జూన్ 29 పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు వర్ధంతి. చిన్నప్పుడే గుండమ్మ కథ చూసినా, అది ANR, NTR సినిమానే. దర్శకుడి గురించి తెలుసుకునే వయసూ కాదు, జ్ఞానమూ లేదు. అయితే 1974లో రాయదుర్గంలోని కొందరు ప్రముఖులకి డబ్బులు ఎక్కువై సినిమా తీయాలని కోరిక పుట్టింది. దాంతో మద్రాస్ చేరుకుని జీవితాశయం అనే సినిమా స్టార్ట్ చేశారు. దీని డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు. మొదటిసారి ఆయన పేరు అలా విన్నాను.
ఆ సినిమాపైన ఒకటే క్రేజ్. మా స్కూల్లో ఏడో తరగతి చదివే నారాయణస్వామి పేరు మార్చుకుని మాస్టర్ సందేష్‌గా అవతరించి చిన్నప్పటి కృష్ణంరాజుగా యాక్ట్ చేశాడు. వాడు స్క్రీన్ మీద ఎలా వుంటాడో అని ఒకటే ఉత్కంఠ. దానికి తోడు ఒక పెళ్లి సీన్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ లాంటి ప్రముఖులు యాక్ట్ చేశారని ఊరంతా హడావుడి.
జీవితాశయంలో కృష్ణంరాజుతో పాటు ఎస్వీఆర్, నాగభూషణం, విజయనిర్మల పెద్ద స్టార్సే ఉన్నారు. అది విడుదలైన 10 రోజులకే రాయదుర్గం వచ్చేసింది ఉరుక్కుంటూ. థియేటర్‌కి వెళితే పరమబోర్. మద్రాస్‌లో వెంపటి దగ్గర డ్యాన్స్ నేర్చుకుని సంవత్సరం స్కూల్ ఎగ్గొట్టిన మా నారాయణస్వామికి ఒక పాట కూడా వుంది. టిక్ టిక్ ఓ చిలకమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గానే డ్యూయెట్. తర్వాత రాయదుర్గంలోనే స్కూల్ ఫంక్షన్లలో రికార్డ్ డ్యాన్స్‌ల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఇప్పుడు పెద్దాడై మనుమళ్లు, మనుమరాళ్లతో ఆడుకుంటున్నాడు. జీవితాశయం ప్రింట్ కాని, దానికి సంబంధించిన ఏ వివరమూ ఎక్కడా దొరకదు. అదో బాధ.
ఇంత ఘోరమైన సినిమాతో అంత గొప్ప డైరెక్టర్ పేరు వినాల్సి వచ్చింది. తర్వాత గుండమ్మ కథ తీసింది కూడా ఈయనే అని తెలిసి ఆశ్చర్యపోయాను. అంత గొప్ప డైరెక్టర్ అంత చెత్తని ఎలా తీసి వుంటాడా అనిపించింది. కాల మహిమ.
నిజానికి ఆయన తీసిన మొదటి సినిమా చంద్రహారం కూడా ఆడలేదు. పింగళి అద్భుత చమత్కారాలు కూడా పనిచేయలేదు. శ్రీరంజని, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా భయపెడతారు. తర్వాత చాలా హిట్ సినిమాలు వచ్చాయి. నర్తనశాల, పాండవ వనవాసం మరిచిపోలేం. ముఖ్యంగా ఎస్వీఆర్.
పిల్లలు, పెద్దలు కలిసి నటించిన బాలభారతం డైరెక్టర్ ఆయనే. శ్రీదేవి బాలనటిగా కనిపిస్తుంది. ఆయన సినీ విమర్శకుడిగా ప్రారంభమై డైరెక్టరయ్యాడు. కృష్ణా పత్రికలో సినీఫాన్ పేరుతో సినీ విమర్శలు చేసేవాడు. తన సినిమా బాగాలేదని విమర్శించినప్పటికీ హెచ్ఎం రెడ్డి ఉద్యోగమిచ్చి గృహలక్ష్మి సినిమా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేర్చుకున్నాడు.
రోహిణి సంస్థ లాడ్జిలో బస చేస్తున్నప్పుడు బీఎన్.రెడ్డి, కేవీ.రెడ్డి పరిచయం అయ్యారు. అప్పుడు కేవీ.రెడ్డి క్యాషియర్ మాత్రమే. కేవీ, కామేశ్వరరావు కలిసి ప్రతి సినిమా చూసి చర్చించుకునే వాళ్లు. వాహిణి స్టూడియో శంకుస్థాపనలో పాల్గొన్న వారిలో కామేశ్వరరావు ఒకరు.
ఆయన సినిమా రంగానికి పరిచయం చేసిన అతి గొప్ప రచయిత పింగళి నాగేంద్రరావు. ఇద్దరిదీ బందరు కావడంతో వారి స్నేహం సినిమాకి ఎంతో మేలు చేసింది. విజయా సంస్థలోనే చంద్రహారం కమలాకర మొదటి సినిమా చేశారు. 1998లో వెళ్లిపోయారు. 88 ఏళ్లు బతికారు.
జీఆర్ మహర్షి