అంత‌న్నాడు, ఇంత‌న్నాడు.. ప‌వ‌న్ చేతులెత్తేసిన‌ట్టేనా!

నిల‌క‌డ లేని రాజ‌కీయ నాయ‌కుడెవ‌రైనా ఉన్నారంటే… ఫ‌స్ట్ అండ్ లాస్ట్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరే వినిపిస్తోంది. జ‌న‌సేనానిగా ప‌వ‌న్ రాజ‌కీయ పంథా ల‌క్ష్యం లేకుండా సాగుతోంది. ఎప్పుడెలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ఆయ‌నకే తెలియ‌దు. తెలంగాణ‌లో జ‌న‌సేన…

నిల‌క‌డ లేని రాజ‌కీయ నాయ‌కుడెవ‌రైనా ఉన్నారంటే… ఫ‌స్ట్ అండ్ లాస్ట్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరే వినిపిస్తోంది. జ‌న‌సేనానిగా ప‌వ‌న్ రాజ‌కీయ పంథా ల‌క్ష్యం లేకుండా సాగుతోంది. ఎప్పుడెలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ఆయ‌నకే తెలియ‌దు. తెలంగాణ‌లో జ‌న‌సేన బ‌రిలో వుంటుంద‌ని, ఇటీవ‌ల పోటీ చేసే 32 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా జ‌న‌సేన ప్ర‌క‌టించింది.

తెలంగాణ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ కూడా వెలువ‌డింది. వ‌చ్చే నెల 3 నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌ల‌వుతుంది. న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు, డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువడుతాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన రాజ‌కీయ కార్య‌క‌లాపాలు వేగం అందుకుంటాయ‌ని అంద‌రూ భావించారు. తీరా చూస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో జ‌న‌సేన నాయ‌కులు నీరుగారిపోయే ప‌రిస్థితి.

హైద‌రాబాద్‌లో జ‌న‌సేన తెలంగాణ రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందే అని జ‌న‌సేన నాయ‌కులు ప‌ట్టు ప‌ట్టారు. గ‌తంలో హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు, అలాగే 2018లో కొత్త రాష్ట్రంలో రాజ‌కీయ గంద‌ర‌గోళానికి అవ‌కాశం ఇవ్వొద్ద‌నే ఉద్దేశంతో పోటీకి దిగ‌లేద‌ని, ఈ సారి మాత్రం బ‌రిలో వుండాల్సిందే అని ప‌వ‌న్ ఎదుట గ‌ట్టిగా మాట్లాడారు. ఒక‌వేళ పోటీ చేయ‌క‌పోతే తెలంగాణ‌లో ఇక జ‌న‌సేన‌ను మ‌రిచిపోవాల్సిందే అని , పార్టీ ఎదుగుద‌ల‌ను చేజేతులా ఆపుకున్న‌ట్టే అని నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందిస్తూ… క్షేత్ర‌స్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలనన్నారు. అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన‌డంతో జ‌న‌సేన నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు.

32 చోట్ల పోటీ చేస్తామ‌నడంతో పాటు,ఆ నియోజ‌క‌వ‌ర్గాల వివ‌రాల‌ను కూడా మీడియాకు వెల్ల‌డించడాన్ని జ‌న‌సేన నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడేమో త‌న‌పై ఒత్తిడి వుంద‌ని, అస‌లు పోటీ చేయాలా? వ‌ద్దా? అని తేల్చుకోడానికి రెండు రోజుల స‌మ‌యం అడ‌గ‌డం ఏంట‌ని జ‌న‌సేన నాయ‌కులు నిలదీస్తున్నారు. ఈ మాత్రం సంబ‌రానికి తెలంగాణ‌లో జ‌న‌సేన అంతా, ఇంతా అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం దేనికని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ తీరు చూస్తే… ఏపీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లే నిజ‌మ‌య్యేలా ఉన్నాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.