జగన్ ప్రభుత్వం విచ్చలివిడిగా అప్పులు చేస్తోందని, ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే శ్రీలంకలా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేసిన మేధావులు, రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు ఎక్కడున్నారు? మన దేశం అప్పు అక్షరాలా రూ.155.33 లక్షల కోట్లు అని స్వయంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్ట సభ వేదికగా వెల్లడించింది. అప్పు చేసి పప్పు కూడు తినే పరిస్థితి రావాలని ఎవరూ కోరుకూడదు.
రాష్ట్రాల అప్పులపై తెగ హెచ్చరికలు చేస్తున్న కేంద్రప్రభుత్వం… మరి తాను చేస్తున్నదేంటి? తననెవరూ ప్రశ్నించే సాహసం చేయరనే లెక్కలేనితనం, బరితెగింపే దేశాన్ని దివాళా దిశగా నడిపిస్తోందని హెచ్చరించిక తప్పదు. ఎందుకంటే ఇదే వాస్తవం కాబట్టి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ భారతదేశం అప్పు రూ.46 లక్షల కోట్లు. మోదీ సారథ్యంలోని బీజేపీ 2014 నుంచి దేశాన్ని పరిపాలిస్తోంది.
మోదీ సర్కార్ ఎంత అద్భుతంగా పాలన సాగిస్తున్నదో ఈ ఎనిమిదేళ్లలో చేసిన రూ.109 లక్షల కోట్ల అప్పు నిదర్శనం. అప్పులతో దేశం వెలిగిపోతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికే అప్పులు చేశామని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ఎనిమిదేళ్ల మోదీ సర్కార్ పాలనలో చెప్పుకోతగ్గ, గర్వించ తగిన ఏ ఒక్క పనైనా చేశారా? అంటే లేనేలేదనే సమాధానం వస్తోంది. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ భూముల్ని విక్రయించడం, ఎల్ఐసీ లాంటి గొప్ప సంస్థని ప్రైవేటీకరించడం, విశాఖ ఉక్కును అప్పనంగా అమ్మకానికి పెట్టడం….ఇలా మోదీ పాలనలో అమ్మకం తప్ప, స్థాపనకు చోటెక్కడ? కేంద్ర ప్రభుత్వ నీతులన్నీ ఇతరులకు చెప్పడానికే.
జాతీయ రహదారులు, బ్రిడ్జీల నిర్మాణాల్ని తమ ఘనతగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. నిజానికి ఇందులో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేదు. ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్ విధానంలో జాతీయ రహదారులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టోల్‌గేట్లు పెట్టి ముక్కు పిండి మరీ జనాల నుంచి రుసుం వసూలు చేస్తున్న సంగతి తెలియదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు తమకు తాముగా వేసుకున్న రోడ్లే.
మరోవైపు చిన్న పిల్లలు తినే బ్రెడ్డు, తాగే పాలు, పెరుగు తదితర వాటిపై కూడా జీఎస్టీ వేసి జనాల్ని కేంద్ర ప్రభుత్వం చావబాదు తోంది. రాష్ట్రాల పన్నుల వాటాల్లో కూడా కోతలు విధిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి కేంద్రం విరుస్తోంది. అయినా మోదీ సర్కార్‌ను, బీజేపీని నిలదీసే దమ్ము, ధైర్యం ఈ దేశంలో ఏ ఒక్క పార్టీకి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా దేశ ద్రోహమో, మరొకటో మోపి జీవితాంతం జైళ్లలో మగ్గేలా భయకంపితుల్ని చేస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్ని శ్రీలంక అంటున్న బీజేపీ నేతలు… మరి కేంద్ర ప్రభుత్వ అప్పులతో భారత్ ఏమైనా అమెరికా మాదిరిగా సంపన్న దేశం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? అప్పులతో దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? ప్రశ్నించే గళాలు లేవని దేశాన్ని సర్వనాశనం చేసే హక్కు పాలకులకు ఉందా? ఏమిటీ దుస్థితి?