పవన్..మీకు అర్థం అవుతోందా?

పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? రాజకీయం అంటే..? జనం అంటే..? పార్టీ అంటే..? కేవలం అభిమాన జనం వుంటే సరిపోదు. సరైన దిశ..దశ వుండాలి. ఆ ఒక్క భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని (ఇది…

పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? రాజకీయం అంటే..? జనం అంటే..? పార్టీ అంటే..? కేవలం అభిమాన జనం వుంటే సరిపోదు. సరైన దిశ..దశ వుండాలి. ఆ ఒక్క భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని (ఇది పవన్ డైలాగే) ఏది పడితే అది మాట్లాడితే బాధపడేది పవన్ కాదు, ఆయన అభిమాన జనం. గ్రౌండ్ రియాల్టీ అన్నది పవన్ కు పట్టదు. పిచ్చిగా తప్పట్లు కొట్టే జనానికి తరువాత అర్థం అవుతుంది.

ప్రస్తుతం పవన్ రంకెలు వేసిన కాకినాడ నియోజకవర్గం సంగతే చూద్దాం. ఇక్కడ వన్..టూ రెండు వున్నాయి. తెలుగుదేశం పొత్తులో భాగంగా టూ (రూరల్) నియోజకవర్గం జనసేనకు వస్తుందన్న టాక్ వుంది. అక్కడ పంతం నానాజీ పోటీ చేస్తారు. సరే, మరి వన్ సంగతేమిటి? తెలుగుదేశం పార్టీ రెండూ వదలుకోదు కదా? అలా వదులుకుంటే పార్టీ నిర్వీర్యం అయిపోతుంది.అందువల్ల వదలుకోదు. అప్పుడు జనసేన మద్దతు దారు అవుతుంది తప్ప పోటీ దారు కాదు. అలాంటపుడు పవన్ వేసిన రంకెల పుణ్యమా అని జనసేన జనాలకు అండగా ఎవరు వుంటారు? రక్షణ సంగతి వదిలేయండి. పథకాలు ఎవరు ఇవ్వాలి?

తెలుగుదేశం తన కార్యకర్తలను చూసుకుంటుంది తప్ప జనసేన కార్యకర్తలది సెకెండ్ ప్లేస్ నే కదా? అదృష్టం బాగోక, ద్వారపురెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారనుకుందాం. అప్పుడు ఈ జనసేన రంకెల పర్యవసానం ఏమిటి? సరే, ఎన్నికల వరకు ఎందుకు? పవన్ వెళ్లిపోతారు. మళ్లీ ఇప్పట్లో ఆయన రారు. వచ్చిన చోటకు అసలు రారు. బయటకు వచ్చేదే ఏడాదికి ఆర్నెల్లకు. ఈ లోగా జనసేన కార్యకర్తలను ఎవరు చూసుకోవాలి

కాకినాడ రూరల్ లో నానాజీ చూసుకుంటారు. వన్ లో పోటీ అవకాశం లేదన్నపుడు ఎవరు చూసుకుంటారు. పోనీ బాధ్యులను ఎవరినైనా వుంచారా? అదీలేదు. మీకు సమస్య వస్తే ఫలానా వారు వున్నారు. వారి ద్వారా నన్ను సంప్రదించండి అని చెప్పావా పవన్? అదీ లేదు. పంచ్ డైలాగులు, సవాళ్లు కార్యకర్తలను రెచ్చగొట్టొచ్చు. చప్పట్లు కొట్టించవచ్చు. కానీ ప్రాక్టికాలిటీ చూడాలి. రోడ్ల మీదకు లాగుతా, బట్టలు విప్పి కొడతా… చితక్కొట్టేస్తా..అంటూ బెదిరింపులు మాస్ జనానికి పడతాయేమో? కానీ మిగిలిన సెక్షన్లకు నప్పవు. ఇదేదో రౌడీ రాజకీయం అనుకుంటారు.

చంద్రబాబు ఎప్పుడయినా లోకల్ రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం చూసారా? పేరు పెట్టి ఎప్పుడూ తిట్టరు. తాము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం అంటారు తప్ప, రోడ్డు మీదకు లాగుతాం. కాళ్లు చేతులు విరిచేస్తాం అనరు. పైగా చంద్రబాబు స్పీచ్ ల వల్ల కార్యకర్తలకు ఓ భరోసా వస్తుంది తప్ప, అక్కరలేని, అవసరానికి వాడని రౌడీ ఇజం, తెగింపు రాదు.

సరే ఈ సంగతి పక్కన పెట్టి మరోలా ఆలోచిద్దాం. ఈస్ట్ గోదావరికి వచ్చావు. ఈ జిల్లాకు ఏం కావాలి. చంద్రబాబు ఏం చేసారు. ఏం చేయలేదు..జగన్ ఏం చేసారు. ఏం చేయలేదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను? ఇది కదా చెప్పాల్సింది. కాకినాడ సిటీ సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కారం ఏమిటి? అది కదా చెప్పాలి. ఈ రంకెల వల్ల ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ పవన్ కు ఎప్పటికి అర్థం అవుతాయో?