా కులం ప్రాతిపదికగా నడుస్తుంటాయి. కులం ప్రకారం జనాన్ని పోలరైజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు.

ఎన్నికల్లో ఏ కులం వారు నిలబడినా.. మిగిలిన కులాల వాళ్ల మద్దతు దక్కేలా ఆయా కులాల నుంచి.. ముఖ్యులు కొంతమందిని కీలకంగా మోహరించి.. వారిద్వారా ఆయా కులాల బలం సొంతం చేసుకుంటారు. కులరహిత సమాజం కావాలి.. లాంటి పడికట్టు మాటలు మాట్లాడేవాళ్లు ఫేస్ బుక్ ల్లో, వాట్సప్ స్టేటస్ లలో పెట్టుకోవడానికి పొద్దున్నే సంస్కర్తల అవతారం ఎత్తుతారు గానీ.. ప్రాక్టికల్ గా జరిగేది వేరు. 

ఇదే సమయంలో పార్టీలు కూడా తమ మీద కులం ముద్రలు ఉన్నప్పటికీ.. దానిని దాచుకుని ప్రజల్ని మాయ చేయడానికి ప్రయత్నించవు. ఏదో యథాలాపంగా ఒక్కోసారి మేం కులాన్ని పట్టించుకోం అంటారే తప్ప.. పార్టీలను బట్టి ప్రతి పార్టీలోనూ ఒకటి రెండు కులాలకు పెద్దపీట వేయడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది.

ఫలానా పార్టీ ఫలానా కులానిది అని అందరికీ తెలిసిన సంగతే అయినా.. ఆ పార్టీ కూడా తమ కులానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చినా, అదే సమయంలో అన్ని కులాలను ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయం అలా మాత్రమే నడుస్తుంటుంది. 

పవన్ కల్యాణ్ తీరు వేరు. ఆయన చెప్పే ఆదర్శాలు చాలా తియ్యగా, మహాద్భుతంగా కనిపిస్తాయి. తనను తాను విశ్వమానవుడిగా ఆయన అభివర్ణించుకుంటారు. తనకు కులమతాలు లేనే లేవని అంటారు. అలాంటి మాటలు పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితోనే చెబుతారని మనం నమ్మితే.. ఆయన వ్యక్తిత్వం పట్ల చాలా గౌరవం ఏర్పడుతుంది.

వేదిక మీద మాటలు ఇలాగే ఉంటాయి.. కానీ ఆచరణలో తీరు ఇంకోలా ఉంటుంది. 2019 ఎన్నికల్లో కాపుల జనాభా అత్యధికంగా ఉన్న రెండు నియోజకవర్గాలను మాత్రమే ఎంచుకుని అక్కడినుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. రెండు చోట్లా ఓడిపోవడం అనేది వేరే సంగతి. 

ఇప్పుడు ప్రత్యేకించి ప్రతి ప్రసంగంలోనూ కులాల గోల తెస్తున్నారు. మీ కులాలు మాత్రమే అధికారంలో ఉండాలా? వేరే కులాలను ఎదగనివ్వరా? మేం అధికారంలోకి వస్తే.. ఆ కులాలకు ప్రాధాన్యం ఇస్తాం.. అంటూ తనకు తెలిసిన అన్ని కులాల పేర్లూ చెబుతున్నారు. 

ఇప్పటిదాకా మన వ్యవస్థలో ఉన్న దరిద్రం ఏంటంటే.. కులాలకు ఎంత మేలు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు.. దాన్ని గురించి పెద్దగా చర్చ జరగదు. ఆ కులానికి ఓ మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం, ఆ కులస్తుడి మీద ఒక అవినీతి ఆరోపణ వస్తే మాత్రం కులానికి అన్యాయం చేసేసినట్టు చెప్తారు. అంటే నిమ్న కులాలను వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చేసే శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఆ కులం వారికి పెద్ద పదవులు ఇవ్వకపోతే మోసం చేసేసినట్టే లెక్క. 

‘కులానికి పదవి వస్తే మాత్రమే కులం ఎదుగుతుంది’ అనే నీచమైన ఆలోచనల సెటప్ లో మనం ఉన్నాం. పదవి ఏ కులానికి వచ్చినా, ఆ నాయకుడు కులమతాల చివరికి పార్టీల పట్టింపు కూడా లేకుండా ప్రజలందరి కోసం పనిచేయాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎన్నడో మరచిపోయాం. మూసలో నడుస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఇదే తరహాలో నడుస్తుంటాయి.

తాను సరికొత్త రాజకీయం చూపిస్తానని, అందరిలా కాకుండా దేశభక్తితో పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కల్యాణ్ కూడా.. ఇలాగే చేస్తే ఇక తేడా ఏముంది. కులాలు ఎదగాలంటే.. ఆ కులాలకు పదవులిస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం చాలా చీప్ గా ఉంది.

ఆ మాటకొస్తే.. మామూలు పదవులు కాదు.. ముఖ్యమంత్రి పదవి దక్కితే తప్ప ఏ కులమూ ఎదిగినట్టు కాదు- అనే వాదన తెస్తే.. పవన్ కల్యాణ్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఆయన ఎన్నికులాల వారికి ఆ ముఖ్యమంత్రి పదవిని పంచుతారు? ఎన్నేసి రోజుల వంతున పంచుతారు? ఈ లెక్కలన్నీ చాలా చీప్ గా కనిపిస్తాయి. 

పవన్ కల్యాణ్ కులాల గోల మానేసి విధానాల పరంగా, ప్రజలకు చేయగల మంచి పరంగా మాట్లాడితే.. కనీసం ఆయన తన గౌరవాన్ని కాపాడుకుంటారు. లేకపోతే.. పవన్ కొత్త ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడేమోనని అనుకునే కొందరు తటస్తుల అభిప్రాయం కూడా మంటగలిసిపోతుంది.