కుప్పంలో రాజ‌కీయం దోబూచులాట‌!

గ‌తంలో క‌నీసం నామినేష‌న్ వేయ‌డానికి కూడా వెళ్ల‌ని చంద్ర‌బాబు… స్థానిక సంస్థ‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఆయ‌న‌లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఇది ఓట‌మి భ‌యం తీసుకొచ్చిన మార్పుగా భావించొచ్చు. Advertisement రెండు నెల‌ల‌కు ఒక‌సారి…

గ‌తంలో క‌నీసం నామినేష‌న్ వేయ‌డానికి కూడా వెళ్ల‌ని చంద్ర‌బాబు… స్థానిక సంస్థ‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఆయ‌న‌లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఇది ఓట‌మి భ‌యం తీసుకొచ్చిన మార్పుగా భావించొచ్చు.

రెండు నెల‌ల‌కు ఒక‌సారి త‌ప్ప‌నిస‌రిగా కుప్పం వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. క్ర‌మం త‌ప్ప‌కుండా దాన్ని చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారు.

ఈ నెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించనున్నారు. ముఖ్యంగా ఈ ద‌ఫా రామ‌కుప్పం , కుప్పం, గుడుప‌ల్లె మండ‌లాల్లో ప‌ర్య‌టించడానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు.

1989 నుంచి చంద్ర‌బాబు కుప్పం ఎమ్మెల్యేగా వ‌రుస‌గా గెలుపొందుతున్నారు. అయితే కుప్పం చంద్ర‌బాబు అడ్డాగా భావించి, ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న గురించి ప‌ట్టించుకునేవాళ్లు కాదు. అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌నా ధోర‌ణి వేరు క‌దా?  చంద్ర‌బాబునే ఓడిస్తే… అని ఆలోచించారు.

ఇందుకు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అవ‌కాశంగా తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి చంద్ర‌బాబును ఓడించే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. చంద్ర‌బాబు ట‌క్కుట‌మార విద్య‌ల‌ను ఎస్వీ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న రోజుల నుంచి చూస్తున్న‌ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీడీపీ అధినేత ఎత్తుల‌కు పైఎత్తులు వేశారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి నేతృత్వంలో ప‌ద్మ‌వ్యూహం ప‌న్ని ఎట్ట‌కేల‌కు టీడీపీని మ‌ట్టి క‌రిపించారు.

దీంతో చంద్ర‌బాబులో ఓట‌మి భ‌యాన్ని సృష్టించ‌గ‌లిగారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఏ మాత్రం అజాగ్రత్త‌గా ఉన్నా… రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడిస్తార‌ని గ్ర‌హించారు. దీంతో కుప్పం టీడీపీలో రెండో శ్రేణి నాయ‌కుల‌ను న‌మ్ముకోకుండా నేరుగా తానే రంగంలోకి దిగారు. నెమ్మ‌దిగా పార్టీని చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. ఇందులో కొంత వ‌రకూ ఆయ‌న స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయ‌డం ఆ పార్టీకి న‌ష్టం తీసుకొస్తోంది. కుప్పం గెలుపు బాధ్య‌త‌ల్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ చూసుకుంటార‌ని, ఈ రెండేళ్ల‌లో సొంతింటిని చ‌క్క‌దిద్దుకుందామ‌నే ప‌నిలో అక్క‌డి నాయ కులున్నారు.

చివ‌రికి సొంత పార్టీ వాళ్ల నుంచి కూడా వ‌సూళ్ల‌కు కీల‌క నాయ‌కులు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. మొద‌టి నుంచి పార్టీ కోసం ప‌ని చేస్తున్న వాళ్ల‌కు కాకుండా, అధికారాన్ని వాడుకోవాల‌ని  స్వార్థంతో వెళ్లిన టీడీపీ నాయ‌కులే బాగుప‌డుతున్నార‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. స్థానిక సంస్థ‌ల్లో గెలుపు స్ఫూర్తి కాలం గ‌డుస్తున్న కొద్ది వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో త‌గ్గుతుండ‌డం ఆ పార్టీకి ఆందోళ‌న క‌లిగించే ప‌రిణామం. కానీ ఇది వాస్త‌వం.

స్థానిక సంస్థ‌ల్లో ఏ కార‌ణాలైతే వైసీపీ విజ‌యానికి దోహ‌దం చేశాయో, వాటిని రానున్న కాలంలో కొన‌సాగించ‌డం ఆ పార్టీకి క‌ష్టంగా మారింది. దీంతో చంద్ర‌బాబు విజ‌యావ‌కాశాల‌ను వైసీపీ ముఖ్య నాయ‌కులే మెరుగుప‌రుస్తున్నార‌న్న భావ‌న ఉంది.

కుప్పంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి, మ‌రోవైపు స్థానిక వైసీపీ నేత‌ల అవినీతి వెర‌సి…టీడీపీని బ‌లోపేతం చేస్తున్నాయ‌నేది నిజం. కుప్పంలో ఇప్ప‌టికీ వైసీపీకి అవ‌కాశాలున్న‌ప్ప‌టికీ, వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో స్థానిక నాయ‌క‌త్వం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతోంది. సంపాద‌న‌పై ఉన్న ఆస‌క్తి, చంద్ర‌బాబును ఓడించాల‌నే దానిపై కొర‌వ‌డింద‌న్న విమ‌ర్శ బ‌లంగా ఉంది.

ఈ రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను వైసీపీ ఏ విధంగా త‌న‌కు అనుకూలం చేసుకుంటుంద‌నేది కాలం జ‌వాబు చెప్పాల్సి వుంటుంది.