Advertisement

Advertisement


Home > Politics - Analysis

చిరంజీవి వెళ్తే పవన్ బాబు పరిస్థితి ఏంటి..?

చిరంజీవి వెళ్తే పవన్ బాబు పరిస్థితి ఏంటి..?

ఏపీలో మోదీ టూర్ కి మెగాస్టార్ కి కూడా ఇన్విటేషన్ ఉంది. అయితే ఆయన వెళ్తారా లేదా అనేది డౌటే. ప్రధాని అంతటి వ్యక్తి పిలిపించుకున్నారు కాబట్టి వెళ్లొచ్చు. మరి అప్పుడు పవన్ పరిస్థితి ఏంటి..? 

అన్నయ్య బీజేపీకి దగ్గరవుతుంటే తమ్ముడికి సంతోషమే కదా అనుకోవచ్చు. కానీ పవన్ కి సొంత పార్టీ జనసేన ఉంది. బీజేపీతో తెగతెంపులు చేసుకునే దశలో ఉంది. ఈ టైమ్ లో చిరంజీవిని బీజేపీ దువ్వాలనుకుంటోందా? పవన్ పై ఒత్తిడి పెంచాలనుకుంటోందా?

సందిగ్ధంలో పవన్ కల్యాణ్..

మోదీ పర్యటనకు తనకు పిలుపు లేకపోవడం ఒకరకంగా బాధాకరమే అయినా, చిరంజీవిని ఆహ్వానించడంపై జనసేనాని కనీసం సంతోషించాలి కదా. కానీ ఏపీలో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియని వేళ, పవన్ మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

మోదీతో నేను నేరుగా మాట్లాడగలను, అమిత్ షా తో నేను నేరుగా చర్చలు జరపగలను, అదీ నా స్థాయి అని చెప్పుకుంటుంటారు పవన్ కల్యాణ్. ఇక్కడ జనసైనికులు కూడా అలాగే బిల్డప్ ఇస్తుంటారు.

2014 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ చేయి పట్టుకుని మోదీ అభివాదం చేయడం మినహా.. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పవన్ కి బీజేపీ అంత సీన్ ఇవ్వలేదు. ఆ తర్వాత విడాకులు, మళ్లీ సర్దుబాట్లు చేసుకున్నా.. మోదీ దర్శన భాగ్యం మాత్రం లభించడంలేదు. ఇప్పుడు ఆయనే ఏపీకి వస్తున్నారు కాబట్టి, పవన్ ని పిలిపించుకుంటే అదో సంతోషం. కానీ జనసైనికులకు ఆ సంతోషం లేకుండా చేశారు మోదీ.

ఆమధ్య జేపీ నడ్డా పర్యటనలో కూడా పవన్ కల్యాణ్ కి కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. అసలు జనసేనను లెక్కలోకి కూడా తీసుకోకుండా బీజేపీ నాయకులకు ఉపదేశం ఇచ్చి వెళ్లారాయన. ఇప్పుడు మోదీ ఏపీకి వస్తున్నారు. కనీసం ఇప్పుడైనా బొకే ఇచ్చి, శాలువా కప్పే అవకాశం పవన్ కి ఉంటుందో లేదో చూడాలి.

మోదీ పర్యటనతో క్లారిటీ  

పవన్ ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కాస్త రెచ్చిపోయి ఉన్నారు. దీనిపై కచ్చితంగా పవన్ స్పందించాల్సిన అవసరం ఉంది. మొత్తమ్మీద ఏపీలో మోదీ పర్యటన పవన్ కి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. తనకు తాను పూసుకుంటే అది పరువు తక్కువ, కనీసం తన అన్నకు లభించిన గౌరవం విషయంలో అయినా పవన్ సంతోషపడతారేమో చూడాలి.

ఇవేవీ లేకుండా అసలు పవన్ నే లెక్కలోకి తీసుకోకుండా మోదీ ఇలా వచ్చి అలా వెళ్తే మాత్రం జనసేన సీరియస్ గా ఆలోచించాల్సిన సందర్భం వచ్చినట్టే. పవన్ పస ఏంటో అందరికి తెలిసిపోద్ది కాబట్టి, ఇంకా బీజేపీ తోక పట్టుకుని వేలాడితే లాభం ఉండదు. ఎలాగు వైసీపీ నుంచి కాస్త గట్టిగానే సెటైర్లు పడతాయి. ఒకరకంగా పవన్ కు మోదీ టూర్ తో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?