తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పంథా ఆకస్తికరంగా సాగుతోంది. తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి పాలన తేవాలని ఆమె కలలు కంటున్నారు. ఇందుకోసం షర్మిల తెలంగాణలో సొంతంగా వైఎస్సార్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అన్న వైఎస్ జగన్ వారించినా ఆమె లెక్క చేయలేదు. తెలంగాణలో లక్ష్యాన్ని ఆమె సాధిస్తారా? లేదా? అనే ప్రశ్నకు జవాబు చెప్పే పని కాలానికి వదిలేద్దాం. కానీ ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేని చోట కూడా రాజకీయంగా బలపడేందుకు ఆమె చేస్తున్న పోరాటం ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.
తెలంగాణపై విషయ పరిజ్ఞానం, అక్కడి ప్రజలతో మమేకం అయ్యేందుకు తెలంగాణ యాస ఒంటబట్టించుకోవడం, సంస్కృతి, సంప్రదాయాలను అక్కున చేర్చుకోవడం …ఇలా అన్ని రకాలుగా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలవరం విషయానికి వచ్చే సరికి ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్నేహ సంబంధాలపై నిలదీయడానికి వెనుకాడలేదు. ఆలింగనాలు, మిఠాయిలు తినిపించుకునేటప్పుడు పోలవరం గుర్తు రాలేదా దొరా అంటూ సీఎం కేసీఆర్‌ను నిలదీశారు.
రాజకీయాలను షర్మిల సీరియస్‌గా తీసుకున్నారనేందుకు ఇదే నిదర్శనం. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌పై ప్రతి వారం ఆమె దీక్ష చేస్టున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరగని పాదయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన షర్మిల తెలంగాణ ప్రజానీకం ఆదరణ పొందడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే తెలంగాణను వ్యతిరేకించిన నాయకుడి కూతురిగా షర్మిలకు అడ్డంకులున్నాయి.
అలాగే తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్ జగన్ చెల్లిగా షర్మిలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే వుంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య తెలంగాణలో రాజకీయంగా రాణించేందుకు, వారి ఆకాంక్షలకు ప్రతినిధిగా ఉంటాననే భరోసా కల్పించడం అంటే చిన్న విషయం కాదు. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తన లక్ష్యమని ఆమె పదేపదే చెబుతున్నారు. తనను నమ్మాలని అభ్యర్థిస్తున్నారు.
షర్మిల రాజకీయ పంథా నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి వుంది. ఏమీ లేని చోట అధికారాన్ని సాధించేందుకు షర్మిల శ్రమిస్తున్నారు. ఇదే పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం పవన్ స్వీయతప్పిదమే కారణం. పవన్ సంకుచిత మనస్తత్వమే ఆయన ఎదుగులకు అడ్డంకిగా మారింది.
రాజకీయంగా తాను ప్రత్యామ్నాయం కావాలనే ధ్యాస పవన్‌లో జనానికి కనిపించడం లేదు. ఎంత సేపూ జగన్‌ను గద్దె దించాలని, చంద్రబాబును ఎక్కించాలనే కనిపించని అజెండాతో పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ జనానికి అర్థమైంది. అందుకే ఆయన్ను కూడా గెలిపించలేదు. నిజంగా ఏపీ సమాజానికి ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి పవన్‌కల్యాణ్‌లో ఉంటే తెలంగాణలో షర్మిల పోరాటం నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. ఒక ఆడబిడ్డ తెలంగాణ అంతా కలియదిరుగుతూ విజయమో, వీరస్వర్గమో అని ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంటే, తానో పెద్ద హీరో అని పోజులు కొట్టే పవన్‌కల్యాణ్ చేస్తున్నదేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఏం చెబుతారు? షర్మిల ఈ మధ్యే పార్టీ పెట్టారు. కానీ జనసేనకు 9 ఏళ్ల వయస్సు. ఎంత తేడా?
తెలంగాణకు అన్యాయం విషయమై చివరికి అన్న జగన్‌ను కూడా ప్రశ్నించడానికి షర్మిల వెనుకంజ వేయడం లేదు. కానీ పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే….చంద్రబాబుపై ఈగ వాలనివ్వడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తారా? పవన్ రాజకీయాలే చేస్తున్నారా? లేక మరేమైనా చేస్తున్నారా? ఒక్కసారి పవన్ తన అంతరాత్మను ప్రశ్నించుకునే సమయం వచ్చింది.